13, జనవరి 2025, సోమవారం

బోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

ముచ్చటగా మూడు రోజులు జరిగే పెద్ద పండగ 

సంక్రాంతి శోభతో కళకళలాడుతున్న పల్లెలు

గొబ్బిళ్ళతో సందడి చేస్తున్న మహిళల బృందాలు

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

భోగిమటలతో జిల్లాలో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్దంగా సోమవారం ప్రారంభమయ్యాయి. మహిళలు ఉదయమే లేసి  రంగురంగుల రంగవల్లులతో ఇంటి ముంగిళ్లను అలంకరించారు. ఇళ్లకు పచ్చని తోరణాలు కట్టారు. ఇంటి ముందర భోగి మంటలు వేశారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కలిసి చలికాలంలో వెచ్చదనాన్ని ఆస్వాదించారు. పలుచోట్ల పోటీలు పడి భోగి మంటలు వేశారు. మూడు నూనెలతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేసి, నూతన దుస్తులు వేసుకొని, సంక్రాంతి పండుగకు జిల్లా ప్రజలు ఆహ్వానం పలికారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సంక్రాంతికి దూర ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులందరూ సొంత ఇళ్లకు చేరుకున్నారు. మూడు రోజులపాటు బంధుమిత్రులతో సరదాగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.


 మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు కొంత ప్రత్యేకంగా జరుగుతాయి. సంక్రాంతికి నెల రోజుల ముందు నుండి ఇంటి ముందర గొబ్బెమ్మలు పెడతారు. ఆవు పేడతో గొబ్బెమ్మను తయారుచేసి, దాని మీద పూలు పెట్టి పూజ చేస్తారు. వారం రోజుల ముందు నుండి మహిళలు బృందాలుగా ఏర్పడి గొబ్బిళ్ళమ్మా గొబ్బిళ్ళు  అంటూ పాటలు పాడుకుంటూ ఇంటింటికి వస్తారు. ఒక జల్లెడను పూలతో అలంకరించి, మధ్యలో పసుపుతో తయారుచేసిన గౌరవమ్మను ఉంచుతారు. గౌరమ్మను ముక్కుపుడక, చెవి కమ్మలతో అలంకరిస్తారు. నగలు కూడా వేస్తారు. గొబ్బిళ్ళమ్మ గొబ్బిళ్ళు అంటూ గౌరమ్మ చుట్టూ తిరుగుతూ మహిళలు జానపద పాటలు ఆలపిస్తారు. పాటలకు లయబద్ధంగా చేతులతో చప్పట్లు కొడుతూ గౌరమ్మ చుట్టూ తిరుగుతారు. పాటలతో మేనమామ వరస అయిన వాళ్ళని ఆటపట్టించడం కూడా జరుగుతుంది. అలా మహిళలు ఆడి పాడుతుంటే వారికి నగదు రూపంలో కొంత ముట్ట చెబుతారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో గతించిన పెద్దలకు నూతన వస్త్రాలు నట్టింట పెట్టి, మొక్కుతారు. పెద్దలకు తర్పణాలు వదులుతారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు. కావున ఈ పండుగను పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. గ్రామాలలోని ఆలయాల్లో నెలరోజులపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ భజన పాటలు ఆలపిస్తారు. ఇలా పెద్దలను స్మరించుకుంటూ, ఆటపాటలతో ప్రకృతికి దగ్గరగా జరుపుకునే పండుగే సంక్రాంతి. సూర్యుడు ప్రతినెలా ఒక్కో కార్తెలోకి ప్రవేశిస్తాడు. ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. భానుడు ఒకవైపు నుంచి మరోవైపుకి మారడం వల్ల వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. ఈ నెలతో శీతాకాలం దాదాపు పూర్తి కాగా ఇప్పటి నుంచి పగలు సమయం పెరిగి, రాత్రి వేళ తగ్గుతుంది. పూర్తిగా ఈ పండుగను సౌరమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో ఏటా పెద్దగా మార్పులుండవు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. సంక్రాంతి రోజున  సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతి సంబరాలకు చిత్తూరు జిల్లాలో  ప్రత్యేక స్థానం ఉంది. కొత్త సంవత్సరాదిలో వచ్చే తొలి పండుగ కావడంతో అందరూ చాలా వైభవంగా నిర్వహించుకుంటారు. ముచ్చటగా మూడు రోజుల పాటు  ఈ పండుగను చేసుకుంటారు. భోగితో  మొదలయ్యే పండుగ కనుమతో  ముగుస్తుంది. కొందరు ముక్కనుమ కూడా చేసుకుంటారు. పండుగరోజుల్లో ప్రతి పల్లెలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతుంది. పురాణాల ప్రకారం, సూర్య భగవానుడు అదే రోజున తన కొడుకు శని ఇంటికి వస్తాడని చెబుతారు. దీన్ని 'తండ్రీ కొడుకుల' కలయికగా ఈ పండుగను పేర్కొంటారు. అదే రోజున అసురులపై మహావిష్ణువు విజయం సాధించిన గుర్తుగా ఈ పండుగ చేసుకోంటారని మరికొంతమంది చెబుతున్నారు. ప్రతి మాసంలో ఒక సంక్రాంతి వస్తూ ఉంటుంది. అయితే ఇందులో మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం చేసుకునేది మకర సంక్రాంతి. సంక్రాంతిని  తెలుగు రాష్ట్రాల్లోనూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గోపూజలు ఇలా మూడు రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ వేళ ప్రతి రైతు ఇంట్లో కొత్త బియ్యం ఉంటాయి. ఆరుగాలం శ్రమించిన పంట ఇంటికి చేరటంతో దానధర్మాలు సైతం అధికంగానే చేస్తారు. మహాభారత కాలం నుంచే దీనిని జరుపుకుంటున్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో విశేషాలు కలిగిన సంక్రాంతిని రైతుల పండుగ అనే చెప్పవచ్చు. భోగి రోజు చేసుకునే పరమాన్నం నుంచి కనుమ రోజు గోపూజ వరకు అన్ని అన్నదాతను భాగస్వామిని చేసేవే. సంక్రాంతి పండుగలో మొదటి రోజు నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని సూర్యోదయానికి ముందే స్నానాధి కార్యక్రమాలు ముగించి భోగి మంటలు పెడుతారు. ఇంట్లో ఉన్న చెడును మంటలో కాల్చేసి ఇంట్లో కొత్త శోభ వచ్చేలా చేయడం దీని పరమార్థం. అయితే, భోగి మంటలో పాత వస్తువులతో పాటు ఆవు పిడకలను కూడా వేసి కాల్చితే పర్యావరణంలోని హానికర బాక్టీరియా చనిపోయి ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని నమ్మకం. ఈ రోజున పంటను చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారు. అవి త్వరగా అరగవు కాబట్టి బెల్లం, నువ్వులు కలిపి వండుతారు. వాతావరణానికి తగినట్లు మన శరీరం అలవాటు పడటానికి ఒంట్లో వేడి పెరగటానికి నువ్వులతో కూడిన పరమాన్నం చేస్తారు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు.. కాబట్టి దీనిని పొంగల్ అని పిలుస్తారు. ప్రతి ప్రాంతంలో బెల్లం, నువ్వులు ఏదో ఒక రూపంలో వంటకాల్లో ఉండేలా చూసుకుంటారు.  రెండో రోజైన మకర సంక్రాంతి రోజు రంగ వల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలుతో పాటు ఆకాశంలో ఎగిరే గాలిపటాలతో పండగ శోభ తొణికిసలాడుతుంది. ఈ పండగను ప్రకృతిలోని ప్రతి జీవి మరో జీవితో సంతోషం పంచుకునే వేడుక అని చెప్పవచ్చు. పిండితో వేసే ముగ్గులతో నేలపై ఉన్న చీమలు ఇతర చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది. గొబ్బెమ్మల దగ్గర వేసే నవధాన్యాలు పక్షులకు ఆహారం అవుతాయి. ఇంటి నిండా ధాన్యంతో ఉంటుంది కాబట్టి హరిదాసులకూ భుక్తి దొరుకుతుంది. గాలి పటాలు ఎగరేయటం విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి అయినప్పటికీ మానసికోల్లాసం కోసం మనమూ ఆచరిస్తున్నాం. మూడో రోజైన కనుమ నాడు సిరిధాన్యాలతో తమ ఇళ్లు కలకలలాడటానికి కారణమైన గోవులను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. వాటికి స్నానం చేయించి ప్రత్యేకంగా ఆలంకరిస్తారు. ఇలా మూడు రోజుల పాటు భక్తి శ్రద్దలతో సంక్రాంతిని జరుపుకుంటారు. 

పో రై గంగ 1 ఇంటి ముందర గొబ్బెమ్మలు

గంగ 2 మహిళలు పతలుపడుతూ గొబ్బిళ్లు 

గంగ 3 పెద్దలకు బట్టలు పెట్టడం 

గంగ 4 భోగి మంటలు 

 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *