గత ప్రభుత్వ పాలనలో డిసిసిబిలో భారీగా అవినీతి, అక్రమాలు
ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్సీ దొరబాబు
.విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
విచారణకు ఆదేశాలు జారీచేసిన జిల్లా సహకార శాఖ అదికారి
సహకార శాఖ రిజిస్టార్ కు చేరిన విచారణ నివేదిక
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో భారీ ఎత్తున అవినీతి అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా రుణాలను మంజూరు చేయడం, రుణాలు మంజూరు చేసిన వారి నుంచి లబ్ధి పొందడం, ఒకే కుటుంబానికి కోట్లాది రూపాయలు రుణాలను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులు, అటెండర్ల నియమకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఫిర్యాదులు ఉన్నాయి. బ్యాంకుకు కొత్త భవనాలు నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాల మీద చిత్తూరు సహకార డెయిరీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం మీద సహకార శాఖ అధికారులు విచారణ జరిపి విచారణ నివేదికను సహకార సంఘాల రిజిస్టార్ కు అందజేసినట్లు తెలుస్తోంది.
వైసిపి ప్రభుత్వం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ పద్దతిలో పాలక మండలిని నియమించింది. ఈ పాలకమండలి సభ్యులు భారీ ఎత్తున అవినీతి, అవకతలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వి కోటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మందికి రుణాలను మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన పిఎస్ నాగరాజు, పిఎస్ మమత, పిఎస్ లక్ష్మి, పి ఎస్ హరి, పి ఎస్ మంజులకు ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయలు చొప్పున ఆ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలను రుణాలకు మంజూరు చేశారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు విస్తరణలో భాగంగా వైసిపి పాలనలో జిల్లాకు 50 పోస్టులు మంజూరయ్యాయి. వీటికి ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులను ఎంపిక చేశారు .అయితే ఇంటర్వ్యూ నామమాత్రంగా జరిగిందని, ముడుపులు సమర్పించుకున్న అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టులలో 12 ఉద్యోగాలను సొసైటీ ఉద్యోగులకు కేటాయించారు. వారి నుండి కూడా భారీగా వసూలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ పేరుతో వసూలు చేసిన ఈ మొత్తాలను అధికారులు, అనధికారులు వాటాలు వేసుకున్నారని తెలుస్తోంది. ఉద్యోగాల కోసం ముడుపులు చెల్లించిన వారిలో కొందరికి ఉద్యోగాలు రాలేదు. ఆయనా, వారి నుండి వసూలు చేసిన మొత్తాలు వారికి తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. వారు గత పాలకవర్గం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది. అలాగే వివిధ ఆరోపణల మీద ఉద్యోగాల నుంచి తొలగించిన, సస్పెండ్ అయిన ఉద్యోగుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని వారికి తిరిగి ఉద్యోగాలను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఔట్సోర్సింగ్ ద్వారా బ్యాంకులకు పది మంది అటెండర్ లను, వాచ్మెన్లను తీసుకున్నారు. ఇందులో కూడా అవినీతి జరిగిందని, అందులో ఎనిమిది మంది పనిచేస్తుండగా పదిమందికి జీతాలు అందజేశారని ఆరోపణలు ఉన్నాయి. పాడి ఆవులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 20 కోట్ల రూపాయల రుణాలను అందజేసింది. వీటిని ఎక్కువగా వైసిపి నాయకులకు, కార్యకర్తలకు అందజేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా పాడి ఆవులు లేకుండానే వారికి రుణాలను ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. వైసిపి నియమించిన పాలక మండలిసభ్యులు బినామీ పేర్ల మీద పది కోట్ల రూపాయల రుణాలు వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై విచారణ ప్రారంభం అయిన తరువాత 1.5 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించినట్లు సమాచారం. బ్యాంకు ద్వారా మోబిలైజేషన్ సంఘాలకు ఇచ్చిన కోటి రూపాయల రుణం వడ్డీతో కలుపుకొని రెండు కోట్లు అయినట్టు తెలుస్తోంది. ఈ మొత్తాలను ఏకపక్షంగా బ్యాంకు రద్దు చేసినట్లు సమాచారం. ఇందులో కూడా భారీగా అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు బ్రాంచ్ లలో నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులకు రుణాలు ఇచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. వరదయ్యపాలెం ఎస్ హెచ్ జిలో కోటిన్నర రూపాయల స్వాహా జరిగినా, ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పుత్తూరు, నగరి, తిరుచానూరు బ్రాంచ్ లలో కూడా అప్పటి పాలకమండలి సభ్యులు రాజకీయ ఉద్దేశంతో పెద్ద మొత్తాలలో రుణాలు ఇప్పించారని ఫిర్యాదులు ఉన్నాయి. నగిరి, బయప్పగారిపల్లి, రొంపిచర్ల పెట్రోల్ బంకు నిర్మాణంలో అవినీతి జరిగినట్లు విమర్శలు వచ్చాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కు సంబంధించిన భవనాల నిర్మాణంలో కూడా నిబంధనల ప్రకారం ఆన్ లైన్ టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా టెండర్లను కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పలమనేరులో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ఒక బ్రాంచ్ ఉంది. మరో బ్రాంచ్ నిమిత్తం 90 లక్షలు మంజూరు చేశారు. అయితే ఆ మొత్తాన్ని బినమిగా ఒక ఉద్యోగికి మంజూరు చేయడంతో భవన నిర్మాణం నత్త నడకన నడుస్తోంది. కొంగారెడ్డి పల్లెలో గత మూడేళ్ల కిందట లాకర్లు, స్ట్రాంగ్ గదులు ఏర్పాటు చేశారు. అవి ఇంతవరకు వినియోగంలోకి తీసుకొని రాలేదని ఆరోపణలు ఉన్నాయి. చౌడేపల్లిలో బ్యాంకు అద్దె భవనంలో నడుస్తున్నాడంతో 58 లక్షల రూపాయలతో కొత్త భవనాన్ని నిర్మించారు. కొత్త భవనం ప్రజలకు అందుబాటులో లేకుండా, చెరువు వద్ద నిర్మించడంతో అది ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదని తెలుస్తోంది. అలాగే సదంలో బ్యాక్ కొత్త భవన నిర్మాణం కోసం 22న రూపాయలను విడుదల చేశారు. తర్వాత నిధులు విడుదల చేయకపోవడంతో, ఆ భవన నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ టెండర్రింగ్ విధానం అమలు చేయకుండానే ఈ భవన నిర్మాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయాల మీద మాజీ ఎమ్మెల్సీ దొరబాబు రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సహకార శాఖ అధికారి నాగవర్ధిని విచారణకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పై వచ్చిన ఆరోపణలతో ప్రధాన కార్యాలయంతో, సహా 12 బ్రాంచ్లలో అధికారులు తనిఖీలు చేసి, నివేదిక తయారు చేశారు. ఈ నివేదికను సహకార శాఖ రిజిస్టార్ కు అందజేశారు. అక్కడ నుంచి అందిన ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనునట్లు జిల్లా సహకార శాఖ అధికారి నాగవర్ధిని తెలిపారు.