ముఖ్యమంత్రి కుప్పం పర్యటన విజయవంతం
మూడు రోజులు బిజీ బిజీగా గడిపిన చంద్రబాబు
మొత్తం దృష్టి అంతా కుప్పం అభివృద్ది మీదనే
రాజకీయాలు ప్రస్తావించని చంద్రబాబు
పలు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం పర్యటన విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు గుడిపల్లి మండలం యూనివర్సిటీ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనను ముగించుకుని బుధవారం మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరి విశాఖపట్నం వెళ్లారు. మూడు రోజులపాటు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి బిజీ బిజీగా గడిపారు. మొత్తం దృష్టి అంతా కుప్పం నియోజకవర్గం మీదనే కేంద్రీకరించారు. ఎక్కడ రాజకీయ ప్రస్తావన తీసుకు రాలేదు.
తొలి రోజు గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటేషన్ ఆవిష్కరించారు. ఈ విషయమై చంద్రబాబు మాట్లాడుతూ..కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురవడానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15 వేల ఉద్యోగాల కల్పిస్తానన్నారు. 100 శాతం సోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్ పోర్టు పూర్తిచేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100 శాతం మరుగుదొడ్లు నిర్మాణం, అర్హులకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆస్పత్రి నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించి కుప్పం నియోజకవర్గాన్ని మోడ్రన్, టూరిజం హబ్ గా తయారు చేయడం వంటి నిర్ధిష్ట ప్రణాళికతో స్వర్ణ కుప్పం విజన్ – 2029 రూపొందించామని అన్నారు. అనంతరం కుప్పం గ్రామీణ మండలం నడుమూరులో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రతి ఇంటి కి సౌర పలకలను అమర్చే పి ఎం సూర్య ఘర్ యోజన పథకంను, ప్రతి ఇంటికి సౌర విద్యుత్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...పీఎం సూర్యఘర్ కింద కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వంద శాతం రాయితీతో సౌర ఫలకలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే అందించడమే నా లక్ష్యం. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికీ సోలార్ ప్యానల్స్ అమర్చుతామన్నారు. తరువాత కుప్పం మండలం శీగల పల్లి లో ప్రకృతి వ్యవసాయం క్షేత్రం ను సందర్శించి, ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆంధ్ర ప్రదేశ్ - రైతు సాధికారత సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ లలో ఆరోగ్యం - పోషణ సంబంధిత అంశాలపై ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ లను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు కృష్ణ మూర్తి,కుటుంబ సభ్యులు 3 ఎకరాలలో సాగు చేస్తున్న పంటలు మిరప, వంకాయ, టమోటా, పసుపు,మునగ, 25 వివిధ రకాల పంటల సాగు మరియు పద్ధతులపై ముఖ్య మంత్రికి వివరించారు. రానున్న 5 సంవత్సరాలలో కుప్పం నియోజక వర్గంలో ప్రకృతి వ్యవసాయమును పూర్తి స్థాయిలో అనుసరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నియోజక వర్గంను ఆదర్శ నియోజక వర్గం గా మారుస్తామని, ప్రకృతి వ్యవసాయంలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే నమూగా తయారు మార్చుతానని, రాబోయే ఐదేళ్లలో వందశాతం ప్రకృతి వ్యవసాయంగా మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. రెండవ రోజు టిడిపి కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన జననాయకుడు పోర్టర్ ను ప్రారంభించి, ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కుప్పం నియోజకవర్గం తో పాటుగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అర్జీదారులు వచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా అర్జీదారుల వద్దకు వచ్చి సమస్యల అర్జీలను స్వీకరించారు. మధ్యాహ్నం టి డి పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కుప్పం అభివృద్దికి అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. తరువాత ఎన్ టి ఆర్ స్టేడియం చేరుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సా.4.35 గంటలకు సభా వేదికపై ఎన్టీఆర్ స్టేడియం సభా వేదికలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. కూచిపూడి నాట్యం చేసిన విద్యార్థులను రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు బ్యాంకు లింకేజీ మరియు శ్రీనిధి రుణాలు కింద మొత్తం 41342 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.457 కోట్ల 57 లక్షలు, సీఎంఆర్ ఎఫ్ కింద 71 మందికి 1 కోటి 93 లక్షలు పంపిణీ చేశారు. జిల్లా ఉద్యాన శాఖ, సూక్ష్మ నీటి సాగు పథకం కింద రూ.4 కోట్లతో 220 మందికి డ్రిప్పు పరికరాల పంపిణీ చేశారు. యాంత్రికరణలో భాగంగా 2.13 కోట్ల తో 5 ఐదు మందికి మినీ ట్రాక్టర్లు, ఇతర పరికరాలు అందజేశారు. అనంతరం కంగుందికి చేరుకొని, రాత్రి 7.15 గంటలకు రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తండ్రి దివంగత పి.ఆర్ శ్యామన్న విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ద్రావిడ యూనివర్సిటీ లో అకడమిక్ బిల్డింగ్ కెరీర్ రెడీ నెస్ సెంటర్ ను, యూనివర్సిటీలో విద్యార్థుల వసతి గృహం ప్రాజెక్టు విలువ రూ. 249.62 లక్షలతో నిర్మించిన భవనం, రూ.1000.00 లక్షలతో నిర్మించిన తరగతుల భవన సముదాయం భవనాన్ని ప్రారంభించారు. ద్రావిడ యూనివర్సిటీ సెమినార్ హాల్ లో జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాత్రి కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహము లో రాత్రి కి బస చేశారు. ముఖ్యమంత్రిని మదనపల్లి, కదిరి శాసనసభ్యులు షాజహాన్ భాష, వెంకట ప్రసాద్, పలువురు స్థానిక నాయకులు,ప్రజలు కలిశారు. తనను కలిసేందుకు వచ్చిన వారినిఆప్యాయంగా పలకరించారు. కుప్పంలో మూడు రోజులపాటు పర్యటనను విజయవంతంగా ముగించుకొని బుధవారం మధ్యాహ్నం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. తన పర్యటనలో కుప్పం నియోజక వర్గం దిశా దిశ మార్చే విధంగా స్వర్ణ కుప్పం విజన్ 2029 ను లాంఛనంగా ప్రారంభించి, ఐదు సంవత్సరాలలో చేపట్టబోయే పనులకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలకు సవివరంగా వివరించారు.
పో రై గంగ 1 ముఖ్యమంత్రికి అభిమానంతో పుష్పం అందచేస్తున్న మహిళ
గంగ 3 రక్షణ వలయంలో చంద్రబాబు
గంగ 3 ముక్యమంత్రికి సాదర వీడ్కోలు