7, జనవరి 2025, మంగళవారం

ప్రమాదపు అంచున చిత్తూరు జిల్లా

బెంగళూరు, చెన్నైలలో హెచ్ఎంపివి వైరస్ కలకలం 

రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న చిత్తూరు 

అందోళనకు గురతున్న జిల్లా ప్రజలు 

జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తం 


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్ హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (హెచ్ఎంపివి) చిత్తూరు సమీపానికి వచ్చింది. బెంగళూరులో మూడు, ఎనిమిది నెలల వయసున్న ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. అలాగే తమిళనాడులోని చెన్నై, సేలంలలో  కూడా ఇద్దరికీ సోకింది. దీంతో జిల్లా ప్రజలలో అందోళన కార్యక్రమం ప్రారంభం అయ్యింది. చిత్తూరు జిల్లా ఇటు తమిళనాడుకు అటు కర్నాటకాకు సరిహద్దులను పంచుకుంటుంది. కర్ణాటక తమిళనాడు రాష్ట్ర రాజధానులు చిత్తూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు చిత్తూరు ముఖద్వారం. ఈ రెండు ప్రాంతాల నుంచి చిత్తూరుకు భారీగా ప్రయాణికులు వస్తుంటారు. చిత్తూరు జిల్లా నుంచి పలువురు చెన్నై, బెంగళూరులలో ఉద్యోగాలు చేస్తున్నారు. పలువురు ఐటి ఉద్యోగులతో పాటు కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఈ రెండు రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేసే ఉద్యోగులు శుక్రవారం తన స్వగ్రామానికి వచ్చి, ఆదివారం తిరిగు ప్రయాణం అవుతుంటారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ వ్యాపించడంతో తొందరలోనే చిత్తూరు జిల్లాలోకి కూడా ప్రవేశించి ప్రమాదం ఉందని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ఈ విషయమై కుప్పం పర్యటనలో ఉన్న  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వైద్యారోగ్యశాఖ అధికారులతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాలలో కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్లూయెంజా వంటి కేసుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలలోని డాక్టర్లు అప్రమత్తంగా, అందుబాటులో ఉండాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ వైరస్ కు సంబంధించి ప్రత్యేకమైన బెడ్లతో వార్డులను ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ప్రతి ఆసుపత్రిలో ఐదు నుంచి పది పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి ప్రభావతి కోరారు. వ్యాధి లక్షణాలను డాక్టర్లకు వివరించారు.  పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడులో  కేసులు నమోదైన నేపథ్యంలో ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా కొత్త వైరస్ వ్యాప్తిపై అధికారులతో చర్చించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే చిన్నపిల్లల వైద్యులు, మైక్రోబయాలజిస్టులు, శ్వాసకోశ వ్యాధుల నిపుణులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్‌ ఫోర్స్‌ నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. ఐసీఎంఆర్ వైరాలజీ రెడీ చేయాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు వేల వరకూ టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని ఆదేశించారు. ఎన్95 మాస్కులు, పీపీఈ కిట్లు, ఔషధాల గురించి కూడా చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శానిటైజర్లు, ఔషధాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాపై మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. ఇక ప్రజలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా కనీసం 20 సెకన్లు సబ్బుతో క్లీన్ చేసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని.. పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఆందోళన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇది 2001 నుంచి ఉనికిలో ఉందని.. ఏపీలో ఇప్పటిదాకా ఎలాంటి కేసులు రాలేదని వివరించారు. అలాగే రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో 20 పడకల ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రికి వైద్యారోగ్యశాఖ అధికారులు వివరించారు.  చైనాలో ఈ మధ్యే బయటపడిన హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (హెచ్ఎంపివి) వేగంగా విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల ముందు క్యూ కట్టిన రోగుల ఫొటోలు వైరల్ అయ్యాయి. హెచ్‌ఎంపీవీతో పాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, న్యుమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకూ చైనాలోనే ఎక్కువగా కనిపించిన హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పుడు మలేషియాలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అని అన్ని దేశాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. హెచ్ఎంపివి అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. హెచ్ఎంపివి వైరస్ తీవ్రమైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశముంది.హెచ్ఎంపివి లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఈ కింది లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకండి. 1. నిరంతర జ్వరం, 2. దగ్గు, గొంతు నొప్పి, 3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, 4. అలసట, బలహీనతఉంటే వెంటనే డాక్టరును సంప్రదించండం అవసరం. 

పో రై గంగ 1 హెచ్ఎంపివి వైరస్ 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *