జీడీ నెల్లూరు టిడిపిలో వర్గ విభేదాలకు కారణం ఏమిటి?
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపిలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకున్నది. తొలి నుంచి వర్గ పోరే ఆ పార్టీకి నష్టం కలిగిస్తోంది. 30 ఏళ్ళ తరువాత టిడిపి అభ్యర్ధి డాక్టర్ ఎం.వి. ఎం థామస్ వైసిపి అభ్యర్ధి కృపాలక్ష్మి పై 26,011 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలో టిడిపి గెలుపు ఆ పార్టీలోని కొందరు నాయకులకు ఇష్టం లేదని తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలి. ఇన్చార్జిగా తామే చక్రం తిప్పాలని ఒక వర్గం ఎన్నికల సమయంలో పగడ్బందీగా వ్యవహరచన చేసినట్లు మరో వర్గం ఆరోపిస్తోంది. ఇందుకోసం ఎన్నికల సమయంలో అభ్యర్థి పంచడానికి తెప్పిస్తున్న నజరానను, నగదును ఒక వర్గం నాయకులు పోలీసులకు ముందుగానే సమాచారం అందజేసి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే థామస్ వారి ఎత్తులను చిత్తుచేసి ఎన్నికలలో విజయం సాధించినట్లు సమాచారం. ఆఖరి నిమిషంలో ఎన్నికలకు అవసరమైన మందుగుండును సిద్ధం చేసుకుని పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను విశ్లేషించుకున్న ఎమ్మెల్యే వర్గం ఎన్నికల తర్వాత ఒక వర్గం మీద ద్వేషాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ వర్గానికి చెందిన ఒక ముఖ్య నాయకులు అనుసరించిన వైఖరి కారణంగా ఆ సామాజిక వర్గం మీదనే ఎమ్మెల్యే వర్గం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం రెండో వర్గాల మధ్య అధిపత్రిక నియోజకవర్గంలో బలపడినట్లు తెలుస్తోంది.నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఒకసారి కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు. వరుసగా 30 సంవత్సరాలు పార్టీ ఓడిపోతున్నడంతో సరైన అభ్యర్థి కోసం అన్వేషించిన చంద్రబాబుకు చెన్నైలో సంతాన సాఫల్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ థామస్ పరిచయ మయ్యారు. ఆర్థికంగా బాగా ఉన్న డాక్టర్ థామస్ ను నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించిన నాటి నుండి థామస్ తనదైన చర్యలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలలో దోచుకుని పోయారు. మొదట థామస్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కారణమైన ఆ నాయకుడు ఎన్నికల సమయంలో ఓటమికి కృషి చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చి నియోజక వర్గంలో ఓడిపోతే చక్రం తిప్పవచ్చని భావించి వెన్ను పోటుకు సిద్దం అయ్యారని కొందరు అంటున్నారు. అయితే అప్పటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో లాలూచీ పడి, వైసిపి అభ్యర్ధి అయిన ఆయన కూతురుని గెలిపించేందుకు పరోక్షంగా పనిచేశారని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో థామస్ అనుచరులు చెన్నై నుంచి తెస్తున్న డబ్బును పోలీసుల ద్వారా పట్టించారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. తరువాత అతనే రాజీ చేసి, దానికి కూడా కొంత డబ్బు తీసుకున్నారని కొందరి ఆరోపణ. అలాగే థామస్ కు చెందిన మూడు లారీల నజరానాను ఆ నాయకుడు ముందుగా పోలీసులకు సమాచారం అందించి పట్టించారని అంటున్నారు. దీనితో జాగ్రత్త పడిన థామస్ జి డి నెల్లూరుకు చెందిన హరీష్ యాదవ్, చెన్నైకి చెందిన శరవణ సహకారంతో పోల్ మేనేజ్ మెంట్ చేసుకుని గెలిచారు. ఈ విషయం థామస్ ఇటీవల వీడియో ద్వారా బహిర్పరిచారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నాయకుడు ఎమ్మెల్యే అనుచరుల వ్యాపారాలను దెబ్బ తీశారని కొందరు తెలిపారు. మార్చి ఒకటవ తేదీన జి డి నెల్లూరు వచ్చిన సిఎం చంద్రబాబు నాయుడుకు ఒక వర్గం నాయకులు థామస్ మీద లేనిపోని ఫిర్యాదులు చేసారు. ఆయన వైసిపి నేతలను పార్టీలో చేర్చుకుని కార్యకర్తలకు ద్రోహం చేస్తున్నారని చెప్పారు. దీనితో చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో వైసిపి నాయకులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయం చేస్తే పాముకు పాలు పోసినట్టు అంటూ హెచ్చరించారు. దీనిపై థామస్ అసలు పార్టీ ద్రోహులు వారే అంటూ చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. ఒక వీడియో విడుదల చేసారు. ఒక వర్గం పనికట్టుకుని తనపై తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారని థామస్ అవేదన వ్యక్తం చేశారు. పెనుమూరు బస్టాండు వాణిజ్య గదుల వేలం వ్యవహారంలో కూడ ఆ వర్గం కుట్ర బహిర్గతం అయ్యిందని థామస్ వర్గం అంటున్నారు. మాజీ ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి వర్గానికి చెందిన మండల కన్వీనర్ విజయ కుమార్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి యాతీశ్వర్ నాయుడు, మరొక కార్యకర్తలు నామ మాత్రం ధరలకే గదులను కేటాయించడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. గతంలో ఈ వర్గం వేధింపులు తట్టుకో లేక పార్టీ ఇంచార్జి డాక్టర్ హరికృష్ణ, ఆయన తల్లి మాజీ డిప్యూటి స్పీకర్ కుతూహలమ్మ పార్టీకి రాజీనామా చేశారు. హరికృష్ణకు మాట మాత్రంగా చెప్పకుండా పాలసముద్రం మండలానికి చెందిన భీమినేని చిట్టిబాబు నాయుడును సమన్వయ కర్తగా నియమించారు. ఈ వ్యవహారం అవమానంగా భావించి వారు రాజీనామా చేసారు. అలాగే వర్గ పోరుతో మనస్తాపం చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు పంపారు. ఆయన పిలిపించి సముదాయించి, తాను అన్నానని భరోసా ఇచ్చి పార్టీలో కొనసాగించారు. తరువాత ఆయన చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం నుంచి తన సభ్యత్వాన్ని తిరుపతికి మార్చుకున్నారు. పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర కూడ వర్గ పోరు తట్టుకో లేక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబు ఆయన సామర్థ్యం, పార్టీ సేవలు తెలుసుకుని ప్రశంసించారు. ఆయనతో మాట్లాడమని ఎమ్మెల్యేకి సలహా ఇచ్చారు. అలాగే పాలసముద్రం మాజీ ఎంపీపీ ఇందిర, గ్యాస్ రవి తదితరులు కూడా వర్గ పోరు వల్ల పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడం లేదు. అధిష్టానం స్పందించి వర్గాల మధ్య సమన్వయం కుదర్చడంలో ఆలస్యం చేస్తున్నందున రోజు రోజుకు వర్గపోరు జటిలం అవుతున్నది. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నెట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇందువల్ల నియోజకవర్గంలో తిరిగి గతంలో ఉన్న పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగిన రానున్న ఎన్నికలలో పార్టీలో వెన్నుపోట్లు తప్పవని సంకేతాలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో బలంగా ఉన్న రెండు వర్గాలను పిలిచి మాట్లాడి సమన్వయం చేసి పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పార్టీ నేతల మీద ఉంది.
పో రై గంగ 1 నియోజకవర్గ టిడిపి సమావేశం

