19, జనవరి 2025, ఆదివారం

రూ 13.57 కోట్లతో వేసవికి ప్రత్యామ్యాయ ప్రణాళిక

మండలాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి 

980 గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని అంచనా

ట్యాంకర్ల ద్వారా నీటి  సరఫరాతో పాటు బోర్ల ఫ్లషింగ్, లోతు 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.) 


రానున్న వేసవిలో చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను నివారించడానికి జిల్లా అధికారులు 13.57 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం రూపొందించిన ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికను  ఆమోదం నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేశారు. జనవరి నెల నుంచి జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని జిల్లా అధికారులు అంచనా వేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుందని, బోర్లను అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఉన్న బోర్లను ఫ్లషింగ్ చేయడానికి, లోతు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేశారు.


చిత్తూరు జిల్లాలో గత సంవత్సరంలో వరుణుడు ముఖం చాటేశారు. పడాల్సిన విధంగా జిల్లాలో వర్షాలు పడలేదు. జూలై, సెప్టెంబర్, నవంబర్ నెలలో తక్కువ వర్షపాతం నమోదయ్యింది. రుతుపవనాలు కాలంలో అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడగా, చిత్తూరు జిల్లాలో మాత్రం వర్షాలు పడలేదు. దీంతో జిల్లాలో  ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు దెబ్బతిన్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లాలోని 700 చెరువులకు చుక్కనీరు కూడా రాలేదు. మరో మూడు వేల చెరువులకు 25 శాతం నీళ్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా చిత్తూరు జిల్లాలోని 16 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  గత ఏడాది వర్షాలు తక్కువ పడటంతో ఈ ఏడాది ప్రారంభం నుండి తాగునీటి సమస్య ఏర్పడుతుందని గ్రామీణ నీటి సరఫరా అధికారులు అంచనా వేశారు. తాగునీటి నివారించడానికి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించారు. జనవరి నెలలో 16 మండలాల్లో, ఫిబ్రవరి నెలలో 23 మండలాల్లో, మార్చి నెలలో 27 మండలాల్లో, ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 31 మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తుతుందని అధికారులు అంచనా వేశారు, జనవరి నెలలో 444 గ్రామాలలో, ఫిబ్రవరి నెలలో 492 గ్రామాలలో, మార్చి నెలలో 628 గ్రామాలలో, ఏప్రిల్ నెలలో 801 గ్రామాల్లో, మే నెలలో 857 గ్రామాలలో, జూన్ నెలలో 980 గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని ప్రత్యామ్నాయ ప్రణాళికలో పొందుపరిచారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి జనవరి నెలకు 193 లక్షల రూపాయలు, ఫిబ్రవరి నెలకు 136 లక్షలు, మార్చి నెలలకు 192 లక్షలు, ఏప్రిల్ నెలకు 236 లక్షలు మే నెలకు 272 లక్షలు, జూన్ నెలకు 328 లక్షల రూపాయలు అవసరమవుతుందని అంచనాలు తయారు చేశారు. జిల్లాలో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి 845 గ్రామాలకు రోజుకు 6,280 ట్రిప్పుల వంతున  ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రతిపాదించారు. ఇందుకు 10.82 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పశువులకు 126 గ్రామాలకు 521 ట్రిప్పులను నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని, ఇందుకు 90 లక్షల రూపాయలు అవసరమని తెలిపారు. జిల్లాలో 102 గ్రామాలకు సంబంధించి 500 బోర్లను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుందని, ఎందుకు 53 లక్షల రూపాయలు అవసరమని పేర్కొన్నారు అలాగే జిల్లాలోని 46 బోర్లను ఫ్లషింగ్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు 25 లక్షల రూపాయలు అవసరమవుతాయన్నారు. జిల్లాలోని 82 బోర్లను లోతు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 107 లక్షల రూపాయలు అవసరమవుతాయని తమ నివేదికలో పొందుపరిచారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేయడానికి ఒక ట్రిప్పుకు 570 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నివేదికలో తెలిపారు. తాగునీటి నిమిత్తం బోర్లను స్వాధీనం చేసుకొనే ఒక్కొక్క బోరుకు రోజుకు 350 రూపాయలు చెల్లించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేస్తే జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా గట్టెక్కించగలమని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏ మేరకు నిధులను విడుదల చేస్తుందో వేచి చూడాలి.

పో రై గంగ 1 తాగునీటి సమస్య ఫైల్ ఫోటో 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *