15, జనవరి 2025, బుధవారం

వనభోజనాల ముక్కనుమ పండుగ

గ్రామాలలో దూడలకు పండుగే పండుగ

నేడే ముక్కనుమ పండుగ


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

సంక్రాంతి పండుగలో చివరి రోజు అయిన ముక్కనుమ పండుగకు చిత్తూరు జిల్లాలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోజును గ్రామాలలో దూడల పండుగగా వ్యవహరిస్తారు. పట్టణాలలో గొట్ అని వ్యవహరిస్తారు. సంక్రాంతి మూడవ రోజు అయిన కనుమ పండుగ పశువుల పండుగ అయితే, నాలుగవ రోజు దూడల పండుగ. ఆ రోజు ఆవుల నుంచి పాలను తీయరు. దూడలు తమకు ఎంత అవసరమో అంత పాలను తాగవచ్చును. కావున ఈరోజును దూడల పండుగగా వర్ణిస్తారు. సాధారణంగా కొన్ని డైరీలు ఆరోజు సెలవుగా ప్రకటిస్తాయి. ఆరోజు పాల సేకరణ ఉండదు. ఇక పట్టణాల్లో వ్యాపారాలతో సతమతమైన ఆర్యవైశ్యులు ముక్కనుమను ఆట విడుపుగా భావిస్తారు. ఆరోజు తమ దుకాణాలను మూసి, తాళాలు వేస్తారు. సమీపంలోని వనాలకు వెళ్లి ఇష్టమైన భోజన పదార్థాలను తయారు చేసుకుని భుజిస్తారు. రోజంతా ఆటపాటలతో ఉల్లాసగా గడుపుతారు. వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బంధుమిత్రులను ఆప్యాయంగా పలకరించుకుంటారు.

సంక్రాంతిలో తొలిరోజైన భోగి రోజంతా భోగిమంటలు, భోగిపళ్లు, బొమ్మల కొలువుతో సందడిగా సాగిపోతుంది. రెండో రోజు  సంక్రాంతి పెద్దల పండుగగా భావిస్తారు. గతించిన పెద్దలకు బట్టలు పెట్టి వారి ఆశీస్సులు అందుకుంటారు. మూడో రోజు కనుమ సందర్భంగా పంటలు పండేందుకు తోడ్పాటునిచ్చే పశువులకు కృతజ్ఞతగా పూజలు చేస్తారు. కొందరు కనుమ రోజు మాంసాహారం తింటారు. నాలుగో రోజు అయిన ముక్కనుమ రోజున గ్రామదేవతలకు పసుపు, కుంకుమ ఇచ్చి గ్రామాన్ని , తమని రక్షించమని వేడుకుని బలిస్తారు. సంక్రాంతిలో మూడోరోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదనే నియమం ఉంది. కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదనే నానుడి కూడా ఉంది. ఈ మేరకు పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు నాలుగో రోజున అత్తారింటికి తిరిగి పయనమవుతారు. ఆ రోజున మాంసాహారంతో మంచి భోజనం పెట్టి, పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల్ని అత్తారింటికి పంపిస్తారు. సాధారణంగా కనుమ రోజు రథం ముగ్గు వేస్తారు. కొందరైతే ముక్కనుమ రోజు రథం ముగ్గువేసి, పక్కింటి వాళ్ల వాకిట్లో వేసే రథం ముగ్గును కలిపి అలా ఊరంతా కలసి పెద్ద రథాన్ని తయారు చేస్తారు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మరలే సందర్భాన్ని గుర్తుచేస్తూ ఆయన్ను సాగనంపేందుకు ఊరు ఊరంతా కలసి రథం ముగ్గు కొనను కలుపుతూ వేస్తారు. ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును 'కరినాళ్' అని పిలుస్తారు. ఈ రోజు బంధుమిత్రులను కలిస్తే మంచిదని భావిస్తారు. కొత్త సంబంధాలు కలుపుకునేందుకు, మంచి చెడులకు అనువైన రోజుగా భావిస్తారు.  బంధువులను పరామర్శించేందుకు ఈ రోజు మంచిరోజుగా భావించి కలుసుకుంటారు. అందుకే సకుటుంబ, సపరివార సమేతంగా సమీపంలోని వనాలలో, ఆలయాలలో వనభోజనాలు చేస్తారు. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దుల్లో ఉన్నందున చాలావరకు తమిళ సంస్కృతి మిళితం అయింది. ముక్కనుమను చిత్తూరులో గోట్ అని వ్యవహరిస్తారు. కావున చిత్తూరు జిల్లాలో కూడా పలువురు ముక్కనుమ రోజున వనభోజనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులు తమ దుకాణాలను కట్టివేస్తారు. సమీపంలోని ఫారెస్ట్ ప్రాంతంలో వాన భోజనాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఆర్యవైశ్య సంఘం నేతలు చేస్తారు. ఈ వనభోజనాల కార్యక్రమాలలో రాజకీయ నాయకులు కూడా పాల్గొంటారు. ఇలా నాలుగు రోజుల సంక్రాంతి పండుగ ముగుస్తుంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *