జీడి నెల్లూరు నియోజకవర్గంలో బట్టబయలు ఐన వర్గపోరు !
ప్రత్యర్థులే లక్ష్యంగా రెండు వీడియోలు చేసిన ఎమ్మెల్యే థామస్
ప్రత్యర్థులే వైసిపి నాయకులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు
ఎమ్మెల్యే మీద ప్రత్యర్థుల ఫిర్యాదుల పరంపర
నియోజకవర్గ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న అధిష్టానం
అధిష్టానం స్పందన పై సర్వత్రా ఉత్కంఠ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపిలో వర్గపోరు బట్టబయలు అయ్యింది. శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ రెండు వీడియోలను విడుదల చేశారు. అందులో తమ పార్టీకి చెందిన కొందరిని తొట్టి గ్యాంగ్ అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానాలు చేసారు. తొలి నుంచి పార్టీలో ఉన్న కొందరు సీనియర్ టిడిపి నేతలను టార్గెట్ చేసి విమర్శలు సందించారు. ఆయనపై కొందరు పనికట్టుకుని పత్రికలలో తప్పుడు వార్తలు రాయిస్తున్నరని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. వారిపై అసభ్య పద ప్రయోగం చేస్తూ అసహనం ప్రదర్శించారు.
మార్చి ఒకటవ తేదీ సిఎం చంద్రబాబు నాయుడు జి డి నెల్లూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య అగ్గి రాజేసింది. చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి నేతలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వైసిపి నేతలకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టు అన్నారు. అంటే కొందరు నాయకులు వైసిపి వారికి సహాయం చేస్తున్నట్టు తనకు సమాచారం ఉన్నందున ఆ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందని తరువాత వివరణ ఇచ్చారు. అయితే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో ఎవరికి అన్యాయం చేయమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే థామస్ విజయానంద అనుచరుడు హరీష్ యాదవ్, రోజా సన్నిహితుడు శరవణను చేర దీయడమే ఇందుకు కారణం అంటూ ఒక వర్గం నాయకులు ప్రచారం చేసారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. ఎమ్మెల్యే పిఎ చంద్రా పైరవీలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. టిడిపి నాయకులు కొందరు తమ అవినీతికి అడ్డు వస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ప్రతి ఆరోపణలు చేశారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు అధిష్టాన వర్గానికి పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు చేసారు. ఈ సమాచారం తెలిసిన ప్రధాన దిన పత్రికలు, పిడీఫ్ పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. రెండు వర్గాల ఆరోపణలు మేళవించి ప్రత్యేక కథనాలు అందించారు. దీనితో రెచ్చి పోయిన ఎమ్మెల్యే ప్రధానంగా ఐదుగురు సీనియర్ నాయకులను ఉద్దేశించి అసభ్య పదాలతో విమర్శలు చేశారు. ఈ ఐదుగురు తొట్టి గ్యాంగ్ అని, తిరుపతి, చిత్తూరులో క్వార్టర్, హాఫ్ బాటిల్ మందు తాగి తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారాని ధ్వజం ఎత్తారు. ఆయన పరోక్షంగా పాలసముద్రం మండలానికి చెందిన ఒక సీనియర్ నాయకుడే ఇందుకు కారణం అన్నారు. పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్ ఆర్ పురం మండలాలకు చెందిన నలుగురు నాయకులు ఆయనతో కలసి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో తాను ఎస్సీ కాదని కొందరు ప్రచారం చేశారని ఆరోపణ చేసారు. వారికి తగిన బుద్ధి చెపుతానని హెచ్చరించారు. ఒక వైపు వారిని విమర్శిస్తూ వైసిపి నుంచి వచ్చిన హరీష్ యాదవ్, శరవణ ను వెనకేసు కొచ్చారు. పక్క నియోజక వర్గాలలో కొంత మందిని చేర్చుకుంటే లేనిది, తాను చేర్చుకుంటే అభ్యంతరం వచ్చిందా అంటూ నిలదీశారు.
ఈ పరిస్థితిని చూస్తే కొత్త నీరు వచ్చి పాత నీరును నెట్టేసినట్టు, ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వర్గపోరు మరింత శ్రుతి మించి రాగాన పడే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. నియోజకవర్గంలో రెండు వర్గాలు డి అంటే డి అనే స్థాయికి వెళ్లిపోయాయి ఒకరి మీద ఒకరు ఆరోపణలో ప్రత్యరోపణలు చేస్తున్నారు. అధిష్టాన వర్గానికి భారీగా ఫిర్యాదులు వెళ్తున్నాయి. లేక లేక 20 సంవత్సరాల తర్వాత గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది ఈ ఆనందం ఇటు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులలో, అటు అధిష్టాన వర్గంలో కానీ లేకుండా పోయింది. పాత కాపులు కొత్తగా పార్టీలో వచ్చినవారు అంటూ పార్టీ నిలువన రెండుగా చీలిపోయింది. కరెక్ట్ గా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. పార్టీ పుట్టిన పటాలు నచి ఉంటూ
పార్టీ జండా మోసిన తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. అధిష్టాన వర్గం పరిస్థితి అడా కత్తెరలో పోకలాగా తయారైంది. మొదటనుంచి పార్టీ జండా మోసిన కార్యకర్తలను వదులుకోవడానికి అధిష్టానము ఇష్టపడడం లేదు. అలాగే ప్రజాప్రతినిధి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. విడవమంటే పాముకు కోపం, మింగమంటే కప్పకు కోపం అన్న విధంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారయింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గ మీద అధిష్టాన వర్గం పూర్తిస్థాయిలో దృష్టిని సారించింది. అయితే ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఎవరి మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని ఉపేక్షిస్తే పార్టీ పరువు బజారుకు ఎక్కుతుంది. ఈ నేపథ్యంలో టిడిపి అధిష్టానవర్గం ఏం చేస్తుందో వేసి చూడాలి.

