11, జనవరి 2025, శనివారం

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

 నేడు జాతీయ యువజన దినోత్సవం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.) 

స్వామి వివేకానంద పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది 125 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత మహాసభ. ఈ సభలో ఆంగ్లంలో ఆయన చేసిన అనితరసాధ్యమైన ప్రసంగం. ముందుగా ప్రిపేర్ చేసిన ప్రసంగపాఠం కూడా లేకుండా… అమెరికా దేశపు ప్రియ సహోదరులారా… అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ దద్దరిల్లిపోయిన ఘట్టం చిరస్మరణీయం. ఆంగ్ల భాషలో ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పట్టింది. దేశ నిర్మాణానికి మూల స్తంభంలాంటి యువతరంలో స్ఫూర్తి నింపడానికి స్వామి వివేకానంద అనేక ఉత్తేజకర ప్రసంగాలు చేశారు. భారతదేశ యువతలో స్వామి వివేకానంద పలుకులు ఎన్నటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. ‘మీరు బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. బలీయ శక్తులమని భావిస్తే బలీయ శక్తులుగానే ఎదుగుతారు. నిరంతర కృషితో ఉన్నత శిఖరాలకు ఎదగండి’ అంటూ ఆయన మోటివేషన్ ఇచ్చారు.

జనవరి 12న స్వామి వివేకానంద జయంతి. ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రతి యేటా జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా యువత సమస్యలను పరిష్కరించేందుకు, యువత దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వాలకు, ఇతరులకు ఇది ఒక అవకాశం. అంతర్జాతీయ యువ దినోత్సవం గౌరవార్ధం కన్సర్ట్స్, వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలను జాతీయ, స్థానిక ప్రభుత్వ అధికారులు, యువజన సంస్థలు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భారతీయ సమాజాన్ని జాగృతం చెయ్యడమే కాకుండా పాశ్చాత్య దేశాలకు యోగ, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాలు, వాదనల ద్వారా పరిచయం చేసిన యోగి స్వామి వివేకానంద. నేటి యువతకు ఆయన ఎంతో ఆదర్శప్రాయుడు.  ముఖ్యంగా, రామకృష్ణ మఠాన్ని స్థాపించిన స్వామి వివేకానంద భారత యువతకు దిశానిర్ధేశం చేశారు. 39 యేళ్ళ వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా 1984లో ప్రకటించింది. అలాగే, స్వామి వివేకానంద గొప్ప ఉపన్యాసకుడు. ఆయన ప్రసంగం ఎంతటివారినైన కట్టిపడేసేది. స్వామిని ఆ రోజులలో ‘లైట్నింగ్ ఆరేటర్’ అని పిలిచేవారు. 1893 సెప్టెంబరు లో అమెరికాలోని చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసిన ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచ దేశాలంతట ప్రతి ధ్వనిస్తుంది. ఈ సభలో హిందూ వేదాంత భేరిని మ్రోగించిన వివేకానంద ఇలా చెప్పారు. ఎన్నటికైన విశ్వమానవ మతమనేది ఒకటి వెలసినది అంటే, అది తాను ప్రకటించిన భగవంతునిలా దేశకాలాతీతమై, అనంతమై ఉండాలి. కృష్ణుని అనుసరించే వారి మీద, సాధు పురుషుల మీద, పాపాత్ముల మీద అందరిమీద తదీయ భాను దీప్తి. స్వామి వివేకానంద 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్ర నాథ్ దత్. చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ. 1881 లో, వివేకానంద రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. ఆయన వివేకానందుని గురువు అయ్యాడు. తన గురువు రామకృష్ణ ప్రభావంతో 25 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకున్నారు. ఆ తరువాత, ఆయన పేరు స్వామి వివేకానందగా మార్చుకున్నారు. రామకృష్ణ పరమహంస 1886లో మరణించారు. స్వామి వివేకానంద 1897లో కోల్‌కతాలో రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. ఒక సంవత్సరం తరువాత, ఆయన గంగా నది ఒడ్డున బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. వివేకానంద తన 39వ ఏట 1902 జూలై 04న బేలూరు మఠంలో మరణించారు.వివేకానంద నిజమైన కర్మయోగి. ఈ దేశ యువతపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు. యువత తమ కృషి, అంకితభావం, ఆధ్యాత్మిక బలం ద్వారా భారతదేశ విధిని మార్చగలరని ఆయన దృఢంగా విశ్వసించారు. యువతకు ఆయన సందేశాలు...  'లేవండి, మేల్కోండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి‘, మన ఈ ప్రస్తుత స్థితికి మనమే కారణం. మనం ఎలా ఉండాలనుకుంటామో, అలా ఉండడానికి కావాల్సిన సమస్త శక్తి, జ్ఞానం మనలోనే ఉన్నాయి'. ’మందలో ఒకరిగా ఉండకు. వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు' వంటివి ముఖ్యమైనవి. 


పో రై. గంగ 2 స్వామి వివేకానంద 





 
స్వామి వివేకానంద సూక్తుల్లో కొన్ని..
1. మిమ్ములను బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.
2.ప్రతి రోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.
3. నీ వెనుకాల ఏముంది.. ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం.
4. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే.. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
5. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.
6. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు.
7. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి.
8. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.
9. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనలకంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.
10. మందలో ఒకరిగా ఉండకు. వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *