జిల్లాలో విఫలమైన మామిడి బీమా పధకం
ఆశక్తి చూపని మామిడి రైతులు
రైతుల అంచనాకు దూరంగా విధివిధానాలు
బీమా ప్రీమియం కూడా చాలా ఎక్కువ
98 శాతం రైతులు మామిడి బీమాకు దూరం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మామిడి బీమా పథకం పూర్తిగా విఫలమయ్యింది. మామిడి పంటకు బీమా చేయడానికి రైతులు ముందుకు రాలేదు. రైతులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందించడంలో విఫలమయ్యింది. ప్రభుత్వం రూపొందించిన మామిడి బీమా పథకంలో మామిడి దిగుబడి తగ్గినా, మామిడి ధర తగ్గిన ఏటువంటి నష్టపరిహారం లేదు. మామిడి పంటను ఆశించే చీడపీడలు, ఇతర రోగాలకు సంబంధించి ఎలాంటి బీమా సౌకర్యం లేదు. వాతావరణంలో ఏదైనా పెను మార్పులు జరిగితే మాత్రమే బీమా సౌకర్యం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇతర పంటలతో పోల్చుకుంటే మామిడి పంటకు బీమా ప్రీమియం కూడా చాలా ఎక్కువ. దీంతో మామిడి బీమాలో భాగస్వామ్యం కావడానికి జిల్లాలోని రైతాంగం ముందుకు రాలేదు. ఏదో ముక్కుబడిగా కొంతమంది రైతులు మాత్రమే మామిడి పంటల బీమా ప్రీమియం చెల్లించారు.
మామిడి తోటలను కూడా ఈ ఏడాది నుంచి పంటల బీమా పరిధిలోకి తీసుకొని రావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు అసెంబ్లీ సమావేశాలలో ఒక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం రబీ రైతులకు పంటల బీమా పథకం వర్తించకుండా అన్యాయం చేసిందని, ఈ ఏడాది నుంచి ఖరీఫ్, రబీ పంటలు అన్నింటికీ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో సుమారుగా లక్షా, 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. సగటున జిల్లాలో సంవత్సరానికి 5 లక్షల టన్నుల మామిడి దిగిబడి రావల్చి ఉండగా, వ్యతిరేక వాతావరణం కారణంగా గత సంవత్సరం 10 శాతం పంట కూడా చేతికి రాలేదు. జిల్లాలో మామిడి పూత చాలా తగ్గువ వచ్చింది. వచ్చిన పూత కూడా నిలువలేదు. వచ్చిన పూత కూడా మూడు, నాలుగు దఫాలుగా వచ్చింది. వాతావరణం అనుకూలించక మామిడి పూతంతా మాడిపోయింది. మరోవైపు పిందే అడుగు భాగాన మచ్చలతో పంట కూడా దెబ్బతింది. కాయ తోటిమ దగ్గర నుండి పాలు కారుతూ, కాయ రంగు మారి కింద పడి రైతులు నష్టపోయారు. మరో వైపు మామిడి తోటలను మంగు ముంచి ఎత్తింది. మంగు కారణంగా మామిడి ఆకులు నల్లగా మారి, దాని ప్రభావం కాయ మీద పడి, మామిడి పిందెలు కూడా నలుపు రంగులోకి మారాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో సుమారుగా 90 శాతం మామిడి పంట దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. తూర్పు మండలాల్లో ఎక్కువగా విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పండిన పంటంతా పుత్తూరు, దామలచెరువు, బంగారుపాళ్యం, పుత్తూరు, తిరుపతి కేంద్రంగా కలకత్తా, ఢిల్లీ వంటి కేంద్రాలకు ఎగుమతి అవుతోంది. మంచు, అకాలంగా వీచిన గాలుల వల్ల మామిడి పూత రాలిపోవడంతో పాటు పిందెలకు మచ్చలు ఏర్పడడంతో పూర్తిగా పంట దెబ్బతిన్న పరిస్థితి. ఇలా జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో మామిడి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు దుక్కులు దున్నడం, పదులు చేయడం, పురుగు మందుల పిచికారీ తదితరాలకు ఎకరాకు రూ.40 వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే పెట్టుబడులు కూడా తిరిగి రాలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు నష్టపోయారని రైతు సంఘాలు ఆందోళ చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మామిడి బీమా పథకాన్ని తీసుకుని వచ్చింది. డిసెంబర్ 7వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి 15వ తేదీ లోపు రైతుల బీమా ప్రీమియం చెల్లించాలని కోరింది. తదుపరి ప్రీమియం చెల్లింపు గడువు తేదీని 31వ తేదీ వరకు పెంచింది. జిల్లాలో 60 వేల మంది మామిడి రైతుల ఉండగా కేవలం 1092 మంది రైతులు మాత్రమే బీమా ప్రీమియం చెల్లించారు. అంటే 2 శాతం రైతులు కూడా బీమా చెల్లించలేదు. 98 శాతం రైతులు పట్టించుకోలేదు. జిల్లాలో 1.50 లక్షల ఎకరాలలో మామిడి తోటలు ఉండగా కేవలం 546 ఎకరాలకు మాత్రమే బీమా చేశారు. వేయి ఎకరాలు కూడా దాటలేదు. అంటే ఒక్కొక్క రైతు ప్రయోగాత్మకంగా అర ఎకరాకు మాత్రమే బీమా ప్రీమియం చెల్లించారు. ఈ సంవత్సరం బీమా పథకం తీరుతెన్నులను పరిశీలించి, లాభసాటిగా ఉంటే, వచ్చే సంవత్సరం నుంచి భీమా ప్రీమియం చెల్లించాలని రైతులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇతర పంటలతో పోల్చుకుంటే మామిడికి భీమను ప్రేమించడం కూడా చాలా ఎక్కువ. వరికి ఎకరాకు బీమా ప్రయాణం 82 రూపాయలు, వేరుశనగ పంటకు ఎకరాకు 60 రూపాయలు. అయితే మామిడి పంటకు మాత్రం ఎకరాకు 1750 రూపాయలు చెల్లించాలి. ప్రభుత్వ రూపొందించిన విధివిధానాలు రైతులకు నచ్చకపోవడం, బీమా ప్రీమియం ఎక్కువ కావడంతో రైతులు మామిడికి భీమా చెల్లించడానికి ముందుకు రాలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మామిడి పంటల బీమాలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. బీమా ప్రీమియంను తగ్గించడంతోపాటు పంట దిగుబడిని, మామిడి ధరను, చీడపీడలు ఇతర రోగాల వల్ల నష్టానికి బీమా వర్తించే విధంగా సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పో రై. గంగ 1 మామిడి