ఎన్టీఆర్ జలసిరి కింద సన్నకారు రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు
బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ. 50 కోట్ల నిధుల కేటాయింపు
వైయస్సార్ జలకళ పేరుతో కూటమి ప్రభుత్వం అమలు
ఐదేళ్లుగా వైసీపీ హయాంలో అటకెక్కిన బోర్ల నిర్మాణం
ఎన్టీఆర్ జలసిరి పేరుతో కూటమి ప్రభుత్వం నిధుల కేటాయింపు
విధివిధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం
త్వరలో అమల్లోకి రానున్న ఉచిత బోర్లు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
భూగర్బ జలాలతో పంటలు పండించుకునే వారికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ జలసరి పథకం వరంగా మారనుంది. రైతులకు బోరు బావులతో సాగు నీటి భరోసా కల్పించేలా చిన్న, సన్న కారు రైతుల వ్యవసాయ భూమిని సేద్యానికి అనుకూలంగా మార్చేందుకు, భూగర్భ జలాలను సమవర్ధవంతంగా సద్యినియోగం చేసుకునేలా బోర్ల నిర్మాణం పథకాన్ని 2015లో టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పట్లో ఈ పథకంలో రైతులకు ఉచితంగా బోర్లు వేయించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పథకం పేరును వైఎస్‌ఆర్ జలసిరిగా మార్చింది. అయితే అమలులో చిత్తశుద్ధి లోపించింది. ఈ పరిస్థితుల్లో రైతులు ఐదేళ్లుగా బోర్ల నిర్మాణం కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. దరఖాస్తుల స్వీకరణతోనే వైసీపీ పాలకులు సరిపెట్టారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని పునరుద్ధరించింది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చమనాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. దీంతో జిల్లా పరిధిలోని సామాన్య రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఐదేళ్లుగా నిలిచిపోయిన వ్యవసాయ బోర్లను తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ జలసిరి బోర్ల నిర్మాణం పట్టాలెక్కనుంది. నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు వ్యవసాయ బోర్లు నిర్మించారు. సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేశారు. తిరిగి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే జలసిరికి నిధులు మంజూరు చేసింది. చిన్న సన్న కారు రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయం బోరు బావులను ఉచితంగా నిర్మించేందుకు నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరికి శ్రీకారం చుట్టి వేలాది బోర్లను నిర్మించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ పథకం పేరు మార్చడంలో చూపిన శ్రద్ధ బోర్ల నిర్మాణంపై లేకుండా పోయింది. వైఎస్‌ఆర్ జలకళను ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పాలకులు అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలులో చతికిల పడింది. బోరు బావుల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది రైతులు వీటి నిర్మాణం కోసం ఎదురు చూశారు. భూగర్భ జలాలను సమవర్ధవంతంగా సద్యినియోగం చేసుకునేందుకు ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని వైసీపీ పాలకులు ఐదేళ్లు రైతులకు అక్కరకు రాకుండా చేశారు. ఈ పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం తిరిగి ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో అమలు చేసినట్లుగా ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేసేందుకు సిద్ధమైంది. అర్హులైన రైతులకు బోరు నిర్మించడంతో పాటు సోలార్ పంపు సెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో బోర్ల నిర్మాణంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జలసిరి పథకంలో బోర్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయింపుపై దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం రైతుల కల మన వైఎస్‌ఆర్ జలకళ అనే నినాదంతో వైఎస్‌ఆర్ జలకళ పథకాన్ని రూపొందించింది. పథకానికి పేరు మార్చిన వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ బోర్ల నిర్మాణాన్ని అటకెక్కించింది. ఐదేళ్లు బోర్ల నిర్మాణంలో ప్రభుత్వం బొక్కాబోర్లాపడింది. ఈ పథకానికి జిల్లాలో 1889 మంది రైతుల దరాఖాస్తులను ఆమోదించినప్పటికీ బోర్ల నిర్మాణాన్ని విస్మరించింది. బోర్ల నిర్మాణం కోసం ఆశగా ఎదురు చూసిన అన్నదాతలకు ఆడియాసే మిగిలింది. ఈ పథకానికి ప్రధానంగా నిధుల కొరత వెంటాడింది. నిర్మించిన బోర్లకు పూర్తి స్ధాయిలో బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో బోర్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణం పూర్తయిన బోర్లకు విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వలేకపోయారు. దీంతో వందలాది బోర్లు నిరూపయోగంగా మారాయి. నెలల తరబడి విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వకపోవడంతో అవి పూడిపోయే పరిస్ధితులు నెలకొంటున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. జలసిరి పథకాన్ని జలకళగా మార్చిన వైసీపీ ప్రభుత్వం బోర్ల నిర్మాణాలను నామమాత్రంగా కూడా చేయలేదు. జిల్లాలో అందని ద్రాక్షగా మారింది. లక్ష్యాల సాధనకు ఆమడ దూరంలో నిలచింది. బోర్ల తవ్వకం బిల్లులను గుత్తేదారులకు చెల్లించకపోవడంతో అర్ధాంతరంగా ఈ పథకం ఆగిపోయింది. బోర్లు వేయడానికి బోర్ వెల్ యజమానులు ముందుకు రాకపోవడంతో చిత్తూరు జిల్లాలో ఈ పథకం ముందుకు సాగలేదు. ఎన్నో ఆశలతో ఉచిత బోర్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పథకం కింద 2.5 ఎకరాల నుండి 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోరు వేసి, విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని భావించారు. మోటారు కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 1889 రైతులు వైఎస్సార్ జలకళ పథకం కోసం ధరఖాస్తు చేస్తుకున్నారు. ఇందులో 1117 ధరఖాస్తులను ఆమోధించారు. 772 ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 141 బోర్లను తవ్వారు. జిల్లాను అయిదు క్లాస్టర్లుగా విభజించారు. చిత్తూరు క్లాస్టర్ లో 43 బోర్లు, కుప్పంలో 1, నగరిలో 23, పుంగనూరులో 45, సదంలో 38 బోర్లు తవ్వారు. జిల్లాలో తవ్విన బోర్లలో ముప్పాతిక భాగం 83 పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇలాఖలోనే వేశారు. రైతుల భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వే వైఎస్సార్ జలకళ పథకం అమలు ఒకడుగు ముందుకు, రెండడుగుల వెనక్కి అన్నట్లు తయాయ్యింది. రైతుల నుంచి స్పందన బాగున్నా, అదే స్థాయిలో బోర్లు తవ్వడం లేదు. వీటిని తవ్వే గుత్తేదారు సంస్థలకు 50 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాలి. మొదట్లో ఉత్సాహం చూపిన గుత్తేదారులు బిల్లుల చెల్లింపులో జాప్యంతో పలు చోట్ల పనులు అర్ధాంతరంగా నిలిపేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అధికారుల ఒత్తిడితో ఒకటి, అర బోర్లు వేశారు. 2022 మే నుంచి గుత్తేదారులకు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో బోరు బండ్లతో గుత్తేదారులు వెనుతిరికి వెళ్లిపోయారు. రైతుల దరఖాస్తులపై జియాలజిస్టులు సర్వే పూర్తి చేయడంలోనూ జాప్యమవుతోంది. క్షేత్ర స్థాయిలో వీఆర్వో పరిశీలించి అర్హత కలిగిన రైతుల దరఖాస్తులను డ్వామా సహాయ పథక సంచాలకులకు పంపుతారు. అక్కడ కూడా పరిశీలన పూర్తయ్యాక జియాలజిస్టు సర్వే మొదలవుతుంది. బోరు తవ్వేందుకు ఉన్న అనుకూలతలపై రైతుల భూముల్లో వీరు సర్వే చేసి నివేదిక ఇస్తారు. బోర్లు తవ్వే గుత్తేదారు సంస్థలే అర్హత కలిగిన జియాలజిస్టులతో సర్వే చేయించేలా గ్రామీణాభివృద్ధి శాఖ ఒప్పందం చేసుకుంది. జియాలజిస్టుల కొరత, గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో సర్వే మందకొడిగా సాగుతోంది. రైతుల భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వించాలని తొలుత నిర్ణయించిన ప్రభుత్వం తరువాత పంపుసెట్ సమకూర్చి విద్యుత్ కనెక్షన్ కూడా ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8వేల బోర్లు తవ్వినా ఒక్కదానికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదనలపై విద్యుత్ పంపిణీ సంస్థలు సర్వే చేసి దాదాపు 300 బోర్లకు సంబంధించి ఎన్ని కిలోమీటర్లలో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అవసరమో అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమయ్యే నిధులు గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేస్తే విద్యుత్ సంస్థలు తదుపరి చర్యలు తీసుకోవాలని భావించాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతులకు పంపుసెట్లు పంపిణీ చేయాలి. గుత్తేదారు సంస్థలకు పెండింగు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోలేదు. చెల్లింపుల్లో జాప్యం పనులపై కొంత ప్రభావం చూపినా, ఎన్నికలు రావడంతో బోర్లు తవ్వే కార్యక్రమం అటకెక్కింది. ఎన్నికలలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో వైయస్సార్ జలకల పథకాన్ని ఎన్టీఆర్ జలసిరిగా మార్పు చేశారు. ఈ పథకం కింద సన్న కారు రైతులకు బోర్లను వేసే కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ పథకం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
పో రై గంగ 1 ఎన్టీఆర్ జలసిరి

