జిల్లాలో బీసీల అభివృద్ధికి రూ. 38.41 కోట్లతో ప్రణాళిక
సబ్సిడీ రూ. 19.20 కోట్లు, మరో రూ. 19.20 కోట్ల బ్యాంకు రుణం
2020 బిసిలకు లబ్ది, 50 శాతం సబ్సిడీతో రుణాలు
మరో ఏడు కార్పొరేషన్ లకు కూడా రుణాలు
'ఆంధ్రప్రభ బ్యూరో'తో బిసి కార్పొరేషన్ ఇడి శ్రీదేవి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
జిల్లాలో బీసీల ఆర్థికాభివృద్ధికి 38.41 కోట్ల రూపాయలతో ప్రణాళికను రూపొందించామని బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. శ్రీదేవి వెల్లడించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా 19.20 కోట్ల రూపాయలను అందజేస్తుందని, బ్యాంకర్లు రుణాల కింద మరో 19.20 కోట్లను సమకూర్చుతారని వివరించారు. ఆదివారం ఆమె చిత్తూరులో 'ఆంధ్రప్రభ బ్యూరో'తో మాట్లాడుతూ ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని 2020 మంది బీసీలు లబ్ధి పొందుతారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను మూడు స్లాబ్ లుగా విభజించారని, మొదటి స్లాబ్ లో యూనిట్ ధర రెండు లక్షల రూపాయలుగా నిర్ణయించారన్నారు. ఇందులో 75 వేల రూపాయలు సబ్సిడీ ఉంటుందని, 1.25 లక్షల రూపాయలు బ్యాంకులు రుణంగా ఇస్తారని తెలిపారు. రెండవ స్లాబ్ లో యూనిట్ ధర మూడు లక్షల రూపాయలుగా నిర్ణయించారని, ఇందులో 1.25 లక్షలు సబ్సిడీ ఉంటుందని, 1.75 లక్ష రూపాయలు బ్యాంకులు రుణాలుగా ఇస్తాయని తెలిపారు. మూడవ స్లాబ్ లో యూనిట్ ధర 5 లక్షల రూపాయలుగా నిర్ణయించారని, ఇందులో రెండు లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుందని, మూడు లక్షల రూపాయలను బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
.
బ్రాహ్మణ కార్పొరేషన్ కింద జిల్లాకు 16 యూనిట్లు 33 లక్షల రూపాయలతో మంజూరయ్యాయని చెప్పారు. ఈబీసీ కార్పొరేషన్ కింద 89 యూనిట్లకు 1.75 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు 73 మంది లబ్ధిదారులకు 1.46 కోట్లతో ప్రణాళికను రూపొందించామన్నారు. క్షత్రియ కార్పొరేషన్ కింద 11 మంది లబ్ధిదారులకు 23 లక్షలతో, రెడ్డి కార్పొరేషన్ కింద 65 మందికి 1.30 కోట్ల రూపాయలతో, వైశ్య కార్పొరేషన్ కింద 13 మంది లబ్ధిదారులకు 28.5 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామని, వీటికి జిల్లాలోని బ్యాంకర్ల సమావేశం ఆమోదం తెలిపిందిన్నారు. వెనుకబడిన తరగతులకు వ్యవసాయ రంగానికి సంబంధించి రోటా వేటర్, ఆయిల్ ఇంజన్లు, స్పేయర్లు, నర్సరీలు, పవర్ టెల్లర్, పుట్ట గొడుగుల తయారీ, మినీ ట్రాక్టర్, ఎడ్ల బండ్లు, డ్రోన్ తో స్పేయర్, ట్రాక్టర్ కంప్రెసర్ తదితర యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి రెండు ఆవులను అందజేస్తామని, రైతులు కోళ్ల షెడ్డును అని కూడా నిర్మించుకోవచ్చున్నారు. రవాణా రంగానికి సంబంధించి మినీ వ్యాన్, ఈ- ఆటో తదితరాలను అందజేస్తామని, పరిశ్రమల రంగంలో మ్యాంగో జల్లి తయారీ తదితరులు ఉంటాయని, ఫ్లోర్ మిల్లు కూడా పెట్టుకోవచ్చని అన్నారు. సర్వీస్ రంగంలో ద్విచక్ర వాహనాల రిపేరు, ఆటో సర్వీసింగ్, వాచ్ రిపేర్లు, ఎంబ్రాయిడరీ వర్క్, బార్బర్ షాప్, బ్యూటీ పార్లర్, కేటరింగ్ యూనిట్లు, మెకానిక్ షాపులు, డ్రై ఫ్రూట్స్ సెల్లింగ్ షాపులు, మైక్ సిస్టం, బ్యాటరీ సర్వీసింగ్ షాప్, ప్లంబర్, సెల్ ఫోన్ రిపేర్లు తదితరులు ఉంటాయని వివరించారు. వీటికి 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. బీసీలకు 21 జనరిక్ షాపులు మంజూరయ్యాయి పేర్కొన్నారు. 8 లక్షల రూపాయలు యూనిట్ దరగా నిర్ణయించారని, నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుందని, నాలుగు లక్షల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ట్రాక్టర్ యూనిట్ ధర 80,000 కాగా, 20,000 రూపాయలు సబ్సిడీ ఉంటుందని 60 వేల రూపాయలను బ్యాంకులో రుణంగా ఇస్తారన్నారు. రెండు ఆవులకు యూనిట్ రెండు లక్షలు రూపాయలు గాక 75 వేల రూపాయలు సబ్సిడీ ఉంటుందని, 1.25 లక్షల రూపాయలు బ్యాంకుకు తిరిగి చెల్లించాలని, పౌల్ట్రీ ఫారం యూనిట్ ధర 5 లక్షల రూపాయలు కాగా రెండు లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుందని, మూడు లక్షల రూపాయలు బ్యాంకు రుణం తిరిగి చెల్లించాలన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ జిల్లాలోని బ్యాంకు అధికారులతో సమావేశమై చర్చించారని, బ్యాంకు అధికారులు కూడా బీసీ కార్పొరేషన్ కింద లబ్దిదారులకు రుణాలు ఇవ్వడానికి అంగీకరించాలన్నారు. మంజురైన యూనిట్లను రుణ మేళాలు నిర్వహించి అందజేస్తామన్నారు. ఇందుకు దరఖాస్తులకు సంబంధించి ఇంకా ఆన్ లైన్ ఓపెన్ కాలేదని, ఓపెన్ అయిన తర్వాత ఆన్ లైన్ ద్వారా ఏపిఓబిఎంఎంఎస్ పోర్టరు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారుడు కుల ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకుపాసు బుక్ తో పాటు ఫోన్ నెంబరు జత చేయాల్సి ఉంటుందని బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి వివరించారు.