11, జనవరి 2025, శనివారం

జిల్లాలో వేరుశనగ పంట నష్టం రూ. 15.42 కోట్లు

9 వేల హెక్టార్లలో పంట నష్టం 

33 నుండి 57  శాతం తగ్గిన పంట దిగుబడి 

ఈ మేరకు నివేదికను తయారుచేసిన అధికారులు 

కేంద్ర కరవు బృందానికి నివేదిక సమర్పణ 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

 ఖరీఫ్ సీజన్ లో ఏర్పడిన తీవ్ర కరవు  కారణంగా చిత్తూరు జిల్లాలోని వేరుసెనగ రైతులకు రూ. 15.42 కోట్ల రూపాయల నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన కేంద్ర కరవు బృందానికి నివేదికను అందజేశారు. జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి నష్టపరిహారం కింద నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. అలాగే రానున్న వేసవిలో తాగు నీటి సమస్యను తీర్చడానికి అవసరమైన నిధులను కూడా విడుదల చేయాలని జిల్లా అధికారులు కోరారు. కరవు బృందం చిత్తూరు జిల్లాలోని గుడిపాల, యాదమరి మండలాల్లో పర్యటించింది. జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. జిల్లా అధికారులు కరవు బృందానికి  జిల్లాలోని కరవు పరిస్థితులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కరవు బృందం వీటిని పరిశీలించి తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని హామీ ఇచ్చింది. 


ఖరీఫ్ సీజన్ లో చిత్తూరు జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్, జూలై, ఆగస్టు నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో వేరుశనగ విస్తృతంగా సాగు చేస్తారు. ఈ సంవత్సరం వ్యతిరేక వాతావరణ పరిస్థితుల కారణంగా వేరుశనగ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. చిత్తూరు జిల్లాలో 43 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా, కేవలం 15 వేల హెక్టర్లలో మాత్రమే సాగు అయింది. వేరుశనగ వేసిన తర్వాత తొలుత వర్షాలు ఓ మోస్తారుగా  పడినా, వేరుశనగ కాయలు తయారయ్య దశలో నెల రోజుల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వేరుశనగ పంట భారీగా దిగుబడి తగ్గింది. తర్వాత కొంత వర్షం పడినా, వేరుసెనగ పంట దిగుబడి దశలో మళ్లీ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తోలి వేరుశనగ పంటను దిగుబడి చేసుకున్నారు. మరి కొంతమంది రైతులు పంటను అలాగే చేల మీద వదిలిశారు. జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితిని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జిల్లాలోని 16 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరవు  మండలాలుగా ప్రకటించింది. పెనుమూరు, యాదమరి, గుడిపాల మండలాలను తీవ్ర కరవు మండలాలుగా ప్రకటించింది. చిత్తూరు, ఎస్ఆర్ పురం, పూతలపట్టు, సోమల, పుంగనూరు, రొంపిచర్ల, పలమనేరు, బైరెడ్డిపల్లి, వి కోట, కుప్పం, గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాలను మద్యస్థ కరవు మండలాలుగా ప్రకటించింది. దీంతో జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాల్లో జరిగిన పంట నష్టం మీద అంచనాలను తయారు చేశారు. జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ అధికారులు పంట కోతల ద్వారా ఎంత దిగుబడి వచ్చింది నిర్ధారించారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంట దిగుబడి ప్రయోగాలను నిర్వహించారు. వేరుశనగ పంట 33 శాతం నుంచి 71 శాతం వరకు దెబ్బతిన్నదని నివేదికలు పేర్కొంటున్నాయి. వేరుశనగ పంట ఒక హెక్టారుకు 1000 కేజీల దిగుబడి రావాల్సి ఉండగా, జిల్లాలోని  కరువు పరిస్థితుల దృష్ట్యా 33 నుంచి 57 శాతం వరకు తగ్గింది. పంట నష్టాన్ని అంచనా వేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ, మండల స్థాయి టీంలను ఏర్పాటు చేసి, పంట నష్టాన్ని సేకరించారు, జిల్లా మొత్తం మీద 24,342 మంది రైతులు నష్టపోయారని, 9 వేల హెక్టార్లలో వేరుశనగ దెబ్బతిందని అంచనా వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎకరాకు 17వేల రూపాయల చొప్పున జిల్లాలో దెబ్బతిన్న తొమ్మిది వేల హెక్టార్ల రైతులకు 15.42  కోట్ల రూపాయలను నష్టపరిహారంగా అందజేయాలని నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర కరువు బృందం సానుకూలంగా స్పందించింది. జిల్లాలో జరిగిన నష్టం వివరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన నష్టపరిహారం కోసం జిల్లాలోని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

పో రై గంగ 1 జిల్లాలో దెబ్బతిన్న వేరుశనగ పంట 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *