జిల్లా రైతులకు కలిసిరాని 2024
తొలి తొమ్మిది నెలలు జిల్లాలో కరువు కాటకాలు
చివరి మూడు నెలలు భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం
రైతులను నట్టేట ముంచిన మామిడి పంట
ఇంకా మామిడి రైతులకు బకాయిలు చెల్లించని ఫ్యాక్టరీలు
కరువు మండలాల్లో రైతులకు అందని నష్టపరిహారం
జిల్లాలో భారీగా తగ్గిన పంటల విస్తీర్ణం
2025 సంవత్సరం మీదనే రైతుల ఆశలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
2024 సంవత్సరం జిల్లాలోని రైతాంగానికి ఏమాత్రం కలిసి రాలేదు. తొలుత తొమ్మిది నెలలు చిత్తూరు జిల్లాలో కరువు కాటకాలు రాజ్యమేలాయి. చివరి మూడు నెలలు జిల్లాల్లో పడిన భారీ వర్షాలు రైతాంగానికి భారీ నష్టాన్ని కలగచేశాయి. మామిడి పంట ఈ సంవత్సరం రైతులను నట్టేట ముంచింది. గిట్టుబాటు ధర లేకుండా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకా రైతులకు మామిడి బకాయిలు చెల్లించాల్సి ఉంది. కరువు కాటకాలతో చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ పంటలు గణనీయంగా తగ్గాయి. ఖరీఫ్ సీజన్ లో వేరుశనగతోపాటు అన్ని రకాల పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగా పూర్తిగా ఎండిపోయాయి. రైతులకు పెట్టుబడి కూడా దక్కలేదు. జిల్లాలోని 16 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినా, ఆ రైతులకు కూడా ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదు. పెంగాల్ తుఫాన్ జిల్లాను వణికించింది. జిల్లాలోని రైతులు భారీగా పంటలను నష్టపోయారు. మరోవైపు రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రైతులు అన్ని రకాల పంటలకు సొంత డబ్బులతో బీమా ప్రీమియం చెల్లించాలని కోరింది. మొత్తం మీద 2024 సంవత్సరం రైతులకు చేసిన మేలు ఏమీ లేదు. కష్టనష్టాలు, కడగండ్లను మిగిల్చింది.
*భారీగా నష్టపోయిన మామిడి రైతులు*
జిల్లాలో సుమారుగా లక్షా, 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో సగటున 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్చిఉంది. సగటున జిల్లాలో సంవత్సరానికి 5 లక్షల టన్నుల మామిడి దిగిబడి రావల్చి ఉండగా, అయితే వ్యతిరేక వాతావరణం కారణంగా గత సంవత్సరం 10 శాతం పంట వచ్చింది. అకాల వర్షం, ఎదురు గాలుల కారణంగా, పంట చాలా వరకు వేలరాలింది. 20 శాతం కూడా దిగిబడి లేదు. దీంతో మామిడికి మంచి గిట్టుబాటు ధర వస్తుందని రైతులు భావించారు. రైతుల ఆశించిన విధంగానే మామిడి టన్ను 30 రూపాయలతో ప్రారంభమైంది. జిల్లాలోని మామిడి ఫ్యాక్టరీలు కూడా 28 రూపాయలతో కొనుగోలు చేయడం ప్రారంభించారు. మామిడి ఫ్యాక్టరీ యజమానులు క్రమంగా మామిడి ధరలను తగ్గిస్తూ వచ్చారు. చివరకు టన్ను ధర 23 వేల రూపాయలు చేరుకుంది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదివారం ఉద్యానవన శాఖ అధికారులతో, మార్కెట్ కమిటీ అధికారులతో మాట్లాడి మామిడి ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తోతాపురి మామిడికి టన్నుకు ముప్పై వేల రూపాయలు తగ్గకూడదని పేర్కొన్నారు. ఎవరైనా 30 వేల రూపాయలు కంటే తక్కువ కొనుగోలు చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా, ఫాక్టరీలు ఖాతరు చేయలేదు. చివరకు 18 రూపాయలతో మామిడి సేజన్ ముగిసింది. కొన్ని ఫ్యాక్టరీలు ఇంకా రైతులకు మామిడి డబ్బులు ఇవ్వలేదు.
*కరవు కౌగిట్లో జిల్లా - ఎండిపోయిన వేరుశనగ*
*దంచికోట్టిన తుఫాన్ - భారీగా నష్టం*
నవంబరు నలలో వచ్చిన పెంగాల్ తుఫాను జిల్లాని అతలాకుతలం చేసింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. దీంతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అకాల వర్షం కారణంగా చిత్తూరు జిల్లాలో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. 500 హెక్టార్లలో వరి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 100 హెక్టార్లలో టమాటా వంటి ఉద్యానవన పంటలు నీట మునిగాయి. జిల్లాలో రెండు ఆవులు, రెండు దూడలు, ఒక గొర్రె వర్షాల కారణంగా మృతి చెందాయి. వరి, ఉద్యానవన పంటలు కోత దశలు నీటిపాలు అయ్యాయి. పెంగాల్ తుఫాన్ కారణంగా చిత్తూరు జిల్లాలో సుమారు 500 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 15 మండలాల్లో 85 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 810 మంది రైతులు నష్టపోయారు. జిల్లాలో తవణంపల్లి, పెనుమూరు, పాలసముద్రం, నగరి, విజయపురం, నిండ్ర, గంగాధర నెల్లూరు, సోమల, గంగవరం, పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లి, బైరెడ్డిపల్లి, శాంతిపురం మండలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో 446 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. వుద్ధులు 11 హెక్టార్లలో, సజ్జలు రెండుహెక్టార్లలో, వేరుశనగ 21 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఎక్కువ పంటలు పంట కోత దశలో ఉండగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెంగాల్ తుఫాన్ కారణంగా చిత్తూరు జిల్లాలో 100 యాక్టర్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని 38 గ్రామాలలో 152 మంది రైతులు నష్టపోయారు. కుప్పం, శాంతిపురం, వీకోట, బైరెడ్డిపల్లి, చౌడేపల్లి, పులిచర్ల, సోమల, రొంపిచర్ల, గంగవరం, వెదురుకుప్పం మండలాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. టమాటా పంట 18.8 హెక్టార్లలో, బంగాళాదుంప 69 హెక్టార్లలో, వంకాయ పంట ఒక హెక్టార్లలో, మిరపకాయలు ఒక హెక్టార్లలో, పొట్లకాయలు 4.8 హెక్టార్లలో, చిక్కుడుకాయ 2 హెక్టార్లలో, తమలపాకులు 0.1 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. చాలా వరకు పంటలు కోత దశలో దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో రెండు ఆవులు, రెండు దూడలు, ఒక గొర్రె మృతి చెందినట్లు జిల్లా కేంద్రానికి నివేదికలు అందాయి. పెద్దపంజాని మండలం శివాడి గ్రామంలో ఒక ఆవు, ఒక దూడ, చౌడేపల్లి మండలం చింతమాకులపల్లిలో ఒక ఆవు, నిండ్ర మండలం అన్నూరు ఎస్టీ కాలనీలో ఒక గొర్రె, ఇరుగువాయి హరిజనవాడలో ఒక దూడ చనిపోయింది. ఇలా రైతులకు 2024 సంవత్సరం అన్ని రకాలుగా నష్టాలనే మిగిల్చింది. 2025 సంవత్సరం అయినా రైతులకు కలసి వస్తుందని ఆశిద్దాం.