టిడిపి పోలిట్ బ్యూరోలో చిత్తూరు జిల్లాకు స్థానం దక్కేనా ?
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
తెలుగు దేశం పార్టీలో అత్యన్నత విధాన నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరో పదవి చిత్తూరు జిల్లా నేతను వరించే అవకాశం ఉందని తెలిసింది. మే నెలలో మహానాడు జరిగిన అనంతరం ఏర్పాటు అయ్యే కొత్త జాతీయ కమిటీలో జిల్లా నేతకు ఒకరికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి బూత్ స్థాయి నుంచి పార్లమెంటు అధ్యక్ష పదవులు పూర్తి చేస్తారని ఇటీవల చంద్రబాబు చెప్పారు. అలాగే మహానాడు తరువాత జూన్ నెలలో పలు నామినేటెడ్ పదవుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. గతంలో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు. తరువాత ఆమె రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే ఈ సారి జిల్లాకు చెందిన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రి నారా లోకేష్ కు ఉప ముఖ్య మంత్రి పదవి ఇవ్వాలంటూ కూటమిలో వివాదానికి కారకులైన ఇద్దరు పొలిట్ బ్యూరో సభ్యులపై వేడు పడే అవకాశం ఉందంటున్నారు.
చంద్రబాబు మైదుకూరు వచ్చినపుడు జరిగిన సభలో పోలిట్ బ్యూరో సభ్యుడు, కడప పార్లమెంటు అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే అంశం లేవనెత్తారు. అలాగే మరో పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి లోకేష్ కు ఉప ముఖ్య మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూటమిలో విభేదాలకు దారి తీసేలా మాట్లాడిన వారిద్దరి పట్ల చంద్రబాబు కోపంతో ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా గత నెల మంత్రి లోకేష్ విశాఖపట్నంలో మాట్లాడుతూ పొలిట్ బ్యూరో లో మూడో వంతు మందిని మారుస్తామని చెప్పారు. యువతకు ప్రాదాన్యత ఇస్తానని ప్రకటించారు. పార్టీ కమిటీలలో మూడు సార్లు పదవులు అనుభవించిన వారికి ప్రమోషన్ ఇవ్వడం లేదా పక్కన పెట్టక తప్పదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పొలిట్ బ్యూరో నుంచి తప్పిస్తారని అంటున్నారు. కావున చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డి నేతకు అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేసారు. జిల్లా సహకార బ్యాంకు చైర్మెన్ గ పనిచేశారు. లోకేష్ యువగళం పాదయాత్రలో రాయలసీమ ఇన్చార్జిగా వ్యవహరించారు. రాయలసీమలో యువగళం పాదయాత్ర విజయవంతం కావడంలో అమర్నధ రెడ్డి విశేష కృషి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికలలో జిల్లా అభ్యర్థుల గెలుపులో అయన కృషి కూడా ఉంది.అటు చంద్రబాబు బాబుకు ఇటు లోకేష్ కు సన్నిహితుడు. ఆయన తండ్రి రామకృష్ణా రెడ్డి టిడిపి ఎమ్మెల్యే, ఎంపిగా మూడుసార్లు పనిచేశారని చేసారు. ఈ సారి జిల్లానుంచి అమరనాథ్ రెడ్డి మంత్రి పదవీ ఆశించారు. ఈ నేపథ్యంలో తొలి నుంచి పార్టీలో ఉన్న ఆయనకు పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పిస్తారని కొందరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్యాయంగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలోకి రావచ్చని అంటున్నారు. జిల్లాలోని వైసిపి నేతలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా రెడ్డిపై ఆయన తొలి నుంచి పోరాటం చేస్తున్నారు. విద్యా వేత్త, జర్నలిస్టు కూడా అయిన ఆయనకు పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పిస్తే ఉపయుక్తంగా ఉంటుందని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.