3, మార్చి 2025, సోమవారం

అన్నదాత సుఖీభవ పథకం నిధుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతన్న

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభం కానీ పధకం

ఈ ఆర్థిక సంవత్సరం అన్నదాత సుఖీభవ లేనట్లే  

ఇప్పటికే రెండు సార్లు ఆర్థిక సహాయం చేసిన కేంద్రం 

కేంద్ర నిధులతో కలిసి ఇవ్వాలన్న రాష్ట్రం ఆలోచనకు ఎన్నికల కోడ్ అడ్డంకి

అప్పులు చేసి, వ్యవసాయం చేస్తున్న రైతులు 


ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రకటించిన  20 వేల రూపాయల కోసం రాష్ట్రంలోని రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలులో ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలోని రైతులకు అన్నదాత సుఖీభవ కింద నిధులు విడుదల అవకాశాలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ యోజన పథకం కింద రెండు పర్యాయాలు 4 వేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది.. కేంద్ర ప్రభుత్వం అందజేయు ఆర్థిక సహాయంతో పాటు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సహాయం అందజేయాలని తొలిత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రైతు భరోసా కార్యక్రమం పేరును మార్పు చేసి అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త పథకం తీసుకుని వచ్చింది. 


ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందజేసిన నిధులతో పటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందజేయక అందజేయలేకపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కొనసాగుతుండగానే మళ్లీ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో విడత నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో రాష్ట్రంలో మరోమారు ఎన్నికల కోడ్ లోకి వచ్చింది. ఇవన్నీ పూర్తికావడానికి ఈ నెలాఖరు వరకు  పడుతుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందజేసే కార్యక్రమం దాదాపుగా లేనట్లుగా విదితం అవుతుంది. రాష్ట్రంలో మామిడి తోటలకు సంబంధించిన వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మామిడి పూత దశలో ఉంది. అక్కడక్కడ మామిడికి  తెగుళ్ళు వ్యాపిస్తున్నాయి. మామిడి పూత నెల నుంచి నెలన్నర ఆలస్యంగా వచ్చింది. దీంతో రైతులు పుత నిలవడానికి ఇప్పటికే రెండు, మూడు పర్యాయాలు మందులను పిచికారి చేశారు. ఇక మామిడి తోటలకు నీళ్లు పెట్టాల్సి ఉంది. దీంతో అన్నదాతకు వ్యవసాయ ఖర్చులు భారీగా అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు వమ్ము కావడంతో, రైతులు ప్రైవేట్ గా అప్పులు చేసి మామిడి తోటల మీద పెట్టుబడి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం 'సూపర్‌ సిక్స్‌' కార్యక్రమం కింద రైతులకు 'అన్నదాత సుఖభీభవ పథకం కింద   ఏడాదికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిషాన్ యోజన కింద 6 వేల రూపాయలను మూడు విడుతలుగా అందచేస్తుంది. దానితో కలిపి రాష్త్ర ప్రభుత్వం మరో 14 వేల రూపాయలను కలిపి 20 వేల రూపాయలుగా రైతులకు జమ చేస్తుంది.  ఈ పథకం అమలుకు రూ.4,500 కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో  ప్రతిపాదించారు. రాష్ట్రంలోని భూమిలేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి రూ.20 వేల చొప్పున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించారు. ఈ అన్నదాతీ సుఖీభవ పథకం విధివిధానాలు, మార్గదర్శకాలపై ప్రభుత్వ ఆదేశాలు త్వరలో జారీ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు చెప్పారు.  రైతులకు ఆర్థిక సాయం అందించే అన్నదాత సుఖీభవను పధకం వచ్చే ఆర్థిక సంవత్సరానికి  వాయిదా వేశారనే వార్తలు రైతుల్లో, కౌలు రైతుల్లో గుబులు రేపుతోంది. భారీ వర్షాలు, వరదలు, కరువు వలన ఖరీఫ్‌ సజావుగా సాగలేదు. లక్షల ఎకరాల్లో వేసిన పంటలు చేతికి రాలేదు. వరదల్లో పంటలు నష్టపోయిన రైతుల్లో కొందరికే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందింది. బీమా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ ఆపద కాలంలో ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చిన ‘అన్నదాత’ సాయం ఎప్పుడెప్పుడా అని రైతాంగం ఎదురు ఎదురు చూస్తునానరు. ఈ తరుణంలో సహాయం ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరమని సర్కారు నుంచి అందుతున్న సంకేతాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి హామీ ఇచ్చింది. అంతకుముందు టిడిపి ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. వైసిపి సర్కారు ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ పేరిట స్కీంను అమలు చేయగా కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ అని పేరు పెట్టింది. కాగా ఇప్పటి వరకు దీనిపై విధి విధానాలు ఖరారు చేయలేదు. వైసిపి రైతు భరోసా వలే కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం కిసాన్‌తో కలిపి అమలు చేస్తారా, విడిగానా అనే మీమాంశ నెలకొంది. విధి విధానాలు నిర్ణయిస్తేకాని స్పష్టత రాదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్‌ సీజన్‌ ముగిసినా ‘అన్నదాత’ సాయంపై ప్రభుత్వంలో కదలిక లేదు. రబీలోనైనా ఇస్తారా, జనవరి ఫస్ట్‌కా, సంక్రాంతికా అని రైతులు ఆశగా చూస్తున్నారు. ఇప్పుడే కాదని, అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండదని, ప్రాధాన్యతాక్రమంలో పథకాలు అమలు చేయాలని నిర్ణయించారని, ఆ మేరకు వచ్చే ఖరీఫ్‌కు ముందు పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెబుతుతున్నారు. అదే జరిగితే ఒక ఏడాది సాయం రూ.20 వేలను రైతులు, కౌలు రైతులు కోల్పోతారు. కేంద్ర పథకం పిఎం కిసాన్‌ కింద కిస్తుకు రూ.2 వేల వంతున ఈ సంవత్సరం రెండు కిస్తులు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో వేశారు.  జూన్‌ 18న ఒక పర్యాయం , అక్టోబర్‌ 5న రెండో విడత జమ చేశారు. గత వైసిపి సర్కారు పిఎం కిసాన్‌తో కలిపి భరోసా రూ.13,500 మూడు విడతల్లో అమలు చేసింది. ఆ సొమ్ములో కేంద్రానిది ఆరు వేలు కాగా, రాష్ట్రానిది 7,500.  కౌలు రైతులకు కేంద్రం ‘పిఎం కిసాన్‌’ ఇవ్వలేదు. సొంత భూమి కలిగిన వారిలో కూడా పలు నిబంధనలతో ఏటా కోతలు విధించింది. దాంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా  తగ్గిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం భూమి ఉన్న రైతుతోపాటు కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడం హర్షదాయకం. భూమి ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి 20 వేలను అందజేస్తుంది. కౌలు రైతులకు మాత్రం నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే 20 వల రూపాయలను అందజేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ పథకాన్ని ఎప్పటినుంచి, ఎలా అమలు చేస్తారో అని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని కోల్పోయినందుకు అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తమను ఏదో ఒక రకంగా ఆదుకోవాల్సిందిగా రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *