జీడి నెల్లూరు పార్టీ పరిస్థితిపై చంద్రబాబు అసంతృప్తి
ముఖ్యమంత్రి కార్యక్రమానికి దూరంగా సీనియర్ నాయకులు
నిరాశపరిచిన జన సమీకరణ
ముఖ్యమైన నాయకులకు అందని పాసులు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుతెల్లులపై రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చంద్రబాబు హెలిప్యాడ్ దగ్గర స్వయంగా ఒక ప్రజా ప్రతినిధితో వెల్లడించినట్లు సమాచారం. మొదటినుంచి పార్టీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అలాగే నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కూడా ఈ విషయమై ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఎన్నికలు జరిగి తొమ్మిది నెలలు అవుతున్న ఇప్పటివరకు నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన ఒక నాయకుడిని చేరదీసి
అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి గట్టి హెచ్చరిక చేశారు. వైసీపీ నాయకులకు పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లేనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనలో జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నియోజకవర్గ నాయకులు కనిపించకపోవడం పట్ల కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీలో సఖ్యత లేదు. ఎవరికి వారే యమునా తీరు అన్న విధంగా పార్టీ పరిస్థితి కొనసాగుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అందరిని కలుపుకొని పోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమందికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు బాహాటంగా చెబుతున్నారు. శనివారం జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పలువురు సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మొదటి నుంచి పార్టీ జెండా మోసిన నాయకులు దూరంగా ఉన్నారు. వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, వారికి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పాసులు అందకపోవడంతో వారు ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న లేదని తెలిసింది. ముఖ్యమంత్రి నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో కూడా ఆరు మంది మండల పార్టీ అధ్యక్షులు గాను ఐదు మంది మాత్రమే పాల్గొన్నారు. ఒక మండలానికి చెందిన మాజీ ఎంపీపీ, మాజీ జడ్పిటిసి, మండల పార్టీ అధ్యక్షుడు కార్యకర్తల సమావేశానికి కూడా హాజరు కాలేదు. ఈ విషయమే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయన పనితీరు బాగా ఉందని, ఆయన ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారో పిలిచి మాట్లాడాలని కోరారు. నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారు. ఆయనకు కూడా పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి అవకాశం లభించలేదు. ఈ విషయాన్ని ఆయన బహాటంగా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు కూడా పంపారు. నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక మాజీ ఐపీఎస్ అధికారికి కూడా తగిన గుర్తింపు లేకపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనలేకపోయారు. శనివారం జరిగిన కార్యక్రమానికి అనుకున్న విధంగా జన సమీకరణ కూడా జరగలేదని సమాచారం. దానిమీద పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు కనీస అవసరాల కూడా కలగజేయలేదని విమర్శలు
ఉన్నాయి. ఇలా శనివారం జరిగిన కార్యక్రమం పేలవంగా జరగడం, నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి కార్యక్రమానికి దూరంగా ఉండటం పట్ల చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. నాయకుల మధ్య సమన్వయ లోపం వల్ల అనుకున్నంతగా జనం రాలేదన్న అంశం గుర్తించారు. కొంత మంది నాయకులు వైసిపి నుంచి వచ్చిన వారిని బుజాల మీద మోస్తున్న విషయం గ్రహించారు. పార్టీ మండల స్థాయి నాయకుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ప్రాణాలు త్యాగం చేసి పోరాడిన కొందరు కార్యకర్తలు విస్మరణకు గురికావడం జరిగిందన్నారు. కొన్ని విషయాలను సమావేశంలో బహిరంగంగా ప్రస్తావించారు. కార్యక్రమం నుంచి తిరిగి వెళ్ళే సమయంలో ఒకరిద్దరు కీలక నేతలను గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, ఎంపి దుగ్గుమల్ల ప్రసాద రావు, ఇంచార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్ పనితీరుపై చురకలు అంటించారు. ఈ నేతలు ఎవరు కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు. తాను బిజీగా ఉండి పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలతో మాట్లాడటం కుదర లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలో ఎమ్మెల్యే ఎన్ని సార్లు నియోజకవర్గంలో సమావేశం పెట్టారో తనకు తెలియదన్నారు. ఎంపి ఎమ్మెల్యే కలిస్తే తప్ప సమావేశం పెట్టలేరని ఇరువురి మధ్య ఉన్న విభేదాలను చెప్పకనే చెప్పారు. మంత్రి కూడ పట్టించుకోలేదని రాంప్రసాద్ రెడ్డికి చురక అంటించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యకర్తల సమావేశానికి ఎప్పుడు వచ్చారో కూడ తనకు తెలియదు అంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు వ్యవహార శైలిని కూడా తప్పుపట్టారు. ఇక నుంచి కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్ రానివ్వను అని, కార్యకర్తలతో సమావేశాలు పెట్టి వారి కష్టసుఖాలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని మార్గ దర్శనం చేశారు. తరువాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ నాయకుల పనితీరుకు గ్రేడ్ లు ప్రకటించారు. ఆరు మండలాలలో ముగ్గురు అధ్యక్షులకు బి గ్రేడ్ మరో ముగ్గురికి సి గ్రేడ్ ఇచ్చారు. కార్వేటినగరం మండల అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజేంద్ర రెడ్డిని ప్రశంసించారు. పాలసముద్రం కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర అలిగినప్పటికి పని తీరు బాగుందని మెచ్చుకున్నారు. ఆయనను ఒక సారి పిలిచి మాట్లాడ మన్నారు. ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడును పొగిడారు. మిగిలిన మండలాలలో పనితీరు మెరుగు పరచుకోవాలని సూచించారు. అలాగే 11 క్లాస్టర్ లలో ఐదింటికి బి గ్రేడ్, ఆరింటికి సి గ్రేడ్ ఇచ్చారు. పెనుమూరుకు చెందిన ఒక క్లస్టర్ ఇంచార్జి పనితీరు బాగా లేదని చెప్పారు. ఆయన బెంగళూరులో ఉన్నారని కార్యకర్తలు చెప్పడంతో ప్రత్యామ్నాయం చూడమన్నారు.
కొంత మంది నాయకులు వైసిపి వారికి పనులు చేసి పెడుతున్నట్టు తెలిసిందని అన్నారు. అలా చేయడం పాముకు పాలు పోసినట్టు అని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్ని విషయాలు తన దృష్టికి వస్తున్నాయని, తనకు తెలియదని అనుకొని పార్టీ జండా మోసిన నాయకులు, కార్యకర్తలను విస్మరించినా, వైసీపీకి చెందిన నాయకులతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ, వారికి పనులు చేసి పెట్టిన సహించేది లేదని బహిరంగంగానే ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి హెచ్చరికలు నియోజకవర్గంలోని పార్టీ పనితీరుకు అద్దం పడుతుంది.

