బీసీ రాయితీ రుణాల కోసం బలే డిమాండ్
ఒక యూనిట్ కు 8 మంది దరఖాస్తు
మధ్యలో రంగ ప్రవేశం చేస్తున్న దళారీలు
మండల స్థాయి కూటమి నేతలదే హవా
సందట్లో సడమేగా బీసీ నేతల ఆర్భాటం
దరఖాస్తుదారులకు రుణం ఇప్పిస్తామంటూ ఆశలు
సబ్సిడీ రుణంలో 10 శాతం వాట ఇవ్వాలని షరతులు
సతమతమవుతున్న దరఖాస్తుదారులు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
సుదీర్ఘ విరామం తర్వాత బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం రాయితీ రుణాలలో అందజేస్తున్నంత ఈ రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ఓపెన్ కావడంతో భారీగా దరఖాస్తుదారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడ్డారు. జిల్లాకు 2800 యూనిట్లు మాత్రమే బీసీ రుణాలు మంజూరయ్యాయి. అవి కూడా బీసీ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ల కింద ఈ పథకాలను మంజూరు చేశారు. ఈ పథకాల విలువ 61.25 కోట్ల రూపాయల కాగా, ఇందులో ప్రభుత్వం 30.62 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందజేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా సబ్సిడీ వస్తుండటంతో దరఖాస్తుదారులు కూడా భారీగా ఆశలు పెంచుకున్నారు.
రాయితీ రుణాలలో సబ్సిడీ మొత్తాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్లాబ్ 1 లో రెండు లక్షల రూపాయల వరకు, స్లాబ్ 2 లో 3 లక్షల రూపాయల వరకు, స్లాబ్ 3 లో 5 లక్షల రూపాయల వరకు, స్లాబ్ 4 లో ఎనిమిది లక్షల నుంచి 25 లక్షలు వరకు సబ్సిడీ వస్తుంది. బీసీ లబ్ధిదారులు ఈ సబ్సిడీ పైన భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా బీసీ కార్పొరేషన్ రుణాలు దక్కించుకొని తాము జీవితంలో స్థిరపడవచ్చని ఆశాభావంతో ఉన్నారు. అయితే బీసీ కార్పొరేషన్ రుణాలకు భారీగా దరఖాస్తుల రావడంతో దరఖాస్తుదారులలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఎలాగైనా రుణాన్ని సాధించాలని మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ రాయితీ రుణాలను జిల్లా అధికారులు నియోజకవర్గ, మండల వారీగా విభజించారు. ఆ జాబితాను ఆయా శాసనసభ్యులకు అందజేశారు. వారు ప్రతిపాదించిన వారికి రుణాలను ఇవ్వనున్నారు. దీంతో ఆశావాహులు పలువురు శాసనసభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మరికొందరు మండల స్థాయిలోని కూటమికి నేతల సహాయ సహకారాలను తీసుకొని శాసనసభ్యులను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదునుగా మండల స్థాయిలో కూటమి నేతలు దరఖాస్తుదారులకు హామీల వర్షం కురిపిస్తున్నారు. లోను ఇప్పిస్తా, ధైర్యంగా ఉండమని చెబుతున్నారు. అయితే ఇందులో కొంత ఖర్చవుతుందని, పది శాతం వరకు భరించాల్సి ఉంటుందని షరతు పెడుతున్నారు. ఇదే అదునుగా కొంతమంది బీసీ నాయకులు కూడా దళారుల అవతారం ఎత్తుతున్నారు. కొంత మంది కులసంఘ నాయకులతో కలిసి దరఖాస్తుదారులకు వల విసురుతున్నారు. వీరు తమకు బీసీ కార్పొరేషన్ అధికారులు, శాసనసభ్యులు బాగా తెలుసనీ, వారితో చెప్పి రాయితీ రుణాలను ఇప్పిస్తామని దరఖాస్తుదారులను ఆశపడుతున్నారు. వారి నుంచి ముందుగానే డబ్బులను కూడా వసూలు చేస్తున్నారు. గతంలో ఎంబీసీ కార్పొరేషన్ తరపున ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేసింది. ఇందులో కూడా కొంతమంది దళారులు రంగ ప్రవేశం చేసి, తామే డబ్బులు మంజూరు చేపిమ్చమని, ఒక్కొక్క లబ్ధిదారుల దగ్గర 3000 నుంచి 5000 రూపాయల వరకు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇదేవిధంగా ప్రస్తుతం బీసీ రాయితీ రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. మధ్య దళారీలు రంగ ప్రవేశం చేస్తున్నారు. ఏదో ఒకటి విధంగా దరఖాస్తుదారులను మభ్యపెట్టి తమ గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీసి కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం బిసి రాయితీ రుణాలకు మండల, మునిసిపాలిటి స్థాయిలో అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తులు భారీగా రావడంతో జిల్లా అధికారులు ఎంపిక బాధ్యతలను సంబంధిత ఎమ్మెల్యేలకు అప్పగించారు. మండల, నియోజకవర్గ వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లను విభజించారు. ఈ మేరకు జాబితాలను సంబంధిత ఎమ్మెల్యేలకు అందజేశారు. ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి మాత్రమే సబ్సిడీ రుణాలు అందచేయాలని జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో బీసీల ఆర్థికాభివృద్ధికి 38.41 కోట్ల రూపాయలతో ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని 2020 మంది బీసీలు లబ్ధి పొందనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా 19.20 కోట్ల రూపాయలను అందచేస్తుంది. ప్రభుత్వ పథకాలను మూడు స్లాబ్ లుగా విభజించి, మొదటి స్లాబ్ లో యూనిట్ ధర రెండు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో 75 వేల రూపాయలు సబ్సిడీ ఉంటుంది. రెండవ స్లాబ్ లో యూనిట్ ధర మూడు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో 1.25 లక్షలు సబ్సిడీకాగా, మూడవ స్లాబ్ లో యూనిట్ ధర 5 లక్షల రూపాయలు. ఇందులో రెండు లక్షల రూపాయలు సబ్సిడీగా వస్తుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ కింద జిల్లాకు 16 యూనిట్లు 33 లక్షల రూపాయలతో మంజూరయ్యాయి. ఈబీసీ కార్పొరేషన్ కింద 89 యూనిట్లకు 1.75 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు 73 మంది లబ్ధిదారులకు 1.46 కోట్లతో ప్రణాళికను రూపొందించారు. క్షత్రియ కార్పొరేషన్ కింద 11 మంది లబ్ధిదారులకు 23 లక్షలతో, రెడ్డి కార్పొరేషన్ కింద 65 మందికి 1.30 కోట్ల రూపాయలతో, వైశ్య కార్పొరేషన్ కింద 13 మంది లబ్ధిదారులకు 28.5 కోట్ల రూపాయలతో రుణాలు అందచేయనున్నారు. అలాగే కాపు కార్పొరేషన్ కు 14.96 కోట్ల రూపాయలతో వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కాపు కార్పొరేషన్ కింద 445 మంది లబ్ధిదారులు లబ్ధి పొందనున్నారు. 14.96 కోట్ల రూపాయలలో 7.48 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది. కాపు కార్పొరేషన్ కింద నాలుగు స్లాబులుగా ఈ పథకాలను విభజించారు. స్లాబ్ 1 లో యూనిట్ ధర రెండు లక్షల రూపాయలు. ఇందులో లక్ష రూపాయలు సబ్సిడీ ఉంటుంది. స్లాబ్ 2 లో యూనిట్ ధర 3 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో 1.50 లక్షలు సబ్సిడీ కాగా స్లాబ్ 3లో యూనిట్ ధర ఐదు లక్షల రూపాయలు. ఇందులో సబ్సిడీ 2.5 లక్షల రూపాయలు. ఇవి కాకుండా స్లాబ్ 4 లో యూనిట్ ధరను 25 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 10 లక్షల రూపాయలు. ఇలా జిల్లా స్థాయిలో బిసి రాయితీ రుణాల కోసం పలువురు ఆశలు పెట్టుకున్నారు. ఉనలను పొంది జీవితంలో స్థిరపడాలని లబ్దిదారులు ఆశపడుతున్నారు. ఇదే అదనుగా దరఖాస్తుదారుల నుండి కమీషన్లు దండుకొని లబ్ది పొందారని కొందరు బిసి నేతలు, కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికార యంత్రాంగం చోధ్యం చూస్తోంది.
పో రై. గంగ 1 చిత్తూరు మున్సిపాలిటీలో జరిగిన రాయితీ రుణాల ఇంటర్వ్యూకు హాజరైన దరఖాస్తుదారులు.

