4, జనవరి 2025, శనివారం

రూ.11 కోట్ల జడ్పి నిధులతో జిల్లాలో అభివృద్ధి పనులు

మండల పరిషత్ లకు రూ.5.54 కోట్లు విడుదల 

నీటి ఎద్దడి నివారణకు రూ. 1.5 కోట్లతో ప్రణాళిక 

రూ. 2 కోట్లతో జిల్లా పంచాయతీ వనరుల శిక్షణ కేంద్రం 

రూ. 50 లక్షలతో జిల్లా పరిషత్ అతిధి గృహం నిర్మాణం

"ఆంధ్రప్రభ బ్యూరో'తో జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్ 


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఉమ్మడి జిల్లా పరిషత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరులో 'ఆంధ్రప్రభ బ్యూరో'తో మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యమే తన లక్ష్యంగా జిల్లాలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ నిధులతో జిల్లాలో 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. మండల పరిషత్తులకు ప్రభుత్వం 5.54 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. చిత్తూరు జిల్లాకు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జిల్లా పంచాయతీ వనరుల శిక్షణ కేంద్రం మంజూరు అయిందన్నారు. జిల్లా పరిషత్ పాత అతిథిగృహం స్థానంలో 50 లక్షల రూపాయలతో కొత్త అతిధి గృహాన్ని నిర్మించనున్నట్లు సీఈఓ వెల్లడించారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా 1.5 కోట్ల రూపాయల అంచనాతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించామని తెలిపారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 66 మండల పరిషత్తులను సమన్వయం చేసుకొని, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్ తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడడమే తన ధ్యేయంగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లాలోని వివిధ ప్రభుత్వ అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో సుపరిపాలన అందిస్తున్నట్లు వివరించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో 1.5 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించామన్నారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పీలేరు నియోజకవర్గంలో కొంత తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అంచనా వేశారు. జిల్లా పరిషత్ కు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 11 కోట్ల రూపాయలు రెండు విడుదలగా విడుదల అయ్యాయన్నారు. అలాగే జిల్లాలోని మండల పరిషత్తులకు 5.54  కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని వివరించారు. ఈ నిధులతో ప్రజలకు అవసరమైన పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించడానికి గ్రామ సభలను నిర్వహించి సమస్యలను తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను 12 శాతం తాగునీటి కోసం, 23 శాతం అభివృద్ధి పనులకు హెచ్చించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 400 పనులకు సంబంధించి 12 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించలేదన్నారు. అందులో ఇప్పటివరకు 8 కోట్ల రూపాయలను పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించామని వివరించారు. గంగాధర నెల్లూరు మండలంలో 1.5 లక్షల రూపాయలు, పుంగనూరు మండలంలో 1.36 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగమయ్యాయని వివరించారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని, వారి నుంచి ఆ నిధులను రాబట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. చిత్తూరు జిల్లాకు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జిల్లా పంచాయతీ వనరుల శిక్షణా కేంద్రంను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని, స్థలం ఖరారు కాగానే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఇందులో జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచులకు, ఇతర మండల స్థాయి అధికారులకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. చిత్తూరులోని పాత జిల్లా పరిషత్ అతిధి గృహం  స్థానంలో 50 లక్షల రూపాయలతో కొత్తగా జిల్లా పరిషత్ అతిధి గృహం మొదటి దశ పనులు చేపడుతామని తెలిపారు. జిల్లాలో నిత్యం పర్యటిస్తూ, మండలాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మండల అభివృద్ధి అధికారులలో ఉత్సాహం నింపుతూ ఆయా మండలాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జడ్పీ సీఈఓ రవికుమార్ వివరించారు.

పో రై గంగ 1 జడ్పీ సీఈఓ రవికుమార్

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *