11, నవంబర్ 2024, సోమవారం

సీనియర్లకు పదవీ యోగం లేదా?

యువతకు ప్రాధాన్యం ఇస్తున్న అధిష్టానం 

తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్న సీనియర్లు 

సీనియర్ల సేవలు అవసరమనే అభిప్రాయం

నామినేటెడ్ పోస్టులపై సీనియర్ల ఆశలు 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు జిల్లాలో కొందరు సీనియర్ టిడిపి నాయకులకు పదవులు రాకపోవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు కూడా యువకులకు ఎక్కువ భాగం కట్టబెట్టారు. అయితే పార్టీని నమ్ముకున్న సీనియర్ నాయకుల పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. వీరిని కావాలనే పక్కన పెట్టారని కొందరు అంటున్నారు. అయితే వారికి తగిన సమయంలో ఉన్నత పదవులు ఇస్తారని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పలువులు సీనియర్ నాయకులు నామినేటెడ్ పోస్టులపైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులలో సీనియర్ నాయకులకు ఎవరికి పదవుల రాకపోవడంతో భవిష్యత్తులో తమన్న పార్టీ గుర్తిస్తుందా లేదా అన్న అనుమానాలు సీనియర్ నాయకులలో వ్యక్తం అవుతోది. సీనియర్లకు పదవులు ఇవ్వకపోతే ప్రతిపక్షాల విమర్శలను ఎవరు తిప్పి కొడతారు అన్న మీద చర్చ జోరుగా జరుగుతోంది.


వైసిపి పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జిల్లాను తన అడ్డాగా మార్చుకున్నారు. తిరుగులేని అధికారం చలాయించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడును కూడ ఓడిస్తామని పదేపదే సవాలు చేశారు. అయితే అనూహ్యంగా రాష్ట్రంలో కూటమి గాలి వీయడంతో ఇక్కడ టిడిపి తిరుగులేని విజయం సాధించింది. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ఆరు చోట్ల టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. చిత్తూరు లోకసభ స్థానం టిడిపి కైవసం అయ్యింది. అయితే  పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విజయం సాధించారు. అలాగే ఆయన తమ్ముడు ద్వారకనాద రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా, కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపిగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి రోజా నగరిలో ఓడిపోయినా వైసిపి అధికార ప్రతినిధిగా నిత్యం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. మాజీ ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి కూడా అడపా దడపా విమర్శలు చేస్తున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైసిపి జిల్లా అధ్యక్షుడు అయ్యారు. ఆయన  ఘాటైన విమర్శలు సందిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. వీరిని సమర్థవంతంగా ఎవరు ఎదుర్కొంటారు అనే దానిపైన పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పార్టీని నమ్ముకున్న వారికి, విధేయులకు పదవులు ఇచ్చారు. అయితే వారు పూర్తి స్థాయిలో వైసిపి నేతలను ఎదుర్కోవడం సులభం కాదంటున్నారు. పెనుమూరు మండలానికి చెందిన బొల్లినేని రాజగోపాల్ నాయుడుకు టీటీడీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. ఒక మీడియా సంస్థ అధిపతి, ధార్మిక సంస్థ చైర్మన్ అయిన ఆయన రాజాకీయ వివాదాలకు దూరంగా ఉంటారు. చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలతను చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా నియమించారు. అయితే  గతంలో ఆమె కుటుంబ సభ్యులు రాజకీయ పోరుకు బలయ్యారు. కావున ఆమె మళ్ళీ తీవ్రస్థాయి రాజాకీయ పోరుకు సిద్దం కాక పోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్ అగ్నికుల చత్రియ కార్పోరేషన్ చైర్మన్ అయినప్పటికీ, వైసిపి నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. జిల్లా అధ్యక్షుడి హోదాల్లో కూడా ఆయన వివాదాలకు దూరంగా ఉంటున్నారు. కుప్పంకు చెందిన మునిరత్నం ఆర్టీసీ వైస్ చైర్మన్ గా, సదాశివం టిటిడి బోర్డు సభ్యునిగా ఉన్నారు. అయినా రాజాకీయ పోరుకు సిద్ధంగా లేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి బలమైన నాయకులను తయారు చేసుకోవలసిన అవసరం ఉందని అధిష్టానం భావిస్తోంది. పలమనేరు ఎమ్మెల్యే అమరనాద రెడ్డికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా నాయకులు కోరుకుంటున్నారు. మాజీ మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి వర్గంలో చోటు ఉంటుందని అందరూ భావించారు. అయితే ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకు రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇచ్చి జిల్లా బాధ్యత అప్పగిస్తారన్న వాదన వినిపిస్తోంది. చిత్తూరు మాజీ ఎమ్మేల్యే సి కె బాబు తొలినుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి వ్యతిరేకి. ఆయన నాలుగు సార్లు చిత్తూరు ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు తగిన పదవి ఇస్తే వైసిపి సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న వాదన వినిపిస్తోంది. మరో మాజీ ఎమ్మేల్యే ఏ ఎస్ మనోహర్ సేవలను వాడుకుంటే మంచిదని అంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులందరినీ ఒక తాటి మీదకు తీసుకుని వచ్చి పార్టీ విజయానికి నాంది పలికిన వ్యక్తి దొరబాబు. సీకే బాబు క్రియాశీలకమైన తర్వాతనే చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆత్మస్థైర్యం వచ్చింది. పార్టీ అభ్యర్థి విజయానికి మాజీ ఎమ్మెల్యే ఏ ఎస్ మనోహర్ అండదండలు అందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కరోనా సమయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేసిన కాజుర్ బాలాజీ పార్టీకి, కార్యకర్తలకు అండగా నిలిచారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి న్యాయవాది సురేంద్ర కుమార్ నిస్వార్ధంగా పార్టీ అభివృద్ధి కోసం తన సేవలను అందిస్తున్నారు. మరో అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులు మీద ప్రత్యర్థుల కేసులు పెట్టడంతో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇంకొక అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ నిత్యం ప్రజా సమస్యలపైన, ప్రతిపక్ష విమర్శలపైన ధీటుగా స్పందిస్తున్నారు. మరొక టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంలో దిట్ట. ప్రతిపక్షం మీద విమర్శలు చేయడానికి అందరూ భయపడుతున్న రోజుల్లో జగన్, పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, రోజా తదితరులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఊపు తెచ్చారు. ఇలాంటి సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తే వీరు పార్టీకి అండగా ఉంటారని భావిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టే సామర్థ్యం వీరికి ఉందని భావిస్తున్నారు. వీరి సేవలను పార్టీ వినియోగించుకుంటే మంచిదని అభిప్రాయం సార్వత్రా వ్యక్తం అవుతుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *