భూగర్భ జలాల పెంపునకు 100 రోజుల ప్రణాళిక
మూడు మీటర్ల భూగర్భ జలాల పెంపు లక్ష్యం
జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు
చెరువులను లోతు చేయడం, గట్టులను పటిష్టం చేయడం
సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రణాళిక అమలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
రాష్ట్ర ప్రభుత్వం నీటి సంక్షోభాన్ని ముందుగానే ఎదుర్కొనే దిశగా నీటి భద్రత సాగునీటి సంపదల అభివృద్ధి పేరిట 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 6 నుంచి జూలై 14, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్న ఈ మహత్తర యజ్ఞం చిత్తూరు జిల్లాలో విస్తృత స్థాయిలో చేపట్టబడుతోంది. చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి కీలక అంశాలను కేంద్రబిందువుగా తీసుకుని ఈ కార్యక్రమం నాలుగు దశలుగా అమలు కానుంది. ఇందుకోసం జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. చెరువులలో పూడిక తీయడం, సప్లై చానెల్స్ లో అడ్డంకులు తొలగించడం, చెరువు కట్టలను బలోపేతం చేయడం, నీటి నిర్వ సామర్థ్యం పెంచడం వంటి పనులను చేపట్టనున్నారు. ఇందుకోసం జె ఆర్ ఎం ఎం నిధులను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సాగునీటి సంఘాలు ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి.
జిల్లాలో నీటి వనరుల ప్రస్తుత పరిస్థితి చూస్తే, మొత్తం 3106 చెరువులు ఉండగా, వాటి ద్వారా సుమారు 88,872 ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతోంది. అదనంగా ఇతర సాగునీటి వనరుల ద్వారా మరో 6125 ఎకరాలకు నీటి అందుబాటు ఉంది. మొత్తం 219 సాగునీటి సంపదలు, ఒక ప్రాజెక్ట్ జిల్లాలో ఉండటంతో, ఈ వనరుల సమర్థ వినియోగం అత్యవసరంగా మారింది. ఇదే దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం విశేషం. ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం కేవలం పనులు చేయడమే కాకుండా, క్షేత్రస్థాయిలో నీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడం కూడా. రైతులు, నీటి వినియోగదారుల సంఘాలు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. నీటి విలువను అర్థం చేసుకుని, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగాలని అధికారులు సూచిస్తున్నారు. పనుల అమలు ప్రక్రియను కచ్చితమైన కాలపట్టికతో రూపొందించారు. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు పనుల గుర్తింపు, 16 నుంచి 20 వరకు పరిపాలనా అనుమతులు, ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు పనుల అమలు, చివరి దశలో జూలై 10 నుంచి 14 వరకు సమీక్ష, నివేదికల సమర్పణ చేపట్టనున్నారు. ఈ విధంగా సమయపాలనతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా చేపట్టబోయే పనుల్లో చెరువులలో పేరుకుపోయిన మురుగు, మట్టిని తొలగించడం, చెరువులకు నీరు వచ్చే కాలువలను శుభ్రపరచడం, చెరువు కట్టలను బలోపేతం చేయడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే వరద నీటి మార్గాలను అడ్డుకుంటున్న అడ్డంకులను తొలగించడం, భూగర్భ జలాల పెంపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం కూడా ఇందులో భాగం. ప్రతి చెరువును పునరుద్ధరించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైతులకు దీర్ఘకాలిక లాభాలు కల్పించాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
కార్యక్రమం అమలుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో వ్యవసాయం, ఆదాయ, అటవీ, భూగర్భ జల శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. మండల స్థాయిలో మండల అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో కమిటీలు, గ్రామ స్థాయిలో సర్పంచ్‌ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పనులు చేపట్టనున్నారు. గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా కార్యక్రమాన్ని మరింత ఫలప్రదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిధుల విషయానికి వస్తే, జల జీవన్ మిషన్‌తో పాటు ఇతర పథకాల నిధులను సమన్వయంతో వినియోగించనున్నారు. భూగర్భ జలాల స్థాయిని కనీసం 3 మీటర్ల మేర పెంచడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. లక్షల ఎకరాల సాగునీటికి ప్రయోజనం చేకూరేలా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నారు. కనీసం ఒక లక్ష చెరువుల ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచే దిశగా చర్యలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 10న మండల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రజలు, రైతులు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిస్తున్నారు. కార్యక్రమం ముగింపు సమయంలో తుది నివేదికలు సమర్పించి, సాధించిన ఫలితాలను అంచనా వేయనున్నారు. నీటి సమస్య భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది. నీరు ఉంటేనే జీవితం అన్న సూత్రంతో ప్రతి గ్రామం, ప్రతి చెరువు పునరుజ్జీవం పొందేలా చర్యలు చేపడుతున్నారు. ప్రజల సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని, చేపట్టిన పనుల ఫోటోలు, వీడియోలను ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి వేదికలలో పంచుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే నీటి సంరక్షణ సాధ్యమవుతుందని, దీర్ఘకాలంలో ఇది వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమివ్వనుందని అధికారులు పేర్కొన్నారు.

