చిత్తూరు దాహార్తిని తీర్చడానికి గండికోట జలాలు
త్వరలోనే కుప్పం విమాశ్రయానికి శంకుస్థాపన
పి ఎం సూర్య ఘర్ యోజన పథకం ప్రారంభం
పాలారు వాగుకు హంద్రీనీవా జలాలు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరుకు జిల్లాకు గండికోట జిల్లా నుంచి కృష్ణా జలాలను తీసుకుని వచ్చి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. త్వరలోనే కుప్పంలో విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. మూడు రోజుల కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు తొలి రోజు ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను విడుదల చేశారు. కుప్పం ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రతి ఇంటికి సౌర పలకలను అమర్చుటకు కుప్పం గ్రామీణ మండలం నడుమూరు నందు పి ఎం సూర్య ఘర్ యోజన పథకంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన మనోభావాలను ప్రజలతో పంచుకున్నారు. ఈ సంధంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గండికోట జలాలను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తీసుకొనివచ్చి, తంబళ్ళ పల్లి, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేస్తానని వివరించారు. కుప్పంలో విమానాశ్రయాన్ని మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తానని చెప్పారు. ఎన్నికలలోపే తాను కుప్పం విమానాశ్రయంలో దిగి కుప్పం పర్యటనకు వస్తానన్నారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా కుప్పం నియోజకవర్గానికి మాత్రం ఎమ్మెల్యేనే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేదన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్ స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్ధేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికే కుప్పం విజన్ 2029లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ నియమించి కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుప్పంలో ఉన్న 65 వేల కుటుంబాల్లో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా, ఇంటికో ఇంటికి పారిశ్రామికవేత్తను తయారుచేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15 వేల ఉద్యోగాల కల్పన,100 శాతం సోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్ పోర్టు పూర్తిచేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100 శాతం మరుగుదొడ్లు నిర్మాణం, అర్హులకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆస్పత్రి నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించి కుప్పం నియోజకవర్గాన్ని మోడ్రన్, టూరిజం హబ్ గా తయారు చేయడం వంటి నిర్ధిష్ట ప్రణాళికతో స్వర్ణ కుప్పం విజన్ – 2029 రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుప్పంకు పెట్టుబడులు తీసుకొస్తామని, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కష్టపడితేనే అభివృద్ధి ఉంటుందని, టీడీపీ పుట్టినప్పుటి నుంచి కుప్పంలో మరో జెండా ఎగరలేదని గుర్తు చేశారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జూన్‌లోపు హంద్రీనీవా జలాలు పాలారు వాగుకు తెస్తామని స్పష్టంచేశారు. పాలారు వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నం చేస్తామని, వర్షాకాలానికి ముందే 8 మీటర్ల భూగర్భజలాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికంగా పడిన వర్షాలను సద్వినియోగం చేశామన్న సీఎం, 73 శాతం జలాశయాల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులకు వ్యవసాయ యంత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సౌర విద్యుదుత్పత్తి కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, కరెంట్ బిల్లులు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వచ్ఛ కుప్పం ద్వారా పారిశుద్ధ్యం మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరలో స్వచ్ఛ కుప్పం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని, సాంకేతికత అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. భూ సమస్యలన్నీ పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న చంద్రబాబు. జూన్ లోగా హంద్రినీవా జలాలను పాలారు వాగుకు తీసుకొస్తామన్నారు. నీటి భద్రత, కరవు నివారణ కోసం గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించామని, టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతో పాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి పెట్టానన్నారు. స్వచ్చాంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తున్నామని, భవిష్యత్ లో డీప్ టెక్నాలజీ దే హవా. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి 150 సేవలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ముక్యమంత్రి వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న,నెడ్ క్యాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు,ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి జి.విధ్యాదరి, కడ పిడి వికాస్ మర్మత్, ట్రైనీ కలెక్టర్ హీమ వంశీ, రాష్ట్ర ఏ పి ఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ పి.ఎస్.మునిరత్నం, టిటిడి బోర్డు మెంబర్ శాంతారాం, పలమనేరు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నగరి, సత్యవేడు, చంద్రగిరి ఎమ్మెల్యేలు యన్.అమరనాధ్ రెడ్డి, గురజాల జగన్ మోహన్, డాక్టర్ వి.యం. థామస్,డాక్టర్ కె. మురళీమోహన్, గాలి బాను ప్రకాష్, కె.అదిమూలం, పులివర్తి నాని, మాజీ కేంద్ర మంత్రి పనపాకం లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు రాజసింహులు, గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు ఏ. ఎస్.మనోహర్, సుగుణమ్మ, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు సి ఆర్ రాజన్ తదితరులు ఉన్నారు.