జిల్లా వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణ
పాడి రైతులకు అండగా నిలివడానికి సదస్సులు కూడా
పశువులకు ఉచితంగా వైద్యసేవలు, ఆపరేషన్లు
పశువులకు, దూడలకు నట్టల నివారణ మందు
పశువులకు వ్యాధి నిరోధక టీకాలు
"ఆంధ్రప్రభ బ్యూరో" తో పశుసంవర్థక శాఖ జేడి ప్రభాకర్
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. గురువారం ఆయన చిత్తూరులో 'ఆంధ్రప్రభ బ్యూరో'తో మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ సేవలను ప్రజలకు మరింత తీరువ చేయడానికి ఈనెల 20వ తేదీ నుంచి పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభమయ్యాయని, ఈ శిబిరాలు ఈనెలాఖరు వరకు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కోటమి ప్రభుత్వం పశు పోషణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందుకు తగిన నిధులను కేటాయించి, పశుసంవర్ధక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా పశువుల ఆరోగ్యానికి, ఉత్పాదన పెంచడానికి, వ్యాధులను నియంత్రించడానికి, పశు పోషణ ఖర్చులను తగ్గించి, పాడి రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు.
ఉచిత పశు ఆరోగ్య శిబిరాలలో వైద్యులు ఉచితంగా పశువులను పరీక్షించి వైద్య సేవలు అందిస్తారన్నారు. తేలికపాటి శాస్త్ర చికిత్సలు చేస్తారని, ఎదకురాని, చూలుకట్టని, ఇతర గర్భకోశ వ్యాధులను పరీక్షించి తగిన వైద్యం అందిస్తారని తెలిపారు. ఎదలో ఉన్న పశువులను గుర్తించి కృత్రిమ గర్భధారణ చేస్తారని, చూడి పరీక్షల నిర్వహించి శాస్త్రీయ సూచనలు రైతులకు ఇస్తారన్నారు. ఈ శిబిరాలలో పశువులకు, దూడలకు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును ఉచితంగా తాగిస్తారన్నారు. క్రమం తప్పకుండా జీవాలు దూడలకు నట్టల నివారణ మందును తాపిస్తే బరువు పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. పాడి పశువులకు నట్టల నివారణ మందు తాపిచడం వలన పాల ఉత్పత్తి తోపాటు పునరుత్పత్తి శక్తి కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ శిబిరాలలో సామూహికంగా పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తారని, గొర్రెలు మేకలకు ఉచితంగా బొబ్బ వ్యాధి నివారణ టీకాలు వేస్తారన్నారు. తద్వారా వాటిల్లో వ్యాధినిరోధక శక్తితో పాటు పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. అలాగే కోళ్లకు వ్యాధి నిరోధక టీకాలు కూడా ఉచితంగా వేస్తామన్నారు. ఈ శిబిరాలుతోపాటు పాడి రైతులకు పశు పోషణ మీద శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై పశువిజ్ఞానం మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాడి రైతులకు అండగా నిలవడానికి గోకులాలను నిర్మిస్తున్నామని, బహువార్షిక పశు క్షేత్రాలను ఏర్పాటు చేయడం, పశువులకు రాయితీ మీద దాణా సరఫరా, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాల ద్వారా వైద్య సేవలు, లింగ నిర్ధారిత వీర్యాన్ని సరఫరా చేయడం, పిండమార్పిడి పరిజ్ఞానం వంటి పథకాలను జిల్లాలో అమలు చేస్తున్నట్లు వివరించారు. పశువులు ప్రమాదవ శాసన మరణిస్తే పాడి రైతులను ఆర్థికంగా ఆడుకోవడానికి మరణించిన పశువుకు భీమా సౌకర్యం కలగచేస్తున్నట్లు తెలిపారు. మేలు జాతి సంకర దేశీయ పశువులు ప్రమాదవశాత్తున మరణిస్తే ఒక్కొక్కదానికి 30 వేల రూపాయలు, నాటు పశువులకు 15 వేల రూపాయల పదు బీమా చెల్లిస్తామన్నారు. ఒకటిన్నర సంవత్సరం పైబడిన సంకరజాతి దేశీయ ఎద్దులు, దున్నలకు కూడా ఒక్కొక్కదానికి 30 వేల రూపాయలను, రెండు సంవత్సరాలు పైబడిన నాటు ఎద్దులు, దున్నలకు 15 వేల రూపాయలను బీమా గా చెల్లిస్తామని వివరించారు. ఒక కుటుంబానికి లేదా ఒక రేషన్ కార్డుకు సంవత్సరం మీద ఐదు పశువులు లేక 50 మేకలు గొర్రెలకు బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. ఆరు నెలలు ఆ పైన వయస్సు గల గొర్రెలు, మేకలకు, పందులకు 6000 రూపాయలను నష్టపరిహారంగా చెల్లిస్తామని వివరించారు. పశు పోషణకు, పోషకాహార భద్రత కల్పించడానికి దాణా, పచ్చగడ్డి, ఎండుగడ్డి విడివిడిగా మెపడం శ్రమతో కూడుకున్న పని అని, దీనికి ప్రత్యామ్నాయంగా అన్ని మేపులను తగిన నిష్పత్తిలో కలిపి సంపూర్ణ మిశ్రమ దానాలు పాడి రైతులకు 60 శాతం సబ్సిడీతో అందజేస్తున్నామన్నారు. అలాగే పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితితో అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తున్నామని, వీటి ద్వారా ఎటువంటి హామీ లేకుండా సంవత్సరానికి 7 శాతం వడ్డీతో గరిష్టంగా 1.6 లక్షల రూపాయల వరకు పాడి రైతులకు రుణాన్ని అందజేస్తున్నామని తెలిపారు. లింగ నిర్ధారిత వైద్యము ద్వారా 50 శాతం ఖచ్చితత్వంతో మేలు జాతి పెయ్య దూడలను పుట్టించడం, తక్కువ సమయంలో ఎక్కువ మేలు జాతి దూడలు పుట్టించడం ద్వారా మేలు జాతి పశుసంపద అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు పాడి రైతులు ఒక్కొక్క పశువుకు 500 చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పశువులకు జన్యు ప్రమాణాలను పెంచడానికి, పట్టిపోయిన పశువుల నుండి కూడా మేలు జాతి తోడలను ఉత్పత్తి చేయడానికి, పిండ మార్పిడి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ పరిజ్ఞానం ద్వారా పశువులలో ఈతకు పశువులకు గర్భాదారణ చేయవచ్చని, ఈతకు ఈతకు మధ్య దూరం తగ్గించడం తద్వారా అధిక పశు ఉత్పత్తులను సాధించి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాల్లో జరుగుతున్న పశు ఆరోగ్య శిబిరాలను, సదస్సులను రైతులు వినియోగించుకుని లబ్ధి పొందాలిసిందిగా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ కోరారు.
పో రై గంగ 2 జేడి డాక్టర్ ప్రభాకర్