22, జనవరి 2025, బుధవారం

కాపు కార్పొరేషన్ కు రూ. 15 కోట్ల నిధులు

రూ. 7.48 కోట్ల సబ్సిడీ మరో 7.48 కోట్ల బ్యాంకు రుణం
 21 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అర్హులు 
బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు దరఖాస్తు చేసుకోవచ్చు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) 

ఈ ఆర్థిక సంవత్సరానికి కాపు కార్పొరేషన్ కు 14.96 కోట్ల రూపాయలతో వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.  ఈ మేరకు వివరాలను జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులకు అందాయి. కాపు కార్పొరేషన్ కింద 445 మంది లబ్ధిదారులు లబ్ధి పొందే విధంగా ప్రణాళికలను రూపొందించారు. 14.96 కోట్ల రూపాయలలో 7.48 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది. మరో 7.48 కోట్ల రూపాయలను బ్యాంకులు లబ్ధిదారులకు రుణాలుగా అందచేస్తారు. ఈ పర్యాయం లబ్ధిదారుల వాటా అవసరం లేకుండా పథకాలను రూపొందించడం విశేషం. వీటికి 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు దరఖాస్తు చేసుకోవచ్చును.  దరఖాస్తుదారుడు కుల ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు పాసు బుక్ పాటు ఫోన్ నెంబరు  జత చేయాల్సి ఉంటుంది.


కాపు కార్పొరేషన్ కింద నాలుగు స్లాబులుగా ఈ పథకాలను విభజించారు. స్లాబ్ 1 లో యూనిట్ ధర రెండు లక్షల రూపాయలు. ఇందులో  లక్ష రూపాయలు సబ్సిడీ కాగా మరో లక్ష రూపాయలను బ్యాంకులు రుణంగా అందజేస్తాయి. స్లాబ్ 2 లో యూనిట్ ధర  3 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో 1.50 లక్షలు సబ్సిడీ కాగా, మరో 1.50 లక్షల రూపాయలు బ్యాంకు రుణం. స్లాబ్ 3లో యూనిట్ ధర ఐదు లక్షల రూపాయలు. ఇందులో సబ్సిడీ 2.5 లక్షల రూపాయలు గాక, బ్యాంకు రుణం 2.5 లక్షల రూపాయలు. ఇవి కాకుండా స్లాబ్ 4 లో యూనిట్ ధరను 25 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 10 లక్షల రూపాయలు. బ్యాంకు రుణం మరో 10 లక్షలు రూపాయలు. ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారులు తన కాంట్రిబ్యూషన్ గా జత చేయాల్సి ఉంటుంది. కాపు కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల రూపాయల పథకాలను 99 మందికి, మూడు లక్షల రూపాయల పథకాలను 216 మందికి, ఐదు లక్షల రూపాయల పథకాలను 130 మందికి మొత్తం 445 మందికి రుణాలను అందజేయాలని నిర్ణయించారు. స్లాబ్ 1 కింద 99 లక్షల రూపాయలు, స్లాబ్ 2 ద్వారా 3.24 కోట్ల రూపాయలు, స్లాబ్ 3 ద్వారా 3.25 కోట్ల  రూపాయలను లబ్ధిదారులకు అందజేస్తారు. స్లాబ్ 4 కింద నలుగురు లబ్ధిదారులకు 80 లక్షల రూపాయలను అందజేస్తారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రోటా వేటర్, ఆయిల్ ఇంజన్లు,  స్పేయర్లు, నర్సరీలు, పవర్ టెల్లర్, పుట్ట గొడుగుల తయారీ, మినీ ట్రాక్టర్, ఎడ్ల బండ్లు, డ్రోన్ తో స్పేయర్, ట్రాక్టర్ కంప్రెసర్ తదితర యూనిట్లు మంజూరయ్యాయి. పశుసంవర్ధక శాఖకు సంబంధించి రెండు ఆవులను అందజేస్తారు. రైతులు కోళ్ల షెడ్డును అని కూడా నిర్మించుకోవచ్చు. రవాణా రంగానికి సంబంధించి మినీ వ్యాన్, ఈ- ఆటో తదితరాలను అందజేస్తామని, పరిశ్రమల రంగంలో మ్యాంగో జల్లి తయారీ, ఫ్లోర్ మిల్లు తదితరులు ఉంటాయి. సర్వీస్ రంగంలో ద్విచక్ర వాహనాల రిపేరు, ఆటో సర్వీసింగ్, వాచ్ రిపేర్లు, ఎంబ్రాయిడరీ వర్క్, బార్బర్ షాప్, బ్యూటీ పార్లర్, కేటరింగ్ యూనిట్లు, మెకానిక్ షాపులు, డ్రై ఫ్రూట్స్ సెల్లింగ్ షాపులు, మైక్ సిస్టం, బ్యాటరీ సర్వీసింగ్ షాప్, ప్లంబర్, సెల్ ఫోన్ రిపేర్లు తదితరాలను చేర్చారు. ఎంఎస్ఎంఇ కింద 4 యూనిట్లు మంజురయ్యాయి. ట్రాక్టర్  యూనిట్ ధర 60,000 కాగా, 25,000 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. 35 వేల రూపాయలను బ్యాంకులో రుణంగా ఇస్తారు. రెండు ఆవులకు యూనిట్ రెండు 20 వేల రూపాయలు గాక 10 వేల రూపాయలు సబ్సిడీ ఉంటుంది. 10 వేల రూపాయలు బ్యాంకుకు తిరిగి చెల్లించాలి. పౌల్ట్రీ ఫారం యూనిట్ ధర 5 లక్షల రూపాయలు కాగా 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుంది. 2.5 లక్షల రూపాయలు బ్యాంకు రుణం తిరిగి చెల్లించాలి. ఇందుకు దరఖాస్తులకు సంబంధించి ఇంకా ఆన్ లైన్ ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన తర్వాత ఆన్ లైన్ ద్వారా ఏపిఓబిఎంఎంఎస్ పోర్టరు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *