2, జనవరి 2025, గురువారం

ప్రత్యామ్నాయ ఉద్యానవన పంటల సాగుకు ప్రణాళిక


జిల్లాను నాలుగు జోన్లుగా విభజించి పంటల ప్రతిపాదన 

ఎకరాకు 50 నుంచి 72 వేల రూపాయల సబ్సిడీ 

రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఉద్యానవన శాఖ 

ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపుతున్న జిల్లా రైతులు


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున మామిడి తోటలు విస్తీర్ణం పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రభుత్వం దృష్టిని సారించింది. జిల్లాలో సాగుకు అనువైన ప్రత్యామ్నాయ ఉద్యానవన పంటలను గుర్తించి, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా అధికారులు చిత్తూరు జిల్లాకు అనువైన ప్రత్యామ్నాయ ఉద్యానవన పంటల ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్, సీతాఫలం, కోకో, దానిమ్మ, జామ, పనస, చింత, నేరేడు, ఉసిరి తదితర పంటలను పండించడానికి ఉన్న పరిస్థితులను అధ్యయనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఒకే వాతావరణ పరిస్థితులు, భూసారం లేకపోవడంతో జిల్లాను నాలుగు క్లస్టర్లుగా విభజించి, ప్రత్యామ్నాయ పంటలను ప్రతిపాదించారు. ఇందుకు ఒక్కొక్క హెక్టార్ కు 72 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీగా అందజేయనుంది. 

చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 1.59 లక్షల ఎకరాల్లో మామిడి తోపులు ఉన్నాయి. మామిడి తోపులు విస్తారంగా ఉండటంతో, మార్కెటింగ్ కష్టమవుతుంది. రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. చీడపీడలు కూడా చాలా ఎక్కువగా ఆశిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచుగా మామిడిపంట దెబ్బతింటుంది. ఒక ఎకరా మామిడి తోపు నిర్వహణకు ఏడాదికి 50 వేల రూపాయలను వ్యయం చేయాల్సి వస్తుంది. పైగా అంతర పంటలు వేసే అవకాశాలు కూడా లేవు. పూత దశలో రెండు, మూడుసార్లు పురుగుమందులు పిచికారి చేయాల్సి వస్తుంది. అలాగే మామిడికాయ మీద కూడా తెగుళ్లు ఆశించడంతో మరో రెండు మూడు జపాలు పురుగుమందులను చల్లాల్చి వస్తుంది. దీంతో రైతులకు పెట్టుబడి వ్యయం భారీగా పెరుగుతొంది. ఇంత పెట్టుబడి పెట్టిన, మామిడి ధరకు కనీస మద్దతు ధర లేదు. జిల్లాలోని మామిడి ఫ్యాక్టరీలు ఎంత ధర నిర్ణయిస్తే, అంతకు విక్రయించాల్సి వస్తుంది. మామిడి పంటను నిల్వ చేసే సౌకర్యం కూడా లేదు. దీంతో రైతులకు కూడా మామిడి పంట మీద ఆసక్తి తగ్గింది. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిని సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యానవన శాఖ నగిరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, ఎస్ఆర్ పురం, గంగాధర నెల్లూరు మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉందని నిర్ధారణకు వచ్చింది. ఈ మండలాల్లో 300 హెక్టర్లలో తొలుత ప్రయోగాత్మకంగా ఆయిల్ ఫారం సాగు చేయాలని భావించారు. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. ఇందుకోసం మూడు కంపెనీలను ప్రభుత్వం కేటాయించింది. ఈ కంపెనీలు రైతులుకు అవసరమైన ఆయిల్ ఫారం మొక్కల నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తాయి. రైతులకు మొదటి సంవత్సరం 38,500 రూపాయలు 2, 3, 4 సంవత్సరాలలో 10,500 వంతున సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంది. పంట మూడు సంవత్సరాల నుంచి వస్తుంది. ఐదవ సంవత్సరం నుంచి మంచి దిగుబడి ఉంటుంది. చీడపీడలు  చాలా తక్కువ. ఆయిల్ ఫామ్ కనీసం మద్దతు ధరలు టన్నుకు 20,400 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిగుబడిని ప్రభుత్వం నిర్దేశించిన కంపెనీలు కొనుగోలు చేసి, ఆయిల్ తీయడానికి అవసరమైన ఫ్యాక్టరీలను నెల కోల్పోతాయి. ఆయిల్ ఫామ్  మధ్యలో అంతర పంటగా కోకో పండించే అవకాశం కూడా ఉంది. రొంపిచర్ల, పులిచెర్ల, పెనుమూరు, వెదురుకుప్పం, పూతలపట్టు మండలాల్లో చీని, దానిమ్మ, జామ, సీతాఫలం, పనస, చింత, నేరేడు, ఉసిరి పంటలను ప్రతిపాదిస్తున్నారు. సోమల, చౌడేపల్లి, పుంగనూరు, పెద్దపెంజాని, గంగవరం మండలాల్లో చింత, నేరేడు పంటలను ప్రతిపాదించారు. బంగారుపాళ్యం, గుడిపాల, యాదమరి, ఐరాల మండలాల్లో కొబ్బరి తోటల పెబ్బకానికి అనుకూలంగా ఉందని భావించారు. పలమనేరు నుంచి కుప్పం వరకు కూరగాయల పెంపకం, పూల మొక్కల పెంపకం, దానిమ్మ, పనస తదితర పంటలు వేయడానికి అనుకూలంగా ఉందని నిర్ణయించారు. ఈ పంటలకు ఎకరాకు 50 వేల రూపాయలు వంతెన సబ్సిడీగా, ప్రభుత్వం మూడు సంవత్సరాల పాటు అందజేస్తుంది. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యామ్నాయ పంటలను ప్రారంభించనున్నారు. ఇందుకు జిల్లా ఉద్యానవన శాఖ జిల్లాలో విరివిగా రైతుల సమావేశాలను నిర్వహిస్తోంది. రైతులకు ప్రత్యామ్నాయ పంటల అవసరాన్ని, లాభాలను వివరిస్తున్నారు. దీంతో రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మోగ్గుచూపుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *