28, జనవరి 2025, మంగళవారం

మామిడి చెట్లలో కనిపించని పూత

అందోళన చెందుతున్న మామిడి రైతులు

చలి కారణంగా పూత రాలేదంటున్న అధికారులు 

నెలన్నర ఆలస్యంగా పూత వచ్చే అవకాశం 

గణనీయంగా తగ్గనున్నమామిడి దిగుబడి 

ఈ సారీ మామిడి రైతులకు నష్టాలే !  

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

జిల్లాలోని రైతాంగం మీద ప్రకృతి పగ పట్టినట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి పంట 90 శాతం తగ్గింది. ఖరీఫ్ సీజనులో  తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో వేరుశనగ పంటతోపాటు ఇతర ఉద్యానవన పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మళ్లీ వాతావరణ మార్పుల కారణంగా జిల్లాలో మామిడి చెట్లకు పూత కనిపించడం లేదు. మామిడి పూత డిసెంబర్ నెలలో  ప్రారంభమవుతుంది. జనవరికి పూర్తిస్థాయిలో పూత వచ్చి మామిడి చెట్లు కళకళలాడుతూ ఉంటాయి. జనవరి నెల పూర్తి అవుతున్న ఇప్పటివరకు జిల్లాలో మామిడి తోటలలో పూత కనిపించడం లేదు. అక్కడక్కడ కొంత పూత కనిపించినా, పిందెలు రాకుండా మగ్గిపోతున్నాయి. దీనికి తోడు చీడపీడలు కూడా మామిడి చెట్లను అవరిస్తున్నాయి. దీంతో జిల్లాలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం ఎలాగో పంట దెబ్బతింది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని రైతులలో  ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో మామిడి పూత నెలన్నర ఆలస్యంగా వస్తుండడంతో రైతులు దిగులు పడుతున్నారు.


అధిక వర్షా లు, తీవ్రమైన చలి పరిస్థితులు మామిడిపై ప్రభావం చూపుతున్నాయి. మామిడి పంటకు వేడి వాతావరణం అవసరం. ఈ సీజన్ లో  నవంబర్ నెల ఆఖరి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ నెలలో కూడా వర్షాలు పడ్డాయి. దీంతో జిల్లాలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. జిల్లాను చలి గడగడలాడిస్తోంది. ఉదయం 9 గంటలైన మంచు కురస్తూనే ఉంటుంది. మళ్లీ సాయంకాలం నాలుగు గంటలకే మంచు ప్రారంభమవుతోంది. జిల్లాలో మారిన వాతావరణ  పరిస్థితుల దృష్ట్యా సుమారు 30 నుంచి 45 రోజుల పాటు ఆలస్యంగా మామిడి పూత వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం జిల్లాలో పూత రాకపోవడం మామిడి చెట్లు బోసిగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు అక్కడక్కడ మామిడి పంటపై తేనే మంచు పురుగు దాడి చేస్తోంది. పూతను రాల్చే రకం పురుగు సోకడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. రాష్ట్రంలో మామిడిని అధికంగా సాగు చేసే జిల్లాలలో  చిత్తూరు అగ్ర స్థానంలో ఉంటుంది. చిత్తూరు జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈసారి పంట దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దిగుబడి విపరీతంగా పడిపోతూ వస్తుండటం, మార్కెటింగ్‌ సమస్యల వంటి కారణాలతో మామిడి తోటల వల్ల లాభం లేదని రైతాంగం భావిస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు మామిడి తోటలను తొలగించి, అదే స్థలంలో  ఇతర పంటలను సాగు చేస్తున్నారు. వచ్చిన మామిడి దిగుబడిని మార్కెట్‌లో విక్రయిద్దామనుకుంటే అక్కడా గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పెట్టుబడులు సైతం రాక అన్నదాత నష్టాల పాలు కావాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో జిల్లాలో మామిడి ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన ఉద్యాన పంట అయిన మామిడి వాతావరణ పరిస్థితు లు సహకరించడం లేదు. ప్రతీయేటా డిసెంబరు మూడో వారం, జనవరి తొలి, మలి వారం నాటికి పూర్తి స్థాయిలో పూత వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో పిందెలు ఏర్పడి తదుపరి కాయలు వస్తాయి. ప్రస్తుత సీజన్‌లో అధిక వర్షాలు పడడం, రాత్రి వేళలో చలితీవ్రత పెరగడం, తెగుళ్ల ప్రభావం వల్ల ప్రస్తుతం పూత ఆశించిన మేరకు రాలేదు. శాస్త్రవేత్తల సలహాలతో కొంత మేర ప్రయోజనం ఉన్నా, రైతులంతా వాటిని పాటించకపో వడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా మామిడికి అక్కడక్కడ సోకిన తేనే మంచు, బూడిద రంగు తెగులు, తామర తెగులు కారణాల వల్ల మామిడి రైతులు దిగులు చెందుతున్నారు. మామిడి తోటలపై ప్రకృతి ప్రభావం ఎంతగానో ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి వల్ల పూత, కాపుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక్కో చెట్టుకు ఆడ, మగ పూత ఉంటుంది. సుమారు పదివేల మగపూత ఉంటే, ఒక ఆడపూత కాయగా మారుతూ ఉంటుంది. అయితే ప్రస్తుత సీజన్‌లో కురిసిన అధిక వర్షాలు, రాత్రి చలిగా, పగలు తగ్గిన  ఉష్ణోగ్రతల కారణం గా దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. రాత్రి పూట చలి ఎక్కువగా ఉండడం వల్ల తెగుళ్లు ఆశిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించక మామిడి కాయల దిగుబడి తగ్గుతుందన్న ఆందోళనలో రైతాంగం ఉంది. జిల్లాలో యేటా  కోట్ల మామిడి వ్యాపారం జరు గుతుంటుంది. ఇక్కడ నుంచి మామిడి కాయలను ముంబాయి, బెంగుళూరు, చైన్నయి, డిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. అనేక వ్యయప్రయాలసకోర్చి మామిడిని మార్కెట్‌ను తీసుకవెళ్లితే గిట్టు బాటు ధర లభించని పరిస్థితిని రైతాంగం ఎదుర్కొంది. మామిడికి మద్దతు ధరను ప్రకటించమని రైతులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం మామిడి రైతులకు నష్టాలు తప్పడం లేదు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *