భారీ వర్షాల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం
ఉదయం నుండి జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు
జిల్లా అధికారులతో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సమీక్షలు
జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి అధికారుల వరకు అప్రమత్తం
మండల స్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు
క్షేత్ర స్థాయిలో నష్టాలపై నివేదిక కోరిన అధికారులు
నష్టాన్ని ముందుగా అంచనా వేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఫెంగాల్ తుఫాన్ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. తూర్పు మండలాల్లో భార్య నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో ఒక మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి. నగిరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గంలో మాత్రం భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లడానికి వీలు లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా డివిజన్ మండల గ్రామ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యార్థిని జిల్లా అధికారులను, ఆర్ డి ఓ లు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు నగిరి మండలంలో 89.2 మిల్లీమీటర్లు, నిండ్ర మండలంలో 77.4, కార్వేటి నగరంలో 62.4, రొంపిచర్ల 36.8, పాలసముద్రంలో 40.4, ఎస్ఆర్ పురం 33.6, పులిచెర్ల 33.2, విజయపురంలో 60.2 మిల్లీమీటర్లు, ఐరాల మండలంలో 27.4, పెనుమూరులో 24.4, చిత్తూరు రూరల్ లో 18.8, గంగాధర నెల్లూరులో 17.2, చిత్తూరు అర్బన్ లో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వాతావరణ శాఖ వారి హెచ్చరికలతో జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యం లో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విధ్యాధరి జిల్లా అధికారులు,ఆర్డీఓ లు,తహసిల్దార్ లు ఎంపీడీఓలతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా చెరువుల కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని,వాగులు వంకలు కాలువల వద్ద అప్రమత్తం గా ఉండాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9491077356 ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు మొదలు నియోజకవర్గ, మండల, సచివాలయ,గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారి సిబ్బంది వారి వారి ప్రధాన కార్య స్థానాలలో అందు బాటులో ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు చేసే రైతులను అప్రమత్తం చేయాలని పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి రైతులను అప్రమత్తం చేయాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడా పశు నష్టం జరగకుండా పశు సంవర్ధక సహాయకులు పాడి రైతులకు అవగాహన పెంచాలని వాటి సంరక్షణ బాధ్యత పూర్తిగా చూసుకునేలా తెలియజేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం అయితే వెంటనే దానిని పునరుద్ధరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విపత్తు సమయంలో ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది మరింత బాధ్యతతో వారి విధులను నిర్వర్తించాలన్నారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా కురిచే అవకాశం ఉంది. దీంతో మండల గ్రామస్థాయి అధికారులు తమ కేంద్రంలోని ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, పీ హెచ్ సి లలో సకాలంలో డాక్టర్లు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని అవసరమైన మందులను అందుబాటులో ఉండాలని ఈ దిశగా పనిచేయాలని డిఎం అండ్ హెచ్ ఓ ను కలెక్టర్ ఆదేశించారు.
పూరి గుడిసెలు, శిధిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి అక్కడ వారిని పునరావాస కేంద్రాలకు తరలించేలా సమీపంలోని పాఠశాలలు, కళాశాలలను పునరావాస కేంద్రాలుగా గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు..
జిల్లా లో భారీ వర్షాల కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండడంలో భాగంగా మండలాల వారీగా కల్వర్టులు, బ్రిడ్జిలు, కాజ్ వే ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు