రాష్ట్రంలో ఏడాదిగా జ్యుడీషియల్, నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత
అందుబాటులో లేని రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంపులు
రూ.50, రూ.20, రూ.10 విలువ చేసే స్టాంపులు సైతం కొరత
బ్యాంకు రుణాలు తీసుకోవాలంటే స్పెషల్ ఎడ్‌హెసివ్ స్టాంపులు అవసరం
రాష్ట్రవ్యాప్తంగా ఆగిన సరఫరా, ఇ స్టాంపుల వైపు ప్రభుత్వం మొగ్గు
ఇ స్టాంపుల గురించి అవహాహన లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జ్యుడీషియల్ నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత వేధిస్తోంది. గత సంవత్సరం రోజులుగా స్టాంపుల సరఫరా ఆగిపోయింది. దీంతో స్టాంపుల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రాలలో వినియోగం ఏక్కువగా ఉండడంతో స్టాంపులు ఏడాదికి ముందే అయిపోయాయి. మారుమూల ఉన్న రిజిస్టర్ కార్యాలయంలో అరాకొరగా స్టాంపులు దొరుకుతుండడంతో వినియోగదారులు వాటిని వాకబు చేసి, అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఇదే అదనగా స్టాంప్ వెండర్లు అదనంగా వినియోగదారుల నుంచి అదనపు రుసుం చేస్తున్నారు. వినియోగదారులు తప్పనిసరి పరిస్థితులలో అదనంగా స్టాంపు వెండర్లు ఎంత చెప్పినా చెల్లించి తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్టాంపుల స్థానంలో ఈ స్టాంపులను ప్రవేశపెడుతోంది. ఫలితంగా స్టాంపుల తయారీ, సరఫరా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ స్టాంపులు గురించి ప్రజలకు అవగాహన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ స్టాంపులు కూడా 10, 20 అందుబాటులో ఉండడం లేదు. 10, 20 స్టాంపులు అవసరమైన వారు 50 రూపాయలు చెల్లించి స్టాంపులు కొనాల్సి వస్తుంది. దీనికి అదనంగా మరో 30 రూపాయలు జీఎస్టీ చెల్లించాలి. దీంతో పది రూపాయలు స్టాంప్ అవసరమైన వ్యక్తి 70 రూపాయలను అదనంగా వ్యయం చేయాల్సి వస్తుంది. వంద రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో, వెయ్యి రూపాయలు చెల్లించి స్టాంప్ పేపర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో అదనంగా ఒక్కొక్క పేపరుకు 900 రూపాయలు, దానిమీద జిఎస్టి కలిపి చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తం వినియోగదారునికి నష్టం జారుతోంది. ఇలా స్టాంపులు కొరత కారణంగా వినియోగదారులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుండగా, ప్రభుత్వానికి మాత్రం అదనపుపు మొత్తాలతో భారీగానే ఆదాయం సమకూరుతోంది.
న్యాయస్థాన ఖర్చులను చెల్లించడానికి న్యాయస్థానాలలో ఉపయోగించే స్టాంపు రకం పేపర్ లను జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ అంటారు. పత్రాలను అమలు చేయడానికి ఉపయోగించే పేపర్లను నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు అంటారు. 1899 నాటి ఇండియన్ స్టాంప్ చట్టం నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై స్టాంప్ డ్యూటీ చెల్లింపును నియంత్రిస్తుంది. అలాగే 1870 నాటి కోర్టు ఫీజు చట్టం జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై స్టాంప్ డ్యూటీ చెల్లింపును నియంత్రిస్తుంది. న్యాయ పత్రాలు, స్టాంపులు న్యాయ నిర్వహణకు సంబంధించినవి. వాణిజ్య ఒప్పందాలు, అధికార పత్రాలు మరియు ఆస్తి బదిలీలు వంటి వాటికి నాన్-జ్యుడీషియల్ స్టాంపు పత్రాలను ఉపయోగిస్తారు. కోర్టు ఫీజు స్టాంప్ పేపర్ అనేది జ్యుడీషియల్ స్టాంపులకు మరొక పేరు. ఎవరైనా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కింద సివిల్ ఫిర్యాదు లేదా పిటిషన్ దాఖలు చేసినప్పుడు మీ క్లెయిమ్ విలువకు సమానమైన కోర్టు ఫీజులను చెల్లించాలి. ప్రస్తుతం, 3 లక్షలకు మించి డబ్బు విషయంలో క్లర్కులపై ఆధారపడలేరు. అందువల్ల, కోర్టు అధికారిక స్టాంప్ పేపర్లును వినియోగిస్తారు. వాటిపై కేసు సంఖ్య, పార్టీల పేర్లు, న్యాయవాదుల సంతకాలు, ఈ ద్రవ్య లావాదేవీని నిరోధించడానికి వాటిని కౌంటర్ క్లెయిమ్ చివర అతికిస్తారు. సాదారణంగా జ్యుడీషియల్ స్టాంపులు 20, 10, 5, 2, 1 రూపాయలలో లభ్యం అవుతాయి. అలాగే నాన్ జ్యుడీషియల్ స్టాంపులు 100, 50, 20, 10 రూపాయలు, రెవిన్యూ స్టాంపులు 1 రూపాయి, నోటరీ స్టాంపులు 5 రూపాయలు, స్పెషల్ అడిసివ్ స్టాంపులు 100, 50, 20, 10, 5 రూపాయలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం గత సంవత్సరంగా ఈ స్టాంపులు అందుబాటులో ఉండడం లేదు. రైతులు బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎడ్‌హెసివ్ స్టాంప్స్ అవసరం పడుతుంది. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫారాల మీద ఈ స్టాంప్స్ అతికించి ఇస్తేనే రుణాలు మంజూరు చేస్తారు. ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎస్‌ఏ స్టాంప్స్ లేకపోతే జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయం లేదా వేరే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి తెప్పించుకోవాలి. కానీ రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందాలనుకునేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రూ.100 విలువ చేసే స్పెషల్ ఎడ్‌హెసివ్ స్టాంపులు గత ఏడాది డిసెంబరు నుంచే అందుబాటులో లేవు. ఇది జరిగి ఏడాది దాటిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. రూ.50, రూ.20, రూ.10 విలువ చేసే నాన్ జ్యుడీషియల్ స్టాంపులు చాలా కాలం కిందటే అయిపోయాయి. ఇక కోర్టు ఫీ స్టాంపులు, నోటరీ స్టాంపులు కూడా అందుబాటులో లేవు. బ్యాంకు రుణాలు తీసుకునేవారు స్పెషల్ ఎడ్‌హెసివ్ స్టాంపుల కోసంజిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళుతున్నారు. అక్కడ స్టాక్ లేదని చెపుతున్నారు. ఏడాదిగా రూ 100, రూ 200, రూ 500 డినామినేషన్‌ల స్టాంపు పేపర్లు కొరతగా ఉన్నాయి. ఫలితంగా, ప్రజలు రూ1000 స్టాంపు పేపర్లను కొనుగోలు చేయవలసి వచ్చింది. జనన ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించిన వివిధ పత్రాలు, అద్దె, వాణిజ్య ఒప్పందాలు, బాండ్‌లు , ఇతర చట్టపరమైన పత్రాల కోసం అఫిడవిట్‌లను సిద్ధం చేయడానికి నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్లు, ముఖ్యంగా రూ500 మరియు రూ 100 డినామినేషన్‌లు తప్పనిసరి. రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100కు సంబంధించిన స్టాంపులను బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు వినియోగదారులు ఉపయోగిస్తారు. బ్యాంకులో ష్యూరిటీతో పాటు నకళ్ల దరఖాస్తుకు వినియోగిస్తారు. రిజిస్ట్రేషన్, అగ్రిమెంటు, శాశ్వత విక్రయాలు, దానపత్రాలు, క్రయవిక్రయాలు లాంటి లావాదేవీలకు స్టాంపులు అవసరం. రిజిస్ట్రేషన్, అగ్రిమెంటు, శాశ్వత విక్రయాలు, దానపత్రాలు, క్రయవిక్రయాలు. లాంటి లావాదేవీలకు స్టాంపులు అవసరం. కుల దృవీకరణ పత్రాలు కావాలంటే, తాము పాలనా కులానికి చెందినా వారం అంటూ అఫిడవిట్ ఇవ్వాలి. అలాగే బ్యాంకు ఖాతాదారుడు మరణిస్తే ఆ ఖాతాలోని డబ్బును తీసుకోవాలన్నా, చనిపోయిన వ్యక్తి బంగారు నగలను తాకట్టు పెట్టి ఉంటె, వాటిని విడిపించాలి అన్న అఫిడవిట్ తప్పని సరి. అఫిడవిట్లకోసం రూ.10, రూ.20 స్టాంపులు కావాలన్నా దొరకడం లేదు. దీంతో కులధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్టాంపులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు క్రయవిక్రయదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరునెలల క్రితం స్టాంపులు పూర్తిగా లేకపోవడంతో స్థానిక వెండర్ల వద్దకు వెళ్లి రెట్టింపు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా ప్రాంతాల్లో దళారులు అదనపు వసూళ్లకు పాల్పడుతూ వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు.ఇలా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపులు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురౌతున్నారు. ఈ-స్టాంప్ సేవను ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావించినందున నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల జారీకి ప్రభుత్వం నాసిక్ ప్రింటింగ్ ప్రెస్‌కు ఉత్తర్వులు ఇవ్వడం నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఈ-స్టాంపింగ్ విధానాన్ని అదుపు చేసేందుకోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక నాన్-జ్యుడీషియల్ స్టాంపు లు సరఫరా చేసింది. స్టాంపు పేపర్ల కొరత వాటి సేకరణ, పంపిణీకి బాధ్యత వహించే పరిపాలనా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై ఒక అధికారిని వివరణ కోరగా, నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు. ప్రభుత్వం స్టాంపులను సరఫరా చేయడం లేదని, స్టాంపుల కొరత గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకేల్లామన్నారు. రూ.100 విలువ కలిగిన స్టాంపులను ప్రభుత్వం సరఫరా చేసిందని, వాటిని ఇతర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందచేస్తామన్నారు. గతంలో వెండర్లకు అందించిన స్టాంపుల క్రయవిక్రయాలపై ప్రభుత్వం నివేదిక కోరిందన్నారు. త్వరలో నివేదిక పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టామని, త్వరలో స్టాంపుల కొరత తీరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవసరం అయిన వారు ఇ స్టాంపులు పొందవచ్చన్నారు.

