30, మార్చి 2025, ఆదివారం

సున్నా వడ్డీ పధకం కోసం రైతన్నల ఎదురుచూపులు

రాష్ట్ర బడ్జెట్ లో రూ. 250 కోట్లను కేటాయించిన ప్రభుత్వం 

ఇప్పటి వరకు ఖరారు కాని పధకం విధివిధానాలు

గత ప్రభుత్వంలో కొందరికే సున్నా వడ్డీ పధకం అమలు 

పంటలు మ్యజించింగ్ కాలేదంటూ 70 శాతం రైతులకు టోపీ

గత ప్రభుత్వంలో  జిల్లా రైతులకు రూ.1000 కోట్ల నష్టం    

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

రైతన్నలు సున్నా  వడ్డీ పథకం అమలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వైసిపి ప్రభుత్వం వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని  రైతులకు అమలు చేసింది. ఈ పథకం కింద సకాలంలో వ్యవసాయ రుణాలను బ్యాంకులకు  తిరిగి చెల్లించిన రైతులకు  కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీని తిరిగి చెల్లిస్తుంది.  నాలుగు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.గత ప్రభుత్వం పంటలు మ్యాచింగ్ కాలేదంటూ 70 శాతం  మంది రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయలేదు. ప్రస్తుతం ఉన్న  కూటమి ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ  పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు వ్యవసాయ బడ్జెట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చంనాయుడు 250 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఇందుకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ కాలేదు. వెబ్సైట్ ఓపెన్ అయితే బ్యాంకు అధికారులు నాలుగు శాతం వడ్డీ రైతులకు తిరిగి  చెల్లింపుల కోసం అందులో నమోదు చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తి అవుతున్న, ఇప్పటివరకు ఈ పథకం విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు శాతం వడ్డీని రైతులకు పంటలతో సంబంధం లేకుండా చెల్లిస్తుంది.

రైతులకు బ్యాంకులు వ్యవసాయ రుణాల కింద సంవత్సరానికి ఒకసారి రైతుల పాసుబుక్కును తనఖగా పెట్టుకొని రుణాలను అందజేస్తాయి. ఈ రుణాలకు బ్యాంకులు 7 శాతం  రుణాన్ని వడ్డీని వసూలు చేస్తాయి. రైతులు గడువు తీరకముందే రుణాన్ని వడ్డీతో సహా చెల్లిస్తే, ఆ రైతులకు రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి బ్యాంకులు చెల్లిస్తాయి. దీనికి సున్నా వడ్డీ పథకం అని నామకరణం చేశారు. గత వైసిపి ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అమలులో మాత్రం రైతులను దగా చేసినట్లు అర్థమవుతుంది. వాస్తవంగా సున్నా వడ్డీ పథకం జిల్లాలోని  30 శాతం రైతులకు మాత్రమే అమలు జరిగినట్లు ఒక విశ్లేషణలో వెళ్లడయ్యింది. 70 శాతం మంది రైతులకు సున్నా రుణ వడ్డీ పథకం అమలు కాలేదు. వడ్డీ తిరిగి జనం అవుతుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టడానికి పథకం ప్రకారం ప్రణాళికను రూపొందించింది. ఇందులో బ్యాంకు అధికారులు కూడా కీలకపాత్రను పోషించడం విశేషం. అయిదు సంవత్సరాల కాలంలో జిల్లాలోని రైతులు సుమారు 1000 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని నష్టపోయినట్లు అంచనా. చిత్తూరు జిల్లాలోని ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు. వ్యవసాయం చేయడానికి బ్యాంకులు రైతులకు రుణాలను మంజూరు చేస్తాయి. రైతులకు పంట రుణాలు కింద బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేస్తాయి. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి 5272 కోట్ల రూపాయలను పంట రుణాలుగా బ్యాంకులు అందజేశాయి. అలాగే 2023- 24 ఆర్థిక సంవత్సరంలో 7237 కోట్ల రూపాయలను పంట రుణాలుగా  అందజేశాయి. చిత్తూరు జిల్లాలో 274 బ్యాంకు బ్రాంచ్ లు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నటన 138, సెమీ అర్బన్ బ్యాంకులు 70, అర్బన్ బ్యాంకులు 66 పని చేస్తున్నాయి. వీటి ద్వారా రైతులకు పంట రుణాలను పొందుతారు. ఇందుకు జిల్లా స్థాయిలో లీడ్ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంకు వార్షిక రుణ ప్రణాళికను రూపొందించి వివిధ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈ మేరకు ఆయా బ్యాంకులు రైతులకు రుణాలను మంజూరు చేస్తాయి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సున్నా శాతం రుణ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించింది. ఇందుకు వైయస్సార్ సున్నా వడ్డీ పథకం అని నామకరణం చేసింది. ఈ పథకం కింద లక్ష లోపు రుణాలు పొందిన రైతులకు కన్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. పంట రుణాలకు సంవత్సరం వరకు బ్యాంకులు 7 శాతం వడ్డిని అమలు చేస్తాయి. పంట రుణం కింద రుణం తీసుకున్న రైతులకు, వడ్డీ చెంచిన వెంటనే  కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ రాయితీని  జమ చేస్తుంది. గతంలో రుణం చెల్లించిన వెంటనే మూడు శాతం వడ్డీ రాయితీని రైతులకు చెల్లించేవాళ్లు. ప్రస్తుతం వారం, పది రోజుల తర్వాత మూడు శాతం నిధులను కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ రాయితీని  వైయస్సార్ సున్నా పధకం కింద తిరిగి రైతులకు జమ చేయాలని, రైతులకు వడ్డీ లేని రుణాలను అందజేయడం నిర్ణయించింది. అయితే ఈ పథకం చాలా వరకు అమలు కాలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట. ఈ కేవైసీ పేరుతో రైతులను దగా చేయడం ప్రారంభించింది. బ్యాంకులు చెరుకు పంటకు ఎకరాకు  85,000, టమాటా పంటకు 85,000, వరికి 25,000, మామిడి తోటలకు 35,000, అరటి తోటలకు 60,000, వేరుశనగ పంటకు 25 వేల రూపాయల చొప్పున పంట రుణాలుగా మంజూరు చేస్తాయి. జిల్లాలో ఎక్కువగా మామిడి తోటలు కనిపిస్తాయి. అయితే ఎక్కువ మొత్తం ఋణం  కావలసిన రైతులు తాము చెరకు, టమేటా సాగు చేశామని, పంట రుణాలను తీసుకుంటున్నారు. అలాగే బ్యాంకులు కూడా తమ లక్ష్యాలను చేరుకోవడానికి రైతులు చెరకు సాగుచేసినట్లు నమోదు చేసుకుని రుణాలను ఇస్తున్నాయి. పొలంలో ఏ పంట ఉన్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు శాతం వడ్డీ రైతుని తిరిగి రైతులకు తిరిగి  చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు వడ్డిని  తిరిగి చెల్లించడానికి ఈ పంట, ఈకేవైసీ లను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ పంట ద్వారా గ్రామంలోని వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వారి పొలంలో  ఏ పంటను పండించారో దానిని నమోదు చేస్తారు. తర్వాత రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి ఈ కేవైసీ కింద అ పంటను ధ్రువీకరిస్తారు. బ్యాంకులో ఒక పంటకు పేరుతో రుణం తీసుకొన్న రైతులు మరొక పంటను వేస్తే నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వడ్డీ రాయితీ రైతులకు అందడం లేదు. బ్యాంకులో ఒక పంటకు  రుణం తీసుకున్నారని,  రైతు మరో పంట వేశారని, పొలంలో ఉన్న పంటకు, బ్యాంకులో నమోదు చేసిన డానికి  మ్యాచ్ కాలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ రాయితీని ఎగ్గొడ్తుంది. ఇందులో బ్యాంకు అధికారులు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఒకసారి బ్యాంకు అధికారులు ఒక పంట మీద రుణాన్ని మంజూరు చేస్తే, తిరిగి ఆ పంటను సవరించి, వాస్తవంగా ఉన్న పంటను నమోదు చేయడం లేదు. దీంతో జిల్లాలోని 70 శాతం రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అందలేదు. కేవలం 30 శాతం రైతులకు మాత్రమే ఈ పథకం అమలు అయ్యింది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని బ్యాంకులు కలిపి 7237 కోట్ల రూపాయలను పంట రుణాలను అందజేశాయి. వీటికి ఏడు శాతం వడ్డీ చొప్పున 507 కోట్ల రూపాయలను  రైతులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 217 కోట్ల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 289 కోట్ల రూపాయలను భరించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ రాయితీ కింద 217 కోట్ల రూపాయలను సకాలంలో వడ్డీ చెల్లించిన రైతులందరికీ తిరిగి చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 289 కోట్ల రూపాయలలో కేవలం 86 కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి చెల్లించినట్లు సమాచారం. 202 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించకుండా రైతులను మోసం చేసినట్లు తెలుస్తోంది. రైతులు ఒక సంవత్సరంలోపు వడ్డీ చెల్లించుకుంటే ఆ రుణం మీద  12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీని రాయితీగా ఇచ్చింది. లక్షల నుంచి మూడు లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ రాయితీ మాత్రమే చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే నాలుగు శాతం వడ్డీ రాయితీ వర్తించదు. సంవత్సరానికి రైతులు వడ్డీ రాయితీ కింద 200 కోట్ల రూపాయలు వంతున ఐదు సంవత్సరాలలో సుమారుగా 1000 కోట్ల రూపాయలను నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ పంట, ఈ కేవైసీ ద్వారా పంటల నమోదును చేస్తూ రైతులకు చెల్లించాల్సిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గోడుతుంది. గత వైసిపి ప్రభుత్వంలో ఈ విధానం ద్వారా జిల్లాలోని రైతులు భారీగా నష్టపోయారు. ప్రస్తుతం కొలువుతీరిన కూటమి ప్రభుత్వమైన ఈ నిబంధనలను సడలించి రైతులందరికీ సున్నా వడ్డీ పథకం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాలోని రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *