9, మార్చి 2025, ఆదివారం

జీడీ నెల్లూరు నియోజకవర్గంలో లాలూచీ రాజకీయాలు

రెండు వర్గాలుగా విడిపోయిన నియోజకవర్గ నేతలు 

వైసీపీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఒక వర్గం అసంతృప్తి 

ముఖ్యమంత్రి పర్యటనకు కూడా ఒక వర్గం దూరం

మార్కాపురం సమావేశంలో తన ఆవేదనను వెలిబుచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ



"గంగాధర నెల్లూరులో నేను ఒక మాట మాట్లాడాను. నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులతో లాలూచీపడ్డారు. లాలూచీపడి రాజకీయాలు చేస్తే సహించని చెప్పా. దానికే వైసిపి వాళ్ళు గింజుకుంటున్నారు. వైసిపి వాళ్లతో మా కార్యకర్తలు లాలూచీపాడాలా ? మీతో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న మా కార్యకర్తలకు కాదని మీకు  పనులు చేసి పెట్టాలా?  అలాంటివి  నేను సహించని చెప్పాను. ఎక్కడైనా చిన్న పని ఉంటే,  డబ్బులు తీసుకోని  లేక లాలూచిపడి  వైసిపి వారికి పనులు చేస్తే, నిజమైన కార్యకర్తలు ఏమవుతారు ? వారి మనోభావాలు ఏమవుతాయి? మా కుటుంబము, మా బంధువులు అని  చూసుకుంటే నిజమైన కార్యకర్తలను ఎవరు చూస్తారు?   అందుకే గంగాధర నెల్లూరు సమావేశంలో ఆ మాట చెప్పాను" అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శనివారం మార్కాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

మార్కాపురంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి అవగతం అవుతుంది. ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. అది కూడా రాష్ట్రవ్యాప్తంగా వీచిన తెలుగుదేశం గాలిలో నెగ్గుకొచ్చారు. ఈ నియోజకవర్గ మొదటినుంచి వర్గ విభేదాలకు పట్టుకొమ్మ. నియోజకవర్గంలోని ఏ ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం లేదు. నియోజకవర్గంలో ఆరు మండలాలు  ఉండగా ఆరుగురు మండల పార్టీ అధ్యక్షులను సమన్వయ చేసుకున్న వెళ్లే నాయకత్వం నియోజకవర్గం లో లేదు. నియోజకవర్గంలో ఎవరికి వారి యమునా తీరు అంటూ ఒక్కొక్క మండలంలో ఒకటి రెండు వర్గాలుగా విడిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వర్గ విభేదాలతో సొంత పార్టీని ఓడించడం  ఆనవాయితీగా మారింది.  మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కుతువులమ్మ గతంలో  తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేసినా, ఆమెను కూడా ఓడించిన ఘనత గంగాధర నెల్లూరు నియోజకవర్గానిది. నియోజకవర్గాన్ని ఒక తాటిపైకి తీసుకొని వచ్చి నాయకత్వం నియోజకవర్గంలో లేదు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ హరికృష్ణ కొంతకాలం నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు. ఆయన నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండగానే చిట్టిబాబును నియోజకవర్గ సమన్యాయ కర్తగా అధిష్టానం నియమించింది. దీంతో హరికృష్ణ మనస్తవంతో పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసిపికి దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డాక్టర్ థామస్ అనూహ్యంగా తెరమీదకి వచ్చారు. చెన్నైలో సంతాన సాఫల్యం కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఆయన అధిష్టానాన్ని   మెప్పించి తనకు టికెట్ ఉన్న ఖరారు చేసుకున్నారు. టికెట్ ఖరారైన మొదట్లో నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండున చిట్టిబాబు అన్ని తనై థామస్ ను  నడిపించారు. నియోజకవర్గం మొత్తం పర్యటించి, అందరిని పరిచయం చేశారు. ఎన్నికల సమయం వరకు ఇద్దరు కలిసి ఉన్న అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తయి. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం మొత్తం ఒక కూటమిగా ఏర్పాటయింది. ఈ సామాజిక వర్గం ప్రస్తుత శాసనసభ్యుడికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో బలంగా పనిచేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కి పార్టీ అధిష్టాన వర్గానికి ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను, గ్రానైట్, ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా విషయాలను చేరవేస్తోంది. ఇంతే ధీటుగా  శాసనసభ్యుడు థామస్  వర్గం కూడా పనిచేస్తుంది. నియోజకవర్గం లోని కమ్మ సామాజిక వర్గం మీద ఆరోపణలను, విమర్శలను గుప్పిస్తున్నారు. వారి మీద పార్టీ కార్యాలయానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజావేదిక కార్యక్రమంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కమ్మ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఇదే విషయాన్ని కమ్మ సామాజిక వర్గ నేతలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు. ఈ విషయాన్ని తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే థామస్ దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. అందుకు దీటుగా థామస్ కూడా ఆ వర్గం మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇలా నియోజకవర్గంలో రెండు వర్గాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు విడిపోయారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెల్లాయించడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. వైసీపీకి చెందిన ఇద్దరు నేతలను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చేరదీశారని వారి అండదండతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని కమ్మ సామాజిక వర్గం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబును బాదించిన సంఘటనలు ఏవి అన్న విషయం జిల్లా, ముఖ్యంగా జి డి నెల్లూరు నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ఇటీవల జి డి నెల్లూరుకు చెందిన వైసిపి నేత హరీష్ యాదవ్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఆయన గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి సన్నిహితుడు. ఆయనపై గతంలో టిడిపి నేతలు పలు ఆరోపణలు చేశారు. ఎర్ర చందనం, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలో ఆయన హస్తం ఉందని చెప్పారు. అలాంటి వ్యక్తిని టిడిపిలో చేరి, ఎమ్మెల్యే అండతో  మళ్ళీ అక్రమాలకు తెర తీశారని కీలక నేతలు కొందరు చంద్రబాబుకు ఫిర్యాదులు చేసారు. ఇటీవల ప్రతి కార్యక్రమం ఆయన కనుసన్నల్లో జరగడాన్ని నిజమైన కార్యకర్తలు సహించలేక పోతున్నారని ఒక టిడిపి నాయకుడు చెప్పారు. అలాగే చెన్నైకి చెందిన శరవణ కూడ టిడిపి నేతల ఆశీస్సులతో అక్రమాలు చేస్తున్నారని చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. మాజీ మంత్రి రోజాకు సన్నిహితుడు అయిన ఆయన పలు అక్రమ వ్యాపారాలు చేస్తుంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు, పెనుమూరు మండల కమిటీ అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు తదితరులు ఎమ్మెల్యేపై ఆధారాలతో సహా చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారని తెలిసింది. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే థామస్, చిట్టిబాబు, రుద్రయ్యలపై పలు ఆరోపణలు చేశారని అంటున్నారు. ఈ నేతలు ఎస్సీ అయిన తనను అణచి వేయడానికి వర్గ రాజకీయాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. చిట్టిబాబు నాయుడు గతంలో రోజాకు తన రిసార్ట్స్ లో ఆతిధ్యం ఇచ్చారని చెప్పినట్టు తెలిసింది. అలాగే ఈ వర్గం ఎర్ర చందనం, ఇసుక, కలప అక్రమ రవాణా చేస్తున్నారని ఎమ్మెల్యే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని తెలిసింది. వారి అక్రమాలు అడ్డుకున్నందున తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారని అంటున్నారు.  అయితే ఇద్దరి వ్యవహారాల మీద చంద్రబాబు పార్టీ నేతలు, రాబిన్ శర్మ బృందం, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పూర్తి సమాచారం తెచ్చుకున్నారని రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు. దీనితో పార్టీ నాయకులను ఘాటుగా హెచ్చరించారని పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని నియోజకవర్గ సీనియర్ నాయకులు కోరుతున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ రవాణా, అవినీతి అవకతవకులను అదుపు చేయాలని కోరుతున్నారు. నియోజకవర్గంలోని రెండు వర్గాలను సమన్వయం చేసి పార్టీని పటిష్టం చేయాలని కోరుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *