అధికారులూ .. హాజరు కాకపోతే రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోండి
హాజరుకానిఅధికారులపై జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం
యూరియా సరఫరాలో రాజకీయ జోక్యం నివారించాలి
రైతులకు అవసరమైన మామిడి కవర్లు అందజేయాలి
కుప్పంలో లేని సమస్యలు సృష్టించి నిధుల దుర్వినియోగం
తాగునీటి బోర్లకు 24 గంటల్లో జడ్పీ నుంచి అనుమతి
వితంతు పెన్షన్లు ఇవ్వాలని జిల్లా పరిషత్ తీర్మానం
ప్రోటోకాల్ పై విరుచుకుపడిన సత్యవేడు ఎమ్మెల్యే
చిత్తూరు, ఏప్రిల్ 4 (ఆంధ్రప్రభ బ్యూరో) : అధికారులూ ... తమాషాలు చేస్తున్నారా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ సమీక్షా కార్యక్రమాలకు హాజరు కారా? మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి ఇళ్లకు వెళ్లండి. సమీక్ష సమావేశాలకు హాజరు కావడం మీ విధి. హాజరుకాని అధికారులను గుర్తించి సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాను. ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోసారి జిల్లా పరిషత్ సమావేశాలకు అధికారులు రాకపోతే ఊరుకునేది లేదు. అధికారులు ప్రజాప్రతినిధులకు సమాధానాలు చెప్పాలి. మీరు రాకపోతే మీ తరఫున సభ్యులు అడిగే ప్రశ్నలకు ఇక్కడ ఎవరు సమాధానాలు చెబుతారు? సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అంటూ చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అధికారుల గైర్హాజరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భవిష్యత్తులో జరిగే సమావేశాలకు మూడు జిల్లాలకు సంబంధించి అన్ని విభాగాల అధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. శనివారం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు పాల్గొన్నారు. ప్రారంభంలో సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వాటికి సమాధానం ఇవ్వడానికి తిరుపతికి చెందిన ట్రాన్స్‌కో ఎస్‌ఈ, వ్యవసాయ శాఖ జేడీ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అధికారులు హాజరు కాకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.
ఎరువుల కొరతపై జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరా విషయంలో రాజకీయ దృక్పథం ఎక్కువైందన్నారు. అవసరమైన రైతులకు యూరియా అందడం లేదని, కొందరు నాయకులు సూచించిన వారికి మాత్రమే యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు అందజేస్తున్నారని, మిగిలిన రైతులకు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో రాజకీయ జోక్యాన్ని నివారించి అవసరమైన రైతులందరికీ యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, వేరుశనగ విత్తనాలను సిద్ధం చేయాలని కోరారు. జిల్లాలోని మామిడి రైతులను ఆదుకోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఇరాన్ యుద్ధం కారణంగా మామిడి పల్ప్ ఎగుమతి నిలిచిపోయిందని, ఈసారి మామిడికాయలను తీసుకోవడం జరగదని కొంతమంది జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు ప్రచారం చేస్తున్నారని చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం నష్టపోయిన రైతులకు ఈసారి అయినా న్యాయం చేయాలని, ముందస్తు చర్యలతో ఫ్యాక్టరీ యజమానులతో మాట్లాడి రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 50 శాతం మాత్రమే పంట వచ్చే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం ఎకరాకు 15 వేల కవర్లు అందజేసిన ఉద్యానవన శాఖ, ప్రస్తుతం ఎకరా మామిడి తోటకు 6 వేల కవర్లు మాత్రమే అందజేస్తోందని, కవర్లు చాలక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముందుగా ఎక్కువ సంఖ్యలో కవర్లను తెప్పించుకోవాలని సూచించారు. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా మామిడి కవర్లను అందజేయాలని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో కూడా సరిపడా మామిడి కవర్లను అందజేయకపోవడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో సమస్యలు లేకున్నా సమస్యలు ఉన్నట్లు సృష్టించి అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రానున్న వేసవిలో తాగునీటి సమస్య లేకుండా గ్రామీణ నీటి సరఫరా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా బోర్ల అవసరమైతే జిల్లా పరిషత్‌కు ప్రతిపాదనలు పంపితే 24 గంటల్లో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వితంతువులందరికీ పెన్షన్లు ఇవ్వాలని జిల్లా పరిషత్ తరఫున ఒక తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.
సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం మాట్లాడుతూ ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించాలని, ఎంపీడీవోల బదిలీలపై తాను ప్రతిపాదనలు పంపినా ఎందుకు చర్యలు తీసుకోలేదని జిల్లా పరిషత్ అధికారులను ప్రశ్నించారు. రాయలచెరువు తెగిపోవడంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఎప్పుడు అందజేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో రైతులు ఎంత నష్టపోయారు అన్న వివరాలు సేకరించారా అని ప్రశ్నించారు. రాయలచెరువు పునరుద్ధరణకు టెండర్ ప్రక్రియ చేపట్టారా, లేక నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారా తనకు తెలియజేయాలని కోరారు. దీనిపై పంచాయతీ రాజ్ అధికారులు స్పందిస్తూ చెరువులో పూడిక తీయడాన్ని నామినేషన్ పద్ధతిలో అప్పగించామని తెలిపారు. చెరువు పునరుద్ధరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఇప్పటివరకు మంజూరు కాలేదన్నారు. తాను మంజూరు చేసిన 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయినా తన చేత ప్రారంభం చేయించలేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తన చేత ప్రారంభోత్సవం చేస్తారా, లేక నేనే వెళ్లి ప్రారంభించాలా అంటూ ప్రశ్నించారు. మరో వ్యక్తి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు పనిచేయడం ఏమిటని నిలదీశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించామని తెలిపారు. రాయలచెరువు తెగిపోవడంతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పాఠశాల భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని కోరారు. దీనిపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీనివాసులు స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ట్రాన్స్‌కోలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో భారీ అవినీతి జరిగిందని, ఒక్కో నియామకానికి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు.
కొంతమంది జడ్పిటిసి సభ్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో యూరియా ఇవ్వాలంటే డీఏపీ లేదా పొటాషియం కొనాలని షరతు విధిస్తున్నారని తెలిపారు. మండలాల్లో కొందరు నాయకులు చెప్పిన వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులైన తమకు ప్రోటోకాల్ పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి సలహా కమిటీలు ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, మందులు, వైద్యం తగినంతగా లేవని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ మాట్లాడుతూ మే 1వ తేదీ నుంచి జనగణన ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందుకు జడ్పిటిసి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జనగణన సిబ్బంది, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులు ప్రజాప్రతినిధులు డుమ్మా
శనివారం చిత్తూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం మాత్రం హాజరయ్యారు. జిల్లాలో మిగిలిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, చైర్మన్లు ఎవరు హాజరు కాలేదు. ఆదిమూలం కూడా గంటపాటు సమావేశంలో ఉండి అనంతరం వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ కారణంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా హాజరు కాలేదు. జిల్లా కలెక్టర్ స్థానంలో డిఆర్ఓ మోహన్ కుమార్ హాజరయ్యారు. మూడు జిల్లాలకు సంబంధించిన పలువురు జిల్లా అధికారులు సమావేశానికి హాజరు కాలేదు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వేదిక పైన ఉన్నవారు ఇబ్బంది పడ్డారు.

