21, మార్చి 2025, శుక్రవారం

ఏఎన్ఎంల పదోన్నతులలో చిత్తూరు జిల్లా "రూటే.. సపరేటు..!"

విధి విధానాలు లేకుండా తుది జాబితా సిద్ధం

 అర్హులైన వారి పేర్లు తొలగింపు, అనర్హులకు గుర్తింపు

 పదోన్నతులలో డేట్ ఆఫ్ జాయినింగ్, రోస్టర్ విధానం కాకుండా

డీఎస్సీ ర్యాంకు ఆధారంగా ఫైనల్ జాబితా సిద్ధం

డేట్ ఆఫ్ జాయినింగ్, రోస్టర్ విధానంలో అన్యాయం జరిగిందని కొందరు

మెరిట్‌లో అన్యాయం జరిగిందని  చిత్తూరు కలెక్టర్‌కు ఫిర్యాదులు

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

ప్రతి 2500 మంది జనాభాకు ఒక ఆరోగ్య మహిళా వర్కర్ ఉండాలని లక్ష్యంగా 2019లో నాటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 13,500ల ఏఎన్ఎం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. 2008 అక్టోబరు చివరిలో రోగి కళ్యాణి పథకం కింద సెకండ్ ఏఎన్ఎంలుగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానికం ఆధారంగా 5500 పోస్టులను భర్తీ చేశారు. 2009 నవంబరులో యూరోపియన్ పథకంలో కాంట్రాక్టు కింద 1200 పోస్టులు భర్తీ చేశారు. 10 నుంచీ 12  సంవత్సరాల పాటు సెకండ్ ఏఎన్ఎం, కాంట్రాక్టు ఏఎన్ఎంలు విధులు నిర్వర్తించడంతో 2019లో జరిగిన గ్రామ/వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ పోస్టులకు డీఎస్సీ ద్వారా ఎంపికైన వారికి 10 నుంచీ 15 మార్కుల వెయిటేజీతో విధులలో చేరారు. 2019 అక్టోబర్ 2న గ్రామ/వార్డు సచివాలయాలు ప్రారంభం కాగా, హెల్త్ సెక్రటరీలుగా సరైన రికార్డులతో విధులలో చేరాల్సి వుంది. అందులో కొందరు అక్టోబర్ 14న కొంతమంది విధులకు రిపోర్టు చేశారు. మరి కొంతమంది  అక్టోబర్ 16నుంచీ డిసెంబరు నెలాఖరు వరకు విధులలో చేరుతూ వచ్చారు. గ్రామ,వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీలుగా ఎంపికైన వారి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసారు. చిత్తూరు జిల్లాలో మూడు విడతలుగా పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేయగా.. అభ్యర్థులు వారికి అనుకూలమైన తేదీలలో విధులలో చేరారు. కొంతమంది అభ్యర్థుల సర్టిఫికేట్‌లు సక్రమంగా లేకపోవడం, పూర్తిస్థాయిలో సర్టిఫికేట్‌లు వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. బోగస్ సర్టిఫికేట్లతో విధులలో చేరిన కొందరిని గుర్తించి, తిరిగి సర్టిఫికేట్లు పరిశీలించగా.. కొంతమంది సకాలంలో సమర్పించక పోవడంతో విధుల నుంచీ కూడా తొలగించారు. రెండున్నర సంవత్సర కాలం తర్వాత డిపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహించి ప్రొవిన్షియల్ నుంచీ రెగ్యులర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అన్నీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరుగుతూ వస్తున్నాయి. గ్రేడ్-3 ఏఎన్ఎం నుంచీ గ్రేడ్-2 ఏఎన్ఎంలు పదోన్నతులకు ప్రస్తుత ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో పూర్వ 13 జిల్లాల పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 పోస్టులలో ప్రస్తుతం గ్రామ/వార్డు సచివాలయాలలో విధులు నిర్వర్తిస్తున్న హెల్త్ సెక్రటరీ (ఏఎన్ఎం)ల సీనియారిటీ జాబితాలను ఆయా జిల్లాల వారీగా విడుదల చేశారు. ఆయా జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 పోస్టులకు అర్హత కలిగిన వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాఖ నిబంధనల ప్రకారం ఏఎన్ఎంల పదోన్నతుల జాబితాలను అన్ని జిల్లాలలో విడుదల చేయగా.. చిత్తూరు జిల్లా వైద్యాశాఖ రూటే సపరేటుగా విడుదల చేసింది. అర్హులైన వారి పేర్లు తొలగించి, అనర్హుల జాబితా సిద్ధం చేసి విడుదల చేశారు. డీఎస్సీ (జిల్లా సెలక్షన్ కమిటీ) ద్వారా ఎంపికైన ఏఎన్ఎంలు వారు.. విధులలో చేరిన డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ మెరిట్ వారీగా కాకుండా.. చిత్తూరు జిల్లా వైద్యశాఖలో ఎవరికి వారుగా నిర్ణయాలు తీసుకుని జాబితా సిద్ధం చేశారు. డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ మెరిట్ ద్వారా పదోన్నతులు ఇవ్వాల్సి వుండగా అర్హత లేని కొందరు అధికార బలం, ధనబలం, రాజకీయ బలంతో దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలు కాకుండా చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఉద్యోగులు సొంత నిర్ణయాలతో పదోన్నతుల తుది జాబితా ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహిస్తే.. అర్హులైన కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.


ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదోన్నతులు.. :- రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాఖ నిబంధనల ప్రకారం... విధులలో చేరిన తేదీన.. అదేరోజు చేరిన వారిలో రోస్టర్ విధానంలో ఎంపిక చేయాల్సి ఉంది. అలా కాకుండా.. 14-10-2019 నుంచీ 12-11-2019 మధ్యలో ఎప్పుడు చేరినా ఒకే విధానం అంటూ.. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగుల కోటా..‌ రోస్టర్ విధానం లేకుండా..‌ అంతా డీఎస్సీ మెరిట్ విధానంలో తుది జాబితాను విడుదల చేసేశారు.  దీంతో అర్హులైన వారికి అవకాశాలు ఉన్నప్పటికీ.. చిత్తూరు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వారు చెప్పిందే వేదంగా మారుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ మెరిట్ విధానంలో పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. డీఎస్సీలో వచ్చిన మెరిట్ ర్యాంకు అధారంగా పదోన్నతులు కల్పించాలని మరి కొందరు చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

 చిత్తూరు జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ సుధారాణి 'ఆంధ్రప్రభ బ్యూరో'తో మాట్లాడుతూ...  ఈ విషయమై గురువారం జిల్లా కలెక్టర్ వాకబు చేశారన్నారు. తాయారు చేసిన జాబితాను జిల్లా కలెక్టర్ కు అందచేశామన్నారు. బంధనల మేరకు డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ మెరిట్ ప్రకారంజాబితాను అప్డేట్ చేసి రెండు రోజుల్లో ప్రకటించడం జరుతుందన్నారు.  దీనిపై వచ్చే అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పక్కగా తుది జాబితాను రెండు రోజులలో విడుదల చేస్తామని వివరణ ఇచ్చారు. ఎవరికీ అన్యాయం జరగదని, పక్కగా  ఏఎన్ఎంల పదోన్నతుల జాబితాను రూపొందించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారని, కలెక్టర్ ఆదేశాల మేరకు తుది జాబితా రూపొందిస్తున్నామని వివరించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *