పెనుమూరు బస్టాండు షాపుల వేలంపై హై కోర్టు స్టే
వేలానికి సంబంధించి అన్ని రికార్డులను సమర్పించాలని కోర్టు ఆదేశం
వేలంలో పాడుకున్న వారికి గదులు స్వాదీనం చేయరాదని ఉత్తర్వులు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
పెనుమూరు బస్టాండు వాణిజ్య సముదాయం గదుల వేలం ప్రక్రియను నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జి రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాము డిపాజిట్ సొమ్ము కట్టినా ఈ నెల 19 వ తేదీ జరిగిన వేలంలో తమకు అవకాశం కల్పించలేదని మండలానికి చెందిన కె కోదండన్, పి చిన్నయ్య, ఇ మునిరాజులు హై కోర్టులో రిట్ దాఖలు చేశారు. వీరి తరఫున న్యాయవాది టి బాలాజీ వాదనలు వినిపించారు. దీనితో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేలం ప్రక్రియ నిపుదల చేయాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ అన్ని వేలం ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులు స్వాదీనం చేసుకుని కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. అప్పటి వరకు వేలం ప్రక్రియ నిలుపుదల చేయాలనీ, వేలంలో పాడుకున్న వారికి గదులు స్వాదీనం చేయరాదని కోరారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు రాజేష్ కుమార్, సంజీవ రావు హాజరయ్యారు. పెనుమూరు బస్టాండు సముదాయంలో ఉన్న 24 గదుల వేలంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసిపి కుమ్మకై షాపులను పంచుకున్నారని ఈ నెల 20న ఆంధ్రప్రభ దినపత్రికలో "పెనుమూరు బస్టాండ్ షాపులను పంచుకున్న రాజకీయ పార్టీ నేతలు" అనే శీర్షికన వార్తను ప్రచురించిన విషయం పాటకులకు విదితమే. షాపుల వేలం పాటలో పాల్గొనడానికి దాదాపు 380 మంది రూ 50 వేల చొప్పున డిపాజిట్ కట్టారు. అయితే బయటి నుంచి 100 మంది రౌడీలను తీసుకుని వచ్చి మోహరించి, టిడిపి నాయకులు ఎవరిని వేలంలో పడకుండా అడ్డుకున్నారు. అంగ బలంలేని వారిని భయపెట్టి పంపేశారు. పోలిసులు చూసి చూడనట్టు వ్యవహరించారని ఆరోపణలు వినిపించాయి. ఆఖరికి నాలుగు పార్టీల నాయకులు కుమ్మకై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కొద్ది ఎక్కువగా పాడుకున్నారు. అంటే ఒక్కొక్క గది రూ 9000 నుంచి 10 వేల లోపు పాడుకున్నారు. నాలుగు పార్టీల నేతలు పంచుకున్నారు. టిడిపి నాయకులు 17 గదులను తీసుకుని, నారాయణ స్వామి వర్గానికి చెందిన వైసిపి నాయకులకు నాలుగు గదులు కేటాయించారు. జనసేన మండల అధ్యక్షుడు, బిజెపి మండల అధ్యక్షురాలు చెరి ఒకటి తీసుకున్నారు. జనసేన కోటాలో ఒక జర్నలిస్టుకు ఒక గది ఇచ్చినట్లు సమాచారం. కొందరు అప్పుడే ఒక్కో గదిని రూ 18 వేలకు వేరే వాళ్ళకు అమ్ముకున్నారని సమాచారం. పారదర్శకంగా వేలం పాట జరిగి ఉంటే ఒక్కో గదికి 20 వేల వరకు వచ్చి ఉంటుందని స్థానికులు అంటున్నారు. నాయకుల కుమ్మక్కు వల్ల పంచాయతీ ఆదాయానికి నెలకు రెండున్నర లక్షలు, సంవత్సరానికి 30 లక్షల రూపాయలు గండి పడిందని మాజీ ఎంపి జ్ఞానేంద్ర రెడ్డి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి దయాసాగర్ రెడ్డి వర్గం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు, జిల్లా పంచాయతి అధికారి సుధాకర్, పెనుమూరు గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. లీగల్ నోటీసు కూడా ఇచ్చారు. ఈ విషయమై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఉప ముఖ్య మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడం రాష్ట్ర హై కోర్టుకు వెళ్లి జరిగిన వేలం పాట మీద స్టే తెచ్చారు. ఈ విషయమై జిల్లా పంచాయితి అధికారి సుధాకర్ ను 'ఆంధ్రప్రభ' ప్రశ్నించగా కోర్టు స్టే విషయమై తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు.
పో రై గంగ 7 పెనుమూరు బస్టాండు వాణిజ్య సముదాయం గదుల వేలం (ఫైల్ ఫోటో)

