5, జనవరి 2025, ఆదివారం

నేటి నుంచి దివ్యాంగుల ఆరోగ్య పింఛన్ల తనిఖీ

 జిల్లాలో 10 డాక్టర్ల బృందాల ఏర్పాటు 

తొమ్మిది రోజులపాటు కొనసాగనున్న మొదటి దశ పరిశీలన 

దివ్యాంగుల ఇంటి వద్దకే డాక్టర్ల బృందాలు

తాత్కాలికంగా దివ్యాంగుల దృవీకరణ పత్రాల నిలుపుదల 

రెండవ దశలో మరోసారి దివ్యాంగులకు ఆస్పత్రులలో పరీక్షలు


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాల కారణంగా మంచాలకు, మూడు చక్రాల కుర్చీలకు పరిమితమైన దివ్యాంగుల పింఛన్ల పరిశీలన కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానంది. ఇందుకు జిల్లా స్థాయిలో 10 డాక్టర్ల బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందాలు తొమ్మిది రోజుల్లో జిల్లాల్లో 15 వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తనిఖీ చేస్తారు. ఆ వివరాలను నమోదు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఆ యాప్ లో రోగి వివరాలను నమోదు చేస్తారు. గ్రామపంచాయతీని యూనిట్ గా తీసుకొని ఈ సర్వే కార్యక్రమం జరుగుతుంది. రోజుకు 25 నుంచి 30 మంది పెన్షనర్ల వివరాలను యాప్ లో నమోదు చేస్తారు. తొలుత 1,936 మంది పెన్షనర్ల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీ చేస్తారు. వీరి పరిశీలన పూర్తయిన తర్వాత, మిగిలిన దివ్యాంగ పింఛన్దారులకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మరోసారి అంగవైకల్యానికి సంబంధించిన వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి నెలలోపు ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది.


జిల్లాలో  పక్షవాతం కారణంగా చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం అయిన వారు 1015 మంది,  తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధితులు 921 మంది పించన్లు తీసుకుంటున్నారు. ఇవి కాకుండా  మల్టీడిఫార్మిటీ లెప్రసీ కింద 414 మంది, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్,  దృష్టి లోపం,  వినికిడి లోపం,  మెంటల్ రిటార్డేషన్,  మానసిక అనారోగ్యం,  మల్టీపుల్ డిజిబులిటీ ఉన్నవారు 35,277 మంది ఉన్నారు. వీరికి నెలకు 4 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. దివ్యాంగుల అందరి పింఛన్లను పరిశీలన చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. తొలుత ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పంచాయతీలో అన్ని రకాల పింఛన్లను రాండంగా పరిశీలన చేశారు. చిత్తూరు మండలం ముత్తుకూరు గ్రామపంచాయతీలో కూడా పింఛన్ల పరిశీలన జరిగింది. ఇందులో దివ్యాంగుల కేటగిరీలో భారీగా బాగా దించిన దారిలో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్ర మొత్తం మొదటి దశగా దివ్యాంగుల పింఛన్లను పరిశీలించి అర్హతను నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలను జిల్లా కలెక్టర్లకు డిఆర్డిఏ పీడీలకు జారీ చేసింది. ఈ పెన్షన్స్‌ వెరిఫికేషన్ ప్రక్రియను సెర్ప్‌ పర్యవేక్షిస్తుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయం చేస్తుంది. మొత్తం వెరిఫికేషన్‌ ప్రక్రియ రోల్ అవుట్, డిజిటల్ అప్లికేషన్‌పై అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. దీనివల్ల వెరిఫికేషన్/రీఅసెస్‌మెంట్ పురోగతిని పర్యవేక్షిస్తుంది. అనంతరం ప్రభుత్వానికి సెర్ప్ నివేదికను సమర్పిస్తుంది. హెల్త్ డిపార్ట్‌మెంట్ వెరిఫికేషన్ కోసం డాక్టర్లను అందిస్తుంది. అందుకు అనుగుణంగా వైద్యులకు శిక్షణ ఇస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. పెన్షన్ల వెరిఫికేషన్ కోసం జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా ఆ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. మెంబర్ కన్వీనర్‌గా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. ఆ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్‌, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌వో), జిల్లా హాస్పటిల్ సర్వీస్ కోఆర్డినేటర్, జిల్లా లెప్రసీ ఆఫీసర్‌, జిల్లా పంచాయత్ ఆఫీసర్‌, జిల్లా పరిషత్ సీఈవో, జీఎస్‌డబ్ల్యూఎస్ డిపార్టమెంట్ జిల్లా కోఆర్డినేటర్‌, మున్సిపల్ కమిషనర్స్‌, పోలీసు డిపార్టమెంట్ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.


*వెరిఫికేషన్ ప్రక్రియ* 

దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి వైద్య బృందం ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేయడం, రెండోది హాస్పటిల్‌లో వెరిఫికేషన్ చేయించడం. జిల్లాలో  దీర్ఘకాలిక వ్యాధులు, దివ్యాంగు పెన్షనర్లు 1936 మంది ఉన్నారు. వీరిలో దీర్ఘకాలిక వ్యాధుల పెన్షనర్లు 1015 మంది కాగా, దివ్యాంగు పెన్షనర్లు 9 21 మంది ఉన్నారు. వీరు  చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం అయినవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధిత  పెన్షనర్ల. వీళ్ళ ఇంటింటికి వెళ్లి వైద్య బృందం వెరిఫికేషన్ చేస్తుంది. వీరు  నెలకు రూ.15,000 పెన్షన్ అందుకుంటున్నారు. ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్స్, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ వీరిని వెరిఫికేషన్ చేస్తారు. రూ. 6,000 పెన్షన్ అందుకుంటున్న దివ్యాంగుల పెన్షనర్లకు వైద్య బృందం వెరిఫికేషన్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో నిర్వహిస్తారు. లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, దృష్టి లోపం, వినికిడి లోపం , మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యం, మల్లీపుల్ డిజిబులిటీ,  మల్టీడిఫార్మిటీ లెప్రసీ 35,277 మంది పెన్షనర్లు ఉన్నారు. ఆర్థోపెడిక్స్, సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ వెరిఫికేషన్ చేస్తారు. ప్రతి మెడికల్ టీంతో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌ను జిల్లా కలెక్టర్‌ జత చేస్తారు. జిల్లా స్థాయిలో షెడ్యూల్‌ను జిల్లా స్థాయి సమన్వయ కమిటీ రూపొందిస్తుంది. మండల, మున్సిపాలటీ స్థాయిల్లో షెడ్యూల్‌ను రూపొందిస్తారు. మెడికల్ టీంను కూడా జిల్లాస్థాయి సమన్వయ కమిటీనే నియమిస్తుంది. ఒక మెడికల్ టీం ప్రతి రోజు కనీసం 25 పెన్షనర్లను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా షెడ్యూల్‌ను తయారు చేసి, జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. తేదీల వారీగా ఆయా పెన్షనర్ల మ్యాపింగ్ జరిగేలా చూసుకోవల్సిన బాధ్యత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లదే. పెన్షన్స్‌ను మొబైల్ అప్లికేషన్ ద్వారా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ అయిన పెన్షన్లలలో 5 శాతం ర్యాండమ్‌గా వెరిఫికేషన్ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఒక టీంను ఏర్పాటు చేస్తారు. ఇందులో కూడా అనర్హులు తీరితే ఆ టీంలోని డాక్టర్ల మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు.

*సర్టిఫికెట్ల జారీ నిలిపివేత….*

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్లను పెంపు చేసింది. అందులోనూ దీర్ఘకాలిక వ్యాధులు, వికలాంగుల పెన్షన్లను భారీగా పెంచింది. నెలకు రూ.3000 ఉన్న వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచింది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు పెన్షన్ కూడా రూ.10,000 నుంచి రూ.15,000కు పెంచింది. భారీగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆయా కేటగిరీల్లో అనర్హత పెన్షన్ల ఎరివేతకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల ప్రక్రియ పూర్తయ్యేవరకూ కొత్త వికలాంగ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్రంలో నకిలీ వికలాంగు ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండు మూడు నెలలు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అనర్హులు వికలాంగ పింఛన్లు తీసుకుంటున్నారని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. ప్రాథమిక పరిశీలనలో ఈ విషయం నిర్ధారణ అయింది. దీంతో మొత్తం దివ్యాంగుల పింఛన్లను పరిశీలనచేసి, అర్హులను గుర్తించాలని ప్రభుత్వం ఈ మేరకు పరిశీలనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అందజేస్తున్న ఈ ఆర్థిక సహాయం నిజమైన దివ్యాంగులకు మాత్రమే అందాలన్నది ప్రభుత్వ ధ్యేయం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *