యూరియా కోసం రైతుల యుద్ధం…
చిత్తూరు రైతుల కష్టాలు తీవ్రం
నిల్వలో ఉన్నాయి అంటున్న అధికారులు
రైతులకు అందుబాటులో లేని ఎరువులు
డిఏపి, కాంప్లెక్స్ కొంటేనే యూరియా
బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడుతున్న డీలర్లు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
చిత్తూరు జిల్లా వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్రమైన ఎరువుల సంక్షోభంలో చిక్కుకుంది. రబీ సీజన్ కీలక దశలో ఉండగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారుల ప్రకటనల్లో నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కోసం రైతులు ఆర్బీకేలు, సహకార సంఘాలు, ప్రైవేట్ దుకాణాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం అక్కడక్కడ ఎరువులు ఉన్నట్టు సమాచారం. అయితే డిఏపి కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని ప్రవేటు డీలర్లు షరతుల విధిస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలలో యూరియా నిల్వలు లేవనే సమాచారం. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా దేశానికి రావలసిన యూరియా ఆగిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత విలయతాండవం చేస్తోంది. ఇదే అదునుగా కొంతమంది డీలర్లు నిల్వలను దాచిపెట్టి బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు ప్రాంతాల్లో రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. తెల్లవారుజాము నుంచే క్యూల్లో నిలబడినా యూరియా దొరక్కపోవడంతో ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కొన్ని కేంద్రాల్లో రోజుకు 10 సంచులు మాత్రమే ఇవ్వడం వల్ల అవసరాలు తీరడం లేదు. ఈ సీజన్‌లో రెండు లక్షల సంచులకుపైగా అవసరం ఉండగా సరఫరా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో యూరియా నిల్వలు లేవని రైతులు చెబుతున్నారు. ప్రైవేట్ డీలర్లు మాత్రం కొంతమేరకు నిల్వలు ఉంచుకున్నప్పటికీ, యూరియా ఇవ్వడానికి షరతులు పెడుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని చెప్పడం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అవసరం లేని ఎరువులు కొనుగోలు చేయాల్సి రావడంతో రైతులకు ఆర్థిక భారమవుతోంది. మాకు అవసరం లేని ఎరువులు ఎందుకు కొనాలి? యూరియా కోసం ఇలా షరతులు పెట్టడం అన్యాయం అని పలమనేరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు నిల్వలు దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి, ఐదు రోజుల్లోనే 38.46 మెట్రిక్ టన్నుల ఎరువులు, 331.15 లీటర్ల పురుగుమందులను స్వాధీనం చేసుకున్నారు. రూ. 12.14 లక్షల విలువైన సరుకును పట్టుకోవడం ద్వారా పరిస్థితి తీవ్రత బయటపడింది.
అంతర్జాతీయ పరిణామాలు కూడా జిల్లాపై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధిలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఎల్ఎన్జీ, పెట్రోలియం రవాణా దెబ్బతిని, ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరా మందగించింది. విదేశాల నుంచి రావాల్సిన ఎరువుల దిగుమతులు ఆలస్యం కావడం కూడా కొరతకు కారణమైంది. అయితే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం కొరత లేదని స్పష్టం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళి మాట్లాడుతూ జిల్లాలో 2,815 టన్నుల యూరియా, 760 టన్నుల డీఏపీ, 4,300 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు నిల్వలో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామ వ్యవసాయ అధికారుల సిఫార్సుల మేరకు పంపిణీ జరుగుతోందని చెప్పారు. అయినప్పటికీ ఈ నిల్వలు రైతుల చేతికి చేరడం లేదనే వాస్తవం ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల వాదన ప్రకారం రైతులు అవసరానికి మించి యూరియా వినియోగించడం, భవిష్యత్ కొరత భయంతో నిల్వ చేసుకోవడం కూడా సమస్యకు కారణమని చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం దీనిని ఖండిస్తూ సరఫరా లోపమే అసలు కారణమని అంటున్నారు. రబీ పంటల సాగు పూర్తయిందని అధికారులు చెబుతున్నా, ప్రస్తుతం యూరియా కోసం పడుతున్న కష్టాలు వారి మాటలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీ, సహజ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇవి తక్షణ పరిష్కారం కాదని రైతులు అంటున్నారు. పేడ, మున్సిపల్ వ్యర్థాలతో కంపోస్ట్ తయారీ వంటి సూచనలు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితిలో రైతులకు అవసరం సమయానికి యూరియా అందడం మాత్రమే. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో యూరియా కొరత రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధికారులు చెబుతున్న లెక్కలు, క్షేత్రస్థాయి వాస్తవాల మధ్య విరుద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే కట్టుదిట్టమైన పర్యవేక్షణ, పారదర్శక పంపిణీ వ్యవస్థ అమలు చేయకపోతే, ఈ సంక్షోభం మరింత తీవ్రమై పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

