చిత్తూరు పట్టణంలో దొంగల భయం
ముసుగు దొంగల స్వైర విహారం
పగలే ఇళ్లలోకి దూరి చోరీలు
అప్రమత్తమైన పోలీస్ శాఖ
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు నగరాన్ని దొంగల భయం వేదిస్తుంది. ఒకవైపు ముసుకు దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. మరోవైపు పట్టపగలే ఇళ్లలోకి దూరి దొంగతనాలు చేస్తున్నారు. పట్టణంలో జరుగుతున్న గొలుసు దొంగతనాల వివరాలు వెలుగులోకి రావడం లేదు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి సంఘటనలు పెరుగుతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్న పట్టణంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈనెల 1వ తారీఖున చిత్తూరు దుర్గానగర్ కాలనీలో ముసుకు దొంగలు స్వైరవ హారం చేశారు. మంకీ క్యాప్ లు ధరించిన నలుగురైదుగుల వ్యక్తులు తాళవేసి ఉన్న ఒక ఇంటిలో తాళాలు పగలగొట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు మేల్కొన్నారు. ప్రజలు అరుపులు, కేకలు వేయడంతో ముసుగు దొంగలు క్యాటర్ బాల్స్ తో ప్రజలపైకి రాళ్ళను విసరి భయభ్రాతలు చేయడానికి ప్రయత్నించారు. ఈలోపు అటుగా పోలీసు గస్తీ వాహనం రావడంతో దొంగలు మెల్లిగా వెళ్లిపోయారు. ఈ విషయాలన్నీ సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు విడుదల చేశారు. ఈ దొంగలు స్థానికులు కాదని పోలీసులు చెబుతున్నారు. వచ్చిన దొంగలు హిందీ మాట్లాడాలని స్థానికులు అంటున్నారు. దీంతో జిల్లా పోలీసులు చిత్తూరు పట్టణంలో ప్రజలను అప్రమత్తం చేసింది. తాళం వేసిన ఇళ్ల వివరాలను ముందుగా పోలీసులుకు అందజేయాల్సిందిగా కోరింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి ముందర వివిధ రకాల ధ్యానులు, అరుపులు, కేకలు వినిపించినా, తెలియని వ్యక్తులు తలుపు తట్టినా తీయవద్దని పోలీసులు హెచ్చరించారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని
సీనియర్ పాత్రికేయులు, న్యాయవాది వరదరాజుల వారి గృహంలో పట్టపగలు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం 9 నుండి 10 గంటల మధ్యలో ఆయన ఇంట్లో విశ్రాంతిగా ఉండగా, దొంగలు లోపలికి చొరబడి రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ అపహరించారు. బాధితుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తరువాత క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇలా పట్టపగలు నగరంలో దొంగతనాలు, చోరీలు జరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో, కాలనీల్లో రాత్రి మరియు తెల్లవారుజామున గస్తీ పెంచాలిని ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు నగరంలోని ప్రధాన కూడళ్లు, నివాస ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును కఠినతరం చేయాలని, సీసీ కెమెరా వ్యవస్థను బలోపేతం చేయాలని మనవి చేస్తున్నారు. ముఖ్యమైన రహదారులు, అపార్ట్‌మెంట్లు, కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయాలని, వాచ్ మెన్ల నియామకం చేసుకున్న విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ సీసీ కెమెరాల నెట్‌వర్క్‌ను ఒక ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావాలని, పౌరుల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అంటున్నారు.
ప్రజలకు స్వీయ రక్షణ గురించి అవగాహన కల్పించాలని, అపరిచిత వ్యక్తులను ఇంట్లోకి అనుమతించకూడదని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలనే సందేశాన్ని ప్రచారం చేయాలని కోరుతున్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఉన్న చిత్తూరు నగరాన్ని దొంగలు సురక్షిత ఆశ్రయంగా మలుచు కుంటున్నారని అంటున్నారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను పటిష్టం చేయాలని, వాహనాల తనిఖీ తూతూమంత్రంగా కాకుండా పటిష్టంగా నిర్వహించాలని మనవి చేస్తున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను గుర్తించి వారికి సంబంధించిన వివరాలను తమిళనాడు, కర్ణాటక పోలీసులతో పంచుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించి, గతంలో కేసులున్న వారిపై నిఘా ఉంచాలని మనవి చేస్తున్నారు. పట్టణ చివరన ఉన్న కాలనీలో మరింత భద్రత పెంచాలని,
అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘాను మరింత తంతాలంటున్నారు. ఖాళీ భవనాలు, అధిక రద్దీ లేని రహదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కాలనలో తిరుగుతున్న సందర్భాల్లో తక్షణమే చర్యలు తీసుకోనే విధంగా చర్యలో ఉండాలని కోరుతున్నారు. కేవలం పోలీస్ శాఖ మాత్రమే కాకుండా, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నేరస్తులను పట్టుకునేందుకు ఇళ్ల యజమానులు తమ ఇంటి ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలి. కాలనీల్లో ప్రత్యేక భద్రతా కమిటీలను ఏర్పాటు చేసి సమిష్టిగా చిత్తూరును సురక్షిత నగరంగా మార్చేందుకు కృషి చేయాలి. సైబర్ నేరాలతో పాటు గోలుసు దొంగల చోరీలు, ఇళ్ల చోరీలు గురించి కూడా ప్రజలకు అవగాహన కలగజేసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే చిత్తూరు పట్టణంలో పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళలో గస్తీలను, నిఘాను ముమ్మరం చేశారు. ఇందుకు తోడు ప్రజల సహాయ సహకారాలు కూడా తీసుకోవడం అవసరం.
పో రై గంగ 1 చిత్తూరు దుర్గా నగర్ కాలనీలో ముసుగు దొంగల స్వైర విహారం. సీసీ కెమెరా ఫుటేజ్

