27, జనవరి 2025, సోమవారం

పరుగులు తీస్తున్న కుప్పం ప్రగతి

రూ. 340.34 కోట్ల నిధుల విడుదల

కడ పునరుద్దరణ 

విజన్  డాక్యుమెంట్ ఆవిష్కరణ 

ఎయిర్ పోర్ట్ నిర్మాణం 

బంగారు నిల్వల మీద అధ్యయనం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)


రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగో పర్యాయం నారా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం కుప్పం నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు 340.34 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను పగడ్బందీగా రూపొందించి అమలు చేస్తున్నారు. కుప్పం అభివృద్ధి నిమిత్తం కుప్పం డెవలప్మెంట్ అథారిటీని తిరిగి పునరుద్ధరించారు. కడ స్పెషల్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారిని నియమించారు.  


కుప్పం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు నాయుడు 1995లోనే కుప్పం డెవలప్మెంట్ అథారిటీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో డిఆర్డిఏ పిడి, సబ్ కలెక్టర్ స్థాయి అధికారులను  ప్రాజెక్టు అధికారులుగా నియమించేవారు. 2004 వరకు సాగిన కడను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ కడను పునరుద్దరించారు. కడ కోసం నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా ఇదివరకు విధులు నిర్వహించిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి  వికాస్ మర్మత్ ను ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. కడ పరిధిలోకి  కుప్పం మున్సిపాలిటితో పాటు కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాలు కూడా వస్తాయి. ఈ మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కడ ఉపయోగపడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వారధిగా నిలుస్తుంది. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా,  విద్యుత్తు, గ్రామీనాభివృద్ధి, డ్వాక్రా, అటవీ, విద్య, వైద్య, వ్యవసాయం,  హౌసింగ్ ,నిత్యవసరాలు శాఖలతోపాటు అన్ని సంక్షేమ విభాగాల్లో కార్యక్రమాల అమలు అధికారుల విధులు, బాధ్యతపై పర్యవేక్షణ సమీక్ష అధికారాన్ని కడ పిడికి అప్పగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభీష్టం మేరకు కుప్పం డెవలప్మెంట్ అథారిటి ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గం శర వేగంగా  అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది.  కడ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. 100 కోట్ల నిధులతో అభివృద్ధి చేపట్టారు. చంద్రబాబు ఆయాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శాంతిపురం పరిధిలోని కొలమడుగు గ్రామపంచాయతీ రామాపురం వద్ద ఎయిర్ పోర్ట్   నిర్మాణానికి భూములను జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ సేకరించారు. ముఖ్యమంత్రి ఇందుకు శంఖుస్థాపన కూడా చేశారు. మూడు సంవత్సరాలలో దీనిని పూర్తి చేయనున్నారు.  కుప్పంలోని చిగురు గుంట వద్ద బంగారు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. బంగారం వెలికి తీతకు అడుగులు పడుతున్నాయి. దీనిపై అధికారులు ఒక నివేదికన సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కుప్పం ప్రజలకు  ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇలా కుప్పం అభివృద్ధి ముఖ్యంగా చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇటేవల  నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుప్పం విజన్  డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఈ ప్రణాళికలో 17 శాఖల డివిజన్ స్థాయి అధికారులను అనుసందానించి, ఐదేళ్లలో చేపట్టే అభివృద్ధిపై విజన్ ను 380 పేజీలతో  రూపొందించారు. 26 శాఖలతో 16 సెక్టార్లుగా ఈ ప్రణాళికను అమలు చేయనున్నారు. పేదలందరికీ ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీరు, వంటగ్యాసు, విద్యుత్ సరఫరాపై  ఇంటింటి సర్వే చేపట్టి లోటుపాట్లను ఇప్పటికే నమోదు చేశారు. దశలవారీగా భూగర్భ మురుగునీటి  వ్యవస్థను కుప్పంలో అమలు చేయనున్నారు. కుప్పం ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు, ఆదాయం పెంపుకు, పరిశ్రమల స్థాపన, ఉపాధి మౌలిక వసతులు కల్పనకు  విజన్  డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. మహిళలపై ఉపాధిగా ప్రోత్సహిస్తూ వారి ఆలోచనకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంచాయతీలో విలేజ్ మార్టుల ఏర్పాటుకు పరిశ్రమల సహకారం తీసుకోమన్నారు. విమానాశ్రయము, పరిశ్రమల స్థాపనకు స్థల సేకరణ పూర్తయింది. కుప్పం నియోజకవర్గంలో ప్రజా నాయకుడి పేరుతో ముఖ్యమంత్రి స్వయంగా ఫిర్యాదుల స్వీకరించే విధంగా ఒక వ్యవస్థను  తీసుకుని వచ్చారు. ఇందులో చేసిన ఫిర్యాదులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి పరిష్కారం చూపిస్తారు. నీటి సమస్యను తీర్చేందుకు జలాశయ నినిర్మాణం చేయనున్నారు.

*రూ. 340.34 కోట్ల నిధుల విడుదల* 

కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు 340.34 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కుప్పం నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధి కోసం 46 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. కుప్పం మునిసిపాలిటీ అభివృద్ధి కోసం 92.2 0 కోట్ల రూపాయలను, కుప్పం సాగునీటి కోసం ఉద్దేశించిన అందరినీ వాసుల స్రవంతి ప్రాజెక్టు బ్రాంచ్ కెనాల్ సిమెంటుకు కంక్రిట్ కు  196. 91 కోట్ల  రూపాయలను,  మున్సిపాలిటీ అభివృద్ధికి మరో 5.20 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ నిధులను సమన్వయం చేసుకొని కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నారు. అలాగే ఇంటింటికి సౌర విద్యుత్ పలకలను అమర్చే  కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో చురుగ్గా సాగుతోంది.  చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడంతో ప్రస్తుతం కుప్పం ప్రగతి పరుగులు తీస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *