29, మార్చి 2025, శనివారం

తెలుగు వారికీ నూతన సంవత్సర పండుగే ఉగాది

బ్రహ్మదేవుడు ఉగాది  రోజున సృష్టిని ప్రారంభించారని నమ్మకం 

 ఉగాది వసంత ఋతువు ఆరంభానికి సంకేతం

 కొత్త శకం, కొత్త ఆశలు, కొత్త ఆరంభాలకు నాంది  ఉగాది

గాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం

 నేడే విశ్వావసు నామ సంవత్సర ఉగాది 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

ఉగాది పండుగ తెలుగు వారికి నూతన సంవత్సర ఆరంభం, ఇది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర శుక్ల పక్ష పాడ్యమి నాడు వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 30 న ఆదివారం నాడు జరుపుకుంటారు. ఉగాది అంటే "యుగం", "ఆది" అని అర్థం, అంటే కొత్త యుగం ప్రారంభం అని సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. ఉగాది వసంత ఋతువు ఆరంభానికి సంకేతం, ప్రకృతిలో మార్పులను సూచిస్తుంది. గాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా ఉంటుంది, ఇది జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు, ఇది నూతన సంవత్సరంలో గ్రహగతులు, పంటలు, వర్షాలు, యుద్ధాలు వంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉగాదిని ఇళ్లను శుభ్రపరచడం, రంగోలిలతో అలంకరించడం, ప్రత్యేక వంటకాలు తయారు చేయడం మరియు బ్రహ్మ దేవుడిని పూజించడం ద్వారా జరుపుకుంటారు. ఉగాది కొత్త ప్రారంభం, కొత్త శకం, కొత్త ఆశలు, కొత్త ఆరంభాలకు నాంది అని సూచిస్తుంది. 

ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది. ఉగాది  - వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాదిని  జరుపుకుంటామని కూడా చెపుతారు. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినమే 'ఉగాది'. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి , పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది  పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది. హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది.ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు.ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు.ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగే ఉగాది. ఈ ఉగాది ప్రజలందరికి సర్వ శుభాలను కలుగచేయాలని ఆశిద్దాం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *