జనారణ్యంలోకి వస్తున్న వన్యప్రాణులు
ఆహారం, నీటి కోసం వేట
ప్రమాదానికి గురవుతున్న ప్రాణులు
వేటగాళ్లకు బలి అవుతున్న ప్రాణాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఇటీవల కాలంలో వన్యప్రాణులు జనారణ్యంలోకి రావడం పెరిగిపోతుంది. నీరు, ఆహారం కోసం చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, దుప్పిలు, నక్కలు, కోతులు వంటి జంతువులు గుంపులుగా గ్రామాలు, పట్టణాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇవి పంటలను ధ్వంసం చేయడమే కాకుండా, మానవులపై దాడులు చేయడం, ప్రజలలో భయాన్ని కలుగాచేస్తున్నాయి. ముఖ్యంగా అడవుల వినాశనం, మానవ కార్యకలాపాలు, ఆహార మరియు నీటి కొరత ప్రధాన కారకాలు అడవి శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తవణంపల్లి మండలం వెంకటాపురం పంచాయతీ బాబి నాయుడు పల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తును కృష్ణ జింక పడిపోయింది. తాగునీటి కోసం వెతుకుతూ వచ్చిన ఆ వన్యజీవి బావిలో పడి వెలుపలికి రాలేక నానా తిప్పలు పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందజేశారు. వారు వచ్చి కృష్ణ జింకను కాపాడి అడవుల్లోకి వదిలారు. రెండు నెలల కిందట బంగారుపాలెం మండలం మొగిలి సమీపంలోని ఒక వ్యవసాయ బావిలోకి ప్రమాదవశాత్తున గున్న ఏనుగు పడిపోయింది. బావి లోతుగా ఉండటంతో పైకి రాలేక ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి గున్న ఏనుగును వెలికి తీశారు. ఇలా చిత్తూరు జిల్లాలో తరచుగా వన్యప్రాణులు అరణ్యాల నుండి వెలుపలికి వస్తున్నాయి. ఆహారము, నీటి వేటలో భాగంగా ఇవి ప్రమాదాలకు గురవుతున్నాయి. మరికొన్నింటిని స్థానికులు వేటాడి చంపి తింటున్నారు. మరికొందరు చిరుతలు వంటి వాటిని వేటాడి గోళ్లు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్నారు. యాదమరి, సదం మండలాల్లో ఎలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. మానవ జనాభా పెరుగుదలతో అడవులు రోజు రోజుకు నాశనమవుతున్నాయి. వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం, పట్టణాలు, రోడ్లు, పరిశ్రమల నిర్మాణం, అక్రమ కట్టడాలు, మైనింగ్, వాతావరణ మార్పులు వన్యప్రాణుల సహజ నివాసాలను ధ్వంసం చేస్తాయి. అడవుల పరిమితి తగ్గిపోవడంతో వాటి సహజ ఆహార, నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో అవి జనావాసాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వన్యప్రాణులు సహజంగా అడవుల్లో ఉన్న శికారు జంతువులను వేటాడి తింటాయి. కానీ అధిక వేట, అడవుల వినాశనం వల్ల తినేందుకు ఏమీ లేకుండా పోతుంది. కొన్ని వన్యప్రాణులు రాత్రిపూట పశువుల షెడ్లలోకి ప్రవేశించి, గేదెలు, ఆవులను వేటాడడం ప్రారంభించాయి. నీటి లభ్యత లోపం కూడా మరో కారణం నదుల పునరుత్థానం లేకపోవడం, చెరువుల భూసేకరణ, వర్షాభావ పరిస్థితులు, వీటి వల్ల అడవుల్లో తాగేందుకు నీరు లేక, వన్యప్రాణులు మానవ ప్రాంతాల్లోకి రావడం సహజంగా మారింది. ఇందుకు తోడు రోజురోజుకు పట్టణాలు విస్తరిస్తున్నాయి. పరిశ్రమల నిర్మాణం వల్ల పెద్దఎత్తున అడవులు తగ్గిపోతున్నాయి. మనిషి అతి వినియోగంతో ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయి. వేట, అక్రమ వాణిజ్యం కూడా క్రమంగా పెరుతోంది. కొన్ని వన్యప్రాణుల చర్మం, దంతాలు, ఎముకలు వంటి భాగాలను అక్రమంగా విక్రయించడానికి వేటగాళ్లు విపరీతంగా వేటాడుతున్నారు. దాంతో వాటి ఆహార శృంఖలికతోగి, మిగిలిన వన్యప్రాణులు భయంతో జనావాసాల్లోకి వస్తున్నాయి. జనారణ్యంలోకి వన్యప్రాణులు రావడం వల్ల ప్రజలకు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల్లోకి రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు, వృద్ధులు ఇళ్ల బయట తిరగడానికి భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు రాత్రి వేళల్లో కదలికలు తగ్గించారు. చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు ప్రజలపై దాడి చేసిన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వన్యప్రాణుల దాడుల్లో గాయపడి, మరణించిన ఘటనలు కూడా లెక్కలేనన్ని. వన్య ప్రాణులు పొలాల్లోకి వచ్చి వ్యవసాయానికి నష్టం చేస్తున్నాయి. వన్యప్రాణులు పంటలను ధ్వంసం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా అడవి పందులు, ఏనుగులు వరి, వేరుశెనగ, చెరకు, అరటి తోటలు తిని నాశనం చేస్తున్నాయి. రైతులు రాత్రంతా పొలాల్లో ఉండి, వాటిని తరిమేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీవవైవిధ్యానికి ముప్పు ఏర్పడుతోంది. వన్యప్రాణులు తమ సహజ వాతావరణాన్ని కోల్పోతుండడంతో వాటి జనాభా తగ్గుతోంది. కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. వీటిని రక్షించాలి అంటే, అడవుల సంరక్షణ చేపట్టాలి. అడవుల నరికివేతను పూర్తిగా నియంత్రించాలి. అక్రమ నిర్మాణాలను అటవీ శాఖ తొలగించాలి. కొత్త అడవుల పెంపును ప్రోత్సహించాలి. అలాగే వన్యప్రాణుల ఆహార, నీటి వసతి కలుగ చేయాలి. అడవుల్లో సరిపడా నీటి వనరులు ఏర్పాటు చేయాలి. మానవ జనావాసాలకు దగ్గరగా అడవి జంతువులకు ప్రత్యేకంగా తిండి వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వన్యప్రాణుల పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించాలి. వన్యప్రాణులు ఆకస్మికంగా జనావాసాల్లోకి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రజలకు నేర్పాలి. చిరుతలు, ఏనుగుల వంటి జంతువులను వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలి. అటవీ శాఖ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. వన్యప్రాణుల నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను నియమించాలి. నష్టం ఎదురైన రైతులకు సరైన పరిహారం అందించాలి. వేట, అక్రమ వాణిజ్య నియంత్రణ చేయాలి. వన్యప్రాణుల వేటను పూర్తిగా అరికట్టాలి. వన్యప్రాణుల సంరక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేయాలి. వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం అనేది మానవ తప్పిదాల ఫలితమే. మనిషి ప్రకృతిని కాపాడితేనే, వన్యప్రాణుల సమస్య తగ్గుతుంది. ప్రభుత్వాలు, అటవీశాఖ, పర్యావరణ ప్రేమికులు, ప్రజలు కలిసి పనిచేయాలి. వన్యప్రాణులు జనారణ్యంలోకి రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాటి హక్కులను కూడా కాపాడాలి. అప్పుడు మాత్రమే సహజ సమతుల్యత నెలకొంటుంది.
పో రై. గంగ 1 తవనంపల్లిలో బావిలో పడ్డ కృష్ణ జింక
గంగ 2 మొగిలి వద్ద బావిలో పడ్డ ఏనుగు
గంగ 3 యాదమరిలో వేటగాళ్లకు బలైన చిరుత

