వారం రోజులలోపు నామినేటెడ్ పోస్టుల జాబితా
కూటమి నేతలకు శుభవార్త
60 వరకు కార్పొరేషన్ చైర్మెన్ లను ప్రకటించే అవకాశం
ఫిబ్రవరిలో మార్కెట్ కమిటీ చైర్మెన్లు, డైరెక్టర్లు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
కూటమి నేతలకు శుభవార్త. వారంలోపు నామినేని పోస్టులు భర్తీకి సంబంధించిన మరో జాబితా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల రోజులకు ముందే జాబితాను విడుదల చేయాలని భావించారు. ఇందుకు సంబంధించి కసరత్తును కూడా పూర్తి చేసి, బిజెపి, జనసేన అధినాయకుల ఆమోదం కూడా పొందారు. అయితే అనుకోని అవాంతరాలు కారణంగా నామినేటెడ్ పదవుల జాబితా విడుదల ఆలస్యం అవుతుంది. జాబితా విడుదలవుతుంది అనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి సోదరుడు నారా రాముర్తి నాయుడు అకాల మరణం పాలయ్యారు. తర్వాత సంక్రాంతికి జాబితా విడుదలవుతుందని అందరూ అంచనా వేశారు. ఈ నెల 15 తో టిడిపి సభ్యత్వం కూడా పూర్తి అయ్యింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కూడా ఒక ప్రకటన చేశారు. అయితే ఉహించని విధంగా తిరుపతిలో తొక్కిసలాట కారణంగా ఆరుగురు భక్తులు మృతి చెందడంతో జాబితా విడుదల వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్నారు. రెండు, మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల జాబితా విలువరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి వర్గాలు వెల్లడించాయి
రానున్న జాబితాలో రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టులకు సంబంధించి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాష్ట్ర అధికార ప్రతినిధులకు ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే గతంలో ప్రకటించిన కార్పొరేషన్ లకు డైరెక్టర్ల జాబితా కూడా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు, డైరెక్టర్లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు సంబంధించిన పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేసి, అనంతరం ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ రాష్ట్ర, జిల్లాస్థాయి గ్రంథాలయ సంస్థల పాలకవర్గాలను రద్దుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నామినేటెడ్ పోస్టులు భర్తీ జరగలేదు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ అన్న ప్రకటించిన పూర్తి స్థాయిలో డైరెక్టర్లను ప్రకటించలేదు. నామినేటెడ్ పోస్టుల జాబితా ఎప్పుడు విడుదల అవుతుందా అని కూటమి నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ జాబితాలో దాదాపు 60 రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మన్, డైరక్టర్ల పదవుల జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. ఇప్పటికే రెండు విడతలుగా 80 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించిన విషయం తెలిసిందే. అందులో కొన్నింటికి డైరెక్టర్ లను కూడ నియమించారు. అలాగే మార్చిలో ఖాలీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు పట్ల ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో టిడిపికి అధిక స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. జనసేన, బిజెపి పార్టీలకు సముచిత స్థానాలు దక్కుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నేతలు కొందరికి రాష్ట్రంలో కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు సి కి బాబు, ఎ ఎస్ మనోహర్ లలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అంటున్నారు. పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో కీలకమైన కార్పోరేషన్ పదవి ఇస్తారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, చిత్తూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ కూడా రాష్ట్ర పదవుల రేసులో ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి చిత్తూరు మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, ఏఎస్ మనోహర్ తమ వంతు కృషి చేశారు. వారు క్రియాశీలకంగా వ్యవహరించడంతో పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పోటీలో ఉన్న అభ్యర్థులను అందరిని ఒక తాటి మీదికి తీసుకుని వచ్చి అభ్యర్థుల ప్రకటనకు ముందే చిత్తూరు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా కష్టకాలంలో కాజూరు బాలాజీ చిత్తూరు పట్టణ ప్రజలకు అండగా నిలిచారు. ఆనందయ్య కరోనా మందులు వార్డు వార్డుకు సరఫరా చేశారు. చిత్తూరు పట్టణం మొత్తం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధులైన డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్ లు పదవులు ఖాయమైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక జనసేన, బిజెపి నాయకులలో ఒకరిద్దరి రాష్ట్ర పదవులు దక్క వచ్చని సమాచారం. కొత్తగా భర్తీ కానున్న పదవులలో అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, ప్రణాళికా సంఘం, నెడ్ క్యాప్ చైర్మన్ వంటి వాటికి తీవ్ర స్థాయిలో పోటీ ఉందని చెబుతున్నారు. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్కాబ్, బ్యూటిఫికేషన్ గ్రీనరీ అండ్ కార్పొరేషన్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వాటితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా కీలకంగా ఉందని తెలిసింది. వీటికి తోడుగా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. దీంతో ఈసారి వీలైనంతవరకూ పదవులు అన్నీ భర్తీ చేసి పార్టీ కోసం కష్టపడిన వారిని ప్రోత్సహించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడు నెలల కాలం గడచిపోయింది. దాంతో ఆశావహులను వేచి చూసేలా ఉంచడం మంచిది కాదని భావించే ఈ పదవుల పందేరానికి తెర తీస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే సంక్రాంతికి పదవుల పంపిణీ జరిగిపోతుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లాలోని కాణిపాకం ఆలయం, బోయకొండ గంగమ్మ ఆలయ పాలక మండళ్ల చైర్మన్, సభ్యులను నియమిస్తారని తెలిసింది. అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇతర పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా మార్కెటింగ్ సొసైటీ, జిల్లా ప్రింటింగ్ ప్రెస్ లకు. జిల్లాలోని సింగల్ విండోలకు త్రిసభ్య కమిటీలు వేయడానికి కసరత్తు జరుగుతుంది. చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన ప్రధాన కార్యదర్శి కోదండయదవ్, వై వి.రాజేశ్వరి, చెరుకూరు వసంత కుమార్, గుడిపాలకు చెందిన బాలాజీ నాయుడు, యాదమరికి చెందిన ఆరని బాలాజీ, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పూతలపట్టుకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుష్పరాజ్ ఇటేవల చంద్రబాబును కలసి వచ్చారు. గుడిపాలకు చెందిన పీటర్, మాజీ ఎం ఎల్ ఏ గాంధీ, పుత్తూరుకు చెందిన గ్యాస్ రవికుమార్ కూడా పదవి ఆశిస్తున్నారు. బిజెపి నుండి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, బిసి నేత అట్లూరి శ్రీనివాసులు కూడా రేసులో ఉన్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో తలబడి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డికి పదవి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. జి. డి నెల్లూరు నియోజక వర్గం నుంచి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణలకు పదవీ యోగం ఉందంటున్నారు. నగరి నియోజకవర్గంలో మాధవ నాయుడు, పోతుగుంట విజయబాబు పదవులను ఆశిస్తున్నారు. అయితే అక్కడ సిద్ధార్థ విద్యాసంస్థలు అధిపతి అశోక్ రాజుకు బిజెపి కోటాలో పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాయకులు అందరు చైర్మన్ పోస్టులపై దృష్టిని పెట్టారు. ఎం ఎల్ ఏ, ఎంపి సిఫారసు లేఖలను జత చేశారు. తనకు పదవి తప్పదని అందరు నాయకులు ధిమాతో ఉన్నారు.