పెనుమూరు బస్టాండు షాపులను పంచుకున్న రాజకీయ పార్టీ నేతలు
కూటమి నేతలతో, వైసిపిలో ఒక వర్గం కుమ్మక్కు
నామమాత్రం ధరకే షాపుల కేటాయింపు
పంచాయతీ ఆదాయానికి భారీగా గండి
న్యాయ పోరాటానికి వైసిపిలోని ఒక వర్గం సమాయత్తం
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
వేలం పాట ద్వారా కేటాయించవలసిన పెనుమూరు బస్టాండు వాణిజ్య సముదాయం గదులను కనీస ధరకు పాడుకుని నాలుగు పార్టీల నాయకులు పంచుకున్నారు. ప్రభుత్య ఆదాయానికి గండి కొట్టడానికి కూటమి నాయకులతో పాటు, వై సి పీ నాయకులు కూడా కుమ్మక్కు అయ్యారు. దీంతో సగం ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. నాలుగు పార్టీల నాయకులు సగం ధరకే షాపులను దక్కించుకొని, రెట్టింపు మొత్తాలకు మొత్తాలకు ఇతరులకు బాడుగకు ఇచ్చేశారు. వార్తకు రాయకుండా ఉండటానికి ఒక విలేకరికి కూడా ఒక షాపును ఎర వేసినట్లు సమాచారం. దీంతో వైసిపీ లోని మరో వర్గం భగ్గు మంటోంది. న్యాయ పోరాటానికి సిద్దం అవుతున్నారు.
పెనుమూరు బస్టాండు సముదాయంలో ఉన్న 24 గదులకు బుధవారం సచివాలయం ప్రాంగణంలో వేలం జరిగింది. దాదాపు 380 మంది రూ 50 వేల చొప్పున డిపాజిట్ కట్టారు. అయితే టిడిపి నాయకులు ఎవరిని వేలంలో పడకుండా అడ్డుకున్నారు. బయటి నుంచి 100 మంది రౌడీలను తీసుకుని వచ్చి మోహరించారు. బలంలేని వారిని భయపెట్టి పంపేశారు. పోలిసులు చూసి చూడనట్టు వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఖరికి నాలుగు పార్టీల నాయకులు కుమ్మకై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కొద్ది ఎక్కువగా పాడుకున్నారు. అంటే ఒక్కొక్క గది రూ 9000 నుంచి 10 వేల లోపు పాడుకున్నారు. నాలుగు పార్టీల నేతలు పంచుకున్నారు. టిడిపి నాయకులు 17 గదులను తీసుకుని, నారాయణ స్వామి వర్గానికి చెందిన వైసిపి నాయకులకు నాలుగు గదులు కేటాయించారు. జనసేన మండల అధ్యక్షుడు, బిజెపి మండల అధ్యక్షురాలు చెరి ఒకటి తీసుకున్నారు. జనసేన కోటాలో ఒక జర్నలిస్టుకు ఒక గది ఇచ్చినట్లు సమాచారం. కొందరు అప్పుడే ఒక్కో గదిని రూ 18 వేలకు వేరే వాళ్ళకు అమ్ముకున్నారని సమాచారం. పారదర్శకంగా వేలం పాట జరిగి ఉంటే ఒక్కో గదికి 20 వేల వరకు వచ్చి ఉంటుందని అంటున్నారు. అంటే నాయకుల కుమ్మక్కు వల్ల పంచాయతీ ఆదాయానికి నెలకు రెండున్నర లక్షలు, సంవత్సరానికి 30 లక్షల రూపాయలు గండి పడిందని మాజీ సర్పంచ్ ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా కొంత మంది అప్పులు చేసి డిపాజిట్ కట్టి దరఖాస్తు సమర్పించినా లాభం లేక పోయిందని అవేదన వ్యక్తం చేశారు. వైసిపికి చెందిన ఒక వర్గం హై కోర్టుకు వెళ్ళి స్టే తేవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. వైసిపి అధికారంలో ఉండగా జిల్లా పరిషత్ నిధులు 90 లక్షలు ఖర్చు చేసి 24 గదులు నిర్మించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి పట్టుబట్టి జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేయించారు. ఆయన అన్న కుమారుడు దయాసాగర్ రెడ్డి నిర్మాణం పనులు చేపట్టారు. అయితే అప్పటి ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి సహకరించక పోవడంతో వేలం జరగలేదని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక టిడిపి నేతలు అడ్డు పడ్డారని తెలిసింది. అయితే టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఉప ముఖ్య మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన వేలం వేయాలని అధికారులను ఆదేశించారు. నాలుగు పార్టీల నాయకుల స్వార్థం వల్ల పంచాయతీ తీవ్రంగా నష్టపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించాలి
పెనుమూరు బస్టాండ్ సముదాయంలోని షాపుల వేలం అప్రజాసామికంగా జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాకర్ రెడ్డి ఆరోపించారు. కూటమి పార్టీ నేతలు వైసిపి లేని ఒక వర్గం కుమ్మక్కై బహిరంగంగా వేలం పాడకుండా రౌడీలతో బెదిరించి, వారే నామమాత్రపు ధరకు గదులను సొంతం చేసుకున్నారని ఆరోపించారు. వీరికి పోలీసులు కూడా సహకరించాలని, ఇందువల్ల పంచాయతీకి భారీగా నష్టం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్లామని, బుధవారం జరిగిన గదుల కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తిరిగి జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గదులను తిరిగి బహిరంగంగా వేలం వేయాలని దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
పో రై గంగ 4 పెనుమూరులో జరిగిన బస్టాండ్ సముదాయంలోని షాపుల వేలం

