1, మార్చి 2025, శనివారం

రాష్ట్రంలో అడవి పందుల్లా విధ్వంసం సృష్టించారు


కేంద్ర ప్రభుత్వ నిధులను పంది కుక్కల్లా మెక్కారు. 

గత ఐదు సంవత్సరాల పాలనపై చంద్రబాబు సెటైర్లు 

జీడి నెల్లూరులో 2000 ఎకరాలలో పారిశ్రామిక వాడ 

మామిడి బోర్డు ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం 

సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు తీయిస్తాం 

గంగాధర్ నెల్లూరు బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు


చిత్తూరు, మార్చి 1, (ఆంధ్రప్రభ బ్యూరో)

గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో అడవి పందులు లాగా విధ్వంసం సృష్టించారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం గంగాధర నెల్లూరు హరిజనవాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడానికి విచ్చేశారు. పింఛన్ల పంపిణీ అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అడవి పందులు పొలంలో తిన్నంతవరకు తిని, వెళ్లేప్పుడు మొత్తం తొక్కి, ధ్వంసం చేసి వెళ్లిపోతాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను గత ఐదు సంవత్సరాల కాలంలో పందికొక్కల్లా మెక్కారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 94 కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రానికి నిధులు విడుదల అయ్యాయన్నారు. రాష్ట్ర నిధులకు తోపాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా జత చేసి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి, యూసి లను అందజేయాల్సి ఉంటుందన్నారు. అయితే గత ఐదు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇష్టానుసారం మెక్కారని, వాటికి లెక్కా పక్కా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిరిగి నిధులు విడుదల చేయమని కోరగా, గతంలో విడుదల చేసిన నిధులకు యూసీలు అడుగుతున్నారని చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన 9,371 కోట్ల రూపాయలను వ్యయం చేసి,  యూసీ లను అందజేసి మళ్లీ కొత్తగా నిధులను అడగాల్సిన పరిస్థితి  రాష్ట్రంలో ఉందన్నారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను బకాయిలుగా మిగిల్చిందని, వాటిని తీర్చాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు. అలాగే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని, ఆప్పు వడ్డీ చెల్లిస్తూనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రం మొత్తం రోడ్లు గుంతల మయం అయ్యాయని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 85 శాతం గోతులను పూడ్చామన్నారు. మరో రెండు నెలల కాలంలో మిగిలిన గుంతలను కూడా పూడ్చి, సజావుగా ప్రయాణం చేయడానికి అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 2వేల ఎకరాలలో పారిశ్రామిక వాడను ర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం సిక్స్ వే రోడ్డుకు అనుసంధానంగా ఉందన్నారు. చిత్తూరు - పర్చూరు హైవే సిద్ధమవుతుందని, అలాగే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కూడా సిద్ధమవుతుందని వివరించారు .ఎక్స్ప్రెస్ హైవే సిద్ధమవుతే 50 నిమిషాల్లో చెన్నై చేరవచ్చన్నారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడానికి అవసరమైన భూములను గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. గంగాధర నెల్లూరులో అన్న క్యాంటీన్ కూడా తొందర్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. తొందరలోనే డీఎస్సీని పూర్తి చేస్తామని, పాఠశాలలు తిరిగి ప్రారంభించే లోపు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం తగ్గిపోతుందని, ఉద్యానవన పంటలు భారీగా పెరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. మామిడి రైతులు మామిడి బోర్డును కావాలని కోరుతున్నారని, ఆ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే మామిడికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పాడి పరిశ్రమకు కూడా చేయూత ఇస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలోనే పింఛన్లను భారీగా పెంచినట్లు చంద్రబాబు వివరించారు. సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూనే అభివృద్ధిని కూడా పరుగు తీయిస్తామని చంద్రబాబు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చామని, దీని ద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ బడ్జెట్ ను ఎస్సీలు, ఎస్టీలకు, బీసీలకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతలుగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయలు కలుపుకొని 20000 రూపాయలను చెల్లిస్తామన్నారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తున్నామని, వృత్తి పని వారికి ఆదరణ పథకం కింద ఆధునిక పనిముట్లను అందజేస్తామన్నారు. ఇళ్లకు విద్యుత్తు చార్జీల భారం పడకుండా, ఇంటి మీదనే విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా తాను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. 30 సంవత్సరాల తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు చంద్రబాబు అష్ట వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఎంవి థామస్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని, కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలను పూర్తి చేయాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. నియోజకవర్గంలో చెరుకు, మామిడి పంటలు ఎక్కువగా ఉన్నాయని, ఆ రైతులను ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఇన్చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా వేదిక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 

ప్రజా వేదికకు హాజరైన ప్రజలు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *