కనుమరుగు అవుతున్న కనుమ పండుగ వైభవం
కనిపించని కాడేద్దులు, పందెపు కోడెలు
ఆవుల పండుగగా మారుతున్న పశువుల పండుగ
గ్రామాలలో ఊసే లేని పశువుల పందేలు
రేపు కనుమ పండుగ
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
సంక్రాంతి పండుగలో మూడవ రోజైన కనుమ పండుగ వైభవం క్రమంగా కనుమరుగు అవుతోంది. గ్రామాలలో కాడెడ్డులు, కోడే దూడలు, గిత్తలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి స్థానాన్ని పాడి ఆవులు అక్రమిస్తున్నాయి. పశువుల పండుగ కాస్త అవుల పండుగగా మారిపోతోంది. కనుమ రోజు ఊరి బయట చిట్లా కుప్పలు వేసి, వాటికి నిప్పు అంటించి, కాటమరాజును పూజించే సంసృతి కనిపించడం లేదు. పశువులను తరమడం, వాటి మీద పందేలు కాయడం వంటివి కనిపించడం లేదు. కనుమ పండుగ అంటే పశువులకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ కాదని సంక్రాంతి తరువాత మాంసాహారపు వంటలు చేసుకుని ఆరగించే పండుగ అని ప్రజలలో ఒక భావన ఏర్పడి పోయింది.
కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. మూడురోజులు ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అంటారు. అందరూ చెప్పుకున్నట్టు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండగ అని తెలిసిందే. పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు. రైతు పొలం దున్ని, విత్తనాలు విత్తి, పంటలు పండిచి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అలాగే ఆవులు, ఎనుములు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతుకు మరొక ఆదాయవనరుగా దోహదం చేస్తుంది. పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది. నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటల దిగుబడి, ఆ ధాన్యాలు, కాయలు, పండ్ల యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్ని విధాలా రైతుకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైనది. గ్రామాలలో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకుంటారు కూడా. అలాంటి పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతరార్థం. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి(స్నానం చేయించి) వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్ళకు మువ్వలు వేస్తారు. పెన్సిల్ ను పదునుగా చెక్కినట్టు పశువుల కొమ్ములను పదును చేస్తారు. ఆ కొమ్ములకు రంగులు వేస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు. కప్పులు వేసి, కుచ్చిళ్లి కట్టి, రంగు రంగుల బెలూన్ లతో ముస్తాబు చేస్తారు. అలాగే పశువుల ఒంటిమీద అందడం బిళ్ళలతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు. ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోకల వరకు అన్నిటినీ సృజనాత్మకత జోడించి ఆకర్షణగా రూపుదిద్దుతారు. మేళతాళాలతో గ్రామంలో పశువులను ఊరేగిస్తారు. మంగళ హారతులు ఇస్తారు. ఇప్పటి కాలంలో కనిపించదు కానీ ఒకప్పుడు రైతులు కనుమ పండుగ సందర్భంగా బాగా పదునైతే కొడవలి(కత్తి) తీసుకుని అడవులలోకి వెళ్లి అడవులలో ఉన్న ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, , మారేడు, నల్లేరు, మోదుగ వంటి చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు. ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకొచ్చి వాటికి ఉప్పు చేర్చి బాగా దంచి పొడిలాగా తయారు చేస్తారు. ఆ పొడిని పశువులకు బలవంతంగా అయినా సరే తినిపిస్తారు. ఇందులో రహస్యం ఏమిటంటే తమకు ఎంతగానో సహాయం చేస్తున్న పశువులు ఆరోగ్యంగా ఉండాలని, వాటికి ఏమైనా జబ్బులు లాంటివి ఎదురైనా రోగనిరోధక శక్తి సమర్థంగా ఉండాలని అలా చేసేవారు. ప్రస్తుత కాలంలో ఇలాంటివి తగ్గిపోయాయి. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడు (పశువుల దేవుడు) ని పూజించడం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరి పొలిమేరల్లో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడతాడని గ్రామస్థులు మరియు రైతుల నమ్మకం. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడి గుడికి ( లేదా పొలిమేరల్లో ఉండే గ్రామ దేవత గుడికి) చేరుకుని అక్కడ బోనం(పొంగలి కుండ) సమర్పిస్తారు. అలాగే సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. అప్పుడే గతంలో ముక్కుకున్న ముక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్లు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకెళ్లి తమతమ పొలాలలో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం. బలిచ్చిన మూగజీవాలను ఇంటికి తీసుకెళ్లి వండుకుని తింటారు. అలా కనుమ పండుగ ముగుస్తుంది. ఈ విధంగా పశువులకు, రైతులకు మధ్య ఉన్న బంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటం అవుతుంది.
గంగ 6 పశువులకు అలంకరణలు