జిల్లా బిజెపిలో భగ్గుమన్న విభేదాలు
రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీ నాయకులు
జగదీశ్వర్ నాయుడు వ్యతిరేకంగా విజయవాడ వెళ్లిన ప్రతినిధి బృందం
శనివారం జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట సీనియర్ నాయకుల ధర్నా
జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాలు పోటాపోటి
హుటాహుటిన చిత్తూరుకు వచ్చిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇరు వర్గాలను సమన్వయం చేయడానికి సమన్వయకర్త ను నియమిస్తామని హామీ
హామీ
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు ప్రస్తుతం ఉన్న జిల్లా నాయకత్వం పట్ల తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాల తీవ్ర స్థాయిలో పోటీ పడడంతో సోమవారం రాత్రి హుటాహుటిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర సూర్యనారాయణ చిత్తూరు చేరుకుని ఇరు వర్గాలతో చర్చించారు. అందర్నీ కలుపుకొని పోవడానికి జిల్లాస్థాయిలో ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మూడు నెలల కిందట 53 మందితో కూడిన ఒక ప్రతినిధి బృందం విజయవాడ వెళ్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో జిల్లా నాయకత్వం మీద ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని తిరిగి కొనసాగించకూడదని డిమాండ్ చేస్తూ బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పార్టీ సంస్థాగత ఎన్నికలలో అసమ్మతివాదులు తమ అభ్యర్థిగా గుత్తా ప్రభాకర్ నాయడును తెర మీదికి తీసుకుని వచ్చారు. అయితే అధిష్టానం గతంలో ఉన్న నాయకత్వానికే జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించింది. ఆ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు నాయకులు భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తం తొందర్లోనే సమావేశం కానున్నారు.
రెండు సంవత్సరాల కిందట జరిగిన బిజెపి సంస్థ గత ఎన్నికలలో జిల్లా పార్టీ అధ్యక్షుడుగా జగదీశ్వర్ నాయుడు ఎన్నికయ్యారు. అప్పట్లో పలువురు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా బిజెపిలో చేరిన జిల్లాకు చెందిన కొందరు నాయకులతో పాటు అధిష్టానం కూడా జగదీశ్వర్ నాయుడు పట్ల మొగ్గు చూపారు. దీంతో ఆయన జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జగదీశ్వర్ నాయుడు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలోని సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారని ఆరోపణలో ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా గతంలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా, వివిధ మోర్చాల అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారికి పలువురికి జిల్లా స్థాయిలో గాని రాష్ట్రస్థాయిలో గాని పార్టీ పదవులు లభించలేదు. పార్టీకి సంబంధించిన నిర్ణయాలు కూడా ఏకపక్షంగా తీసుకుంటున్నారని, సీనియర్ నాయకులను సంప్రదించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికలలో పార్టీ, అభ్యర్థులు అందజేసిన నిధులు మండలాలకు సక్రంగా అందలేదని పలువురు ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా పార్టీ నిధులకు కూడా లెక్కలు చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను సోమవారం జిల్లా పార్టీ ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన తిరుపతికి చెందిన ముని సుబ్రహ్మణ్యం, ప్రొద్దుటూరుకు చెందిన ఎల్లారెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జగదీశ్వర్ నాయుడు పైన ఉన్న ఆరోపణలను పాలసముద్రం మండలంకు చెందిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చంద్రశేఖర్ నాయుడు ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకుని వెళ్లారు. గత రెండు సంవత్సరాలుగా పార్టీలోని సీనియర్ నాయకులు అవమానం జరిగిందని, పార్టీ పటిష్టం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిమందికే పార్టీ పరిమితమైందని, తిరిగి పాత నాయకత్వానికి పగ్గాలు అప్పగించకుండా, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల బరిలో జగదీశ్వర్ నాయుడు, గుత్తా ప్రభాకర్ నాయుడు ఇరువురు పోటీపడ్డారు. ఇరు వర్గాలు గట్టిగా తమ వాదనలను వినిపించాయి. ఎవరు మెట్టు దిగి పట్టు వీడలేదు. జగదీశ్వర్ నాయుడు మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం ఆయనకు ప్లస్ అయినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఇరు వర్గాలు గట్టిగా పోటీ పడడంతో అధిష్టానం తరుపున బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర సూర్యనారాయణ ఉన్నపళంగా హుటాహుటిన సోమవారం రాత్రి చిత్తూరు చేరుకున్నారు. ఇరు వర్గాలతో చర్చించారు. ఒక వర్గం జగదీశ్వర్ నాయుడు నాయకత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. జిల్లాకు చెందిన ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ప్రభాకర్ నాయుడు అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర సూర్య నారాయణ ఆసక్తి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వ్యతిరేక వర్గం పట్టు విడవకపోవడంతో జిల్లాస్థాయిలో ఒక సామాన్యయ కర్తను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అసమ్మతి వాదుల ఆరోపణలను పక్కనపెట్టి పూర్వ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు జిల్లా అధ్యక్షుడిగా మంగళవారం రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రకటించింది. దీంతో ఆయన మీద వ్యతిరేకతతో ఉన్న ప్రభాకర్ నాయుడు, జయకుమార్, హరిబాబు నాయుడు, నరసింహ, శివ, రామచంద్రుడు, సుబ్బారెడ్డి, నక్క రామచంద్రయ్య, భాస్కర్ రెడ్డి, చిట్టిబాబు, వెంకటేశు, రామ్మూర్తి, కొత్తూరు బాబులు తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి తొందర్లో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు పోటీగా జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించాలని ప్రతిపాదించగా, సీనియర్ నాయకులు వారించినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, బిజెపి కార్యక్రమాలను సమాంతరంగా కొనసాగించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. బిజెపిలో వర్గ విభేదాలు చిలికి చిలికి గాలి వానలా తయారయ్యాయి. రెండు సంవత్సరాల కిందట పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన పలువురు జగదీశ్వర్ నాయుడు జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ పదవులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని జిల్లాలోని సీనియర్ నాయకులు జీర్ణించు కోలేకపోతున్నారు. తాము రంగంలోకి దిగి పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నారు.
పో రై గంగ 1 పార్టీ ఎన్నికల పరిశీలకులు
గంగ 2 పరిశీలకులకు ఫిర్యాదు చేస్తున్న సీనియర్ జిల్లా నాయకులు
గంగ 3 శనివారం జిల్లా బిజెపి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీనియర్ బిజెపి నాయకులు (ఫైల్ ఫోటో)