నేటి నుండి నాలుగు రోజులు మూతపడనున్న బ్యాంకులు
స్తంభించనున్న బ్యాంకింగ్ లావాదేవీలు
జిల్లాలో మూతపడనున్న 274 బ్యాంకులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. వారాంతంతో శని, ఆదివారం సెలవులు వస్తున్నాయి. దీనికి తోడు బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మెతో బ్యాంకు లావాదేవీలు స్తంభించిపోనున్నాయి. దీంతో చిత్తూరు జిల్లాలోని 274 బ్యాంకులు నాలుగు రోజులపాటు మూతపడనున్నాయి.
మార్చి 22న నాల్గవ శనివారం, తరువాత ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆపై మార్చి 24, 25 అంటే సోమ, మంగళవారం బ్యాంకుల సమ్మె నేపథ్యంలో దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది. రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెబాట పట్టనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి 23వ తేదీన అర్థరాత్రి నుంచి మార్చి 25 వరకు సమ్మె కొనసాగనుంది. దీంతో ఆ రెండు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకుల సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొననున్నారు. బ్యాంకు సేవలు నిలిచిపోనున్నప్పటికీ ఆన్‌లైన్ సేవలు మాత్రం అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు సెలవులు, రెండు రోజుల పాటు సమ్మె కారణంగా నగదు లావాదేవీలు, చెల్లింపులు, అడ్బాన్సులు వంటి బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం నేపథ్యంలో ప్రజలు ముందుగానే బ్యాంకులకు వెళ్లి నగదు లావాదేవీలు జరుపుకుంటున్నారు. గతంతో శనివారం అర్థ రోజు బ్యాంకులు పనిచేస్తున్నాయి. నలుగు అర్థ రోజులను కలిపి రెండు రోజులు బ్యాంకులు పూర్తి సమయం పనిచేయాలని, మరో రెండు రోజులు సెలవులు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండవ, నాలుగవ శనివారాలు బ్యాంకులకు సెవులుగా ప్రకటించారు. మిగిలిన శనివారాలు అంటే ఒకటి, మూడు, అయిదు శనివారాలు బ్యాంకులు ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేస్తున్నాయి. అలా కాకుండా, అన్ని బ్యాంకులకు వారంలో ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. బ్యాంకుల అంతటా అన్ని ఉద్యోగ కేడర్లలో అవసరమైన మేరకు నియామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. పనితీరు సమీక్షలను ఉపసంహరించుకోవాలని, దాడుల నుంచి బ్యాంకు అధికారులు, సిబ్బందికి భద్రత కల్పించాలని అసోసియేషన్ కోరుతోంది. గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం వంటి డిమాండ్లతో బ్యాంకులు సమ్మె బాట పడుతున్నాయి.
పో రై గంగ 1 బ్యాంకు

