22, నవంబర్ 2024, శుక్రవారం

వాలంటీర్ల వ్యవస్థకు మంగళం !


ఈ మేరకు అసెంబ్లీలో ప్రభుత్వ ప్రకటన

ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన 5,400 మంది వాలంటీర్లు 

రాజీనామా చేయని వాలంటీర్లు 4,200 మంది

ఏప్రిల్ నెల నుండి వాలంటీర్లకు జీతాలు కట్ 

విధులు అప్పగించని కూటమి ప్రభుత్వం 

వాలంటీర్లు లేకుండానే జరుగుతున్న పింఛన్ల పంపిణీ

ఇంటర్వ్యూలు, మెరిట్, రిజర్వేషన్లు లేకుండా వాలంటీర్ల భర్తీ

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సేవలందించిన వార్డు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడనుంది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి డోల శ్రీబాల ఆంజనేయస్వామి ఒక ప్రకటన చేశారు. తమను కొనసాగిస్తామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వాలంటీర్లకు దీంతో నిరాశే మిగిలింది. జిల్లాలో అత్యధిక మంది వాలంటీర్లు ఎన్నికల సమయంలో వైసీపీ సేవలో తరచడానికి రాజీనామాలు సమర్పించారు. వైసిపి నాయకులు పట్టు పట్టి మరీ వారి చేత రాజీనామాలు చేయించారు. మరి కొంత మంది వాలంటీర్లు వైసీపీ నాయకుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజనామాలు చేయకుండా కొనసాగడానికి సిద్ధమయ్యారు. అయితే వైసిపి ప్రభుత్వం పాలనలో నియమితులైన వాలంటీర్లను కొనసాగించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్ల పంపిణీ ఇతర సేవలను సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్లను నిమించారు. వారికి నెలకు 5000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం చెల్లించారు. వాలంటీర్ల  నియామకంలో ఇంటర్వ్యూలు, మెరిట్, రిజర్వేషన్లు వంటి పద్ధతులు ఏమి పాటించలేదు. వైసీపీ నాయకులకు అనుకూలంగానున్న వ్యక్తులను వాలంటీర్లుగా నియమించారు. జిల్లా వ్యాప్తంగా 9,600 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు నియమితులయ్యారు. వీరు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని సర్వే చేసి అందజేయడంతో పాటు సామాజిక పింఛన్లు పంపిణీలో కీలక పాత్రను పోషించారు. ఎన్నికల సమయంలో వీరి సేవలను ఉపయోగించుకోకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి నెల నుంచి వాలంటీర్ల సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఆగిపోయాయి. గత సంవత్సరం ఆగస్టు నెలలో వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉండగా, జగన్ ప్రభుత్వం చేయలేదని అసెంబ్లీలో మంత్రి తెలిపారు. దీంతో గత సంవత్సరం ఆగస్టు నుంచి వాలంటీర్ల వ్యవస్థ అమలులో లేదని, వారిని కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వైసిపి నాయకుల చేత నియమితులైన వాలంటీర్లు ఎన్నికల సమయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవలో తరించారు. ఇందుకు అనుగుణంగా మండలాల్లో భారీ ఎత్తున వాలంటీర్లు మూకుమ్మడిగా  రాజీనామాలు చేశారు. జిల్లావ్యాప్తంగా 5,400 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. జిల్లాకు చెందిన ఒక పెద్ద మంత్రి ఆదేశానుసారం జిల్లాలో వాలంటీర్లు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఆయన ఆదేశం ప్రకారం నియోజకవర్గ, మండల  వైసిపి నాయకులు మండలాల వారీగా వాలంటీర్లు చేత రాజీనామాలు చేపించారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లు అధికార వైసిపి అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలలో పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. ఎవరైనా వాలంటీర్లు రాజీనామా చేయడానికి విముఖత వ్యక్తం చేస్తే, నాయనో, భయానో వారి చేతకూడా రాజీనామాలు చేపించారు. మేమే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చింది, ఇప్పుడు రాజీనామా చేయమంటున్నాం చేయండి అని ఖరాఖండిగా ఆదేశించారు. మళ్ళి తామే అధికరలోకి వస్తామని, అప్పుడు మీ ఉద్యోగాలు మీకే ఉంటాయని నమ్మబలికారు. ఒక వేళ రాజీనామాకు ఒప్పుకోకుంటే, మళ్ళి ప్రభుత్వం వస్తే, మార్పు తప్పదని హెచ్చరించారు. కొందరు అధికారులు కూడా వైసిపికి అనుకూలంగా ఉంటూ, వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేపించారు. పైకి మాత్రం అంతా స్వచ్చందంగా రాజీనామాలు చేస్తున్నట్లు వాలంటీర్ల చేత చెప్పించారు. చిత్తూరు జిల్లాలో 9,600 మంది వాలంటీర్లను ప్రభుత్వం భర్తీ చేయగా, ఇందులో 5,400 మంది  రాజీనామా చేసినట్లు సమాచారం.  మిగిలిన వారి చేత కూడా రాజీనామాలు చేపించడానికి అప్పట్లో ముమ్మరంగా వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. రాజీనామాలను నిలువరించడానికి కూటమి అభ్యర్థుల ప్రయత్నాలు జిల్లాలో ఫలించలేదు.  వాలంటీర్ల విషయమై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాలంటీర్లు అందర్నీ కొనసాగిస్తామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయినా వాలంటీర్ల రాజీనామాలు ఆగలేదు. మండలంలో వాలంటీర్లందరులు మూకమ్మడిగా రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసి అధికార వైసిపి పార్టీ ప్రచారంలో పాల్గొంటామని ,అభ్యర్థులను గెలిపించుకుంటామని బహిరంగంగా ప్రకటించారు.  ఐరాల మండలంలో  వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. సదం మండలంలో 184 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా ఒకే రోజు  రాజనామా చేశారు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలో కూడా 50 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. పాకాల మండలంలో 74 మంది, వి. కోటలో 14 మంది రాజీనామాలు చేశారు. పూతలపట్టు మండలంలో 50 మందికి పైగా  వలంటీర్లు రాజీనామా బాట పట్టారు. పాకాలలో కూడా  ఒకే రోజు 74 మంది రాజీనామా చేశారు. వి. కోట మండలం, కుంభార్లపల్లి గ్రామ సచివాలయ వాలంటరీలు 14 మంది ఎంపీడీవో ఆఫీస్ లో రాజీనామా పత్రం సమర్పించారు. వాలంటరీలు ఎలక్షన్ విధులలో పాల్గొనకూడదని, పింఛన్ల పంపిణీ చేయకూడదని  నియమాలు రావడంతో అందుకు నిరసనగా మేము రాజీనామా చేస్తున్నామని తెలిపారు. మేము నాలుగు సంవత్సరాలుగా వాలంటరీగా పని చేసి ఎనలేని సేవ ప్రజలకు అందించామని, దీనికి కారణము మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మేము ముఖ్యమంత్రిగా చూడాలనీ అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.  ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి వాలంటరీ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు.  పలు మండలాల్లో వాలంటీర్ల రాజీనామా పరంపర కొనసాగింది. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు వాలంటీర్ల వ్యవస్థను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని నిరసిస్తూ వాలంటీర్లు రాజీనామాలు  చేశారు. అయితే రాజనామాలు చేసిన తరువాత వాలంటీర్లు అధికార పార్టీ సేవలో తరించారన్నది బహిరంగ రహస్యమే. ఎందుకోసం ఒక్కొక్క వాలంటీర్లకు 10,000 నుంచి 20వేల రూపాయలను వేతనంగా వైసిపి నాయకులు సొంత నిధుల నుంచి అందజేశారు. ఎన్నికలలో లబ్ధి పొందడానికే అధికార పార్టీ నాయకులు వలంటీర్ల మీద వత్తిడి తీసుకొని వచ్చి వారి చేత రాజీనామాలు చేపిస్తున్నారని వారి వలలో పడవద్దని  తెలుగుదేశం పార్టీ నాయకులు హితవు పలికారు.  మళ్ళి ప్రభుత్వం వస్తే, తిరిగి వాలంటీరీ ఉద్యోగాలు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నట్లు తెలిసింది.  రాజీనామా చేస్తున్న వాలంటీర్లు రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించారు.  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏప్రిల్ ఒకటవ తారీఖున వాలంటీర్ల చేత పింఛన్ల పంపిణీ నిలుపుదల చేశారు. వాలంటీర్లు రాజీనామాలు చేస్తుండటం కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని 33 మంది వాలంటీర్లను జిల్లా కలెక్టర్ తొలగించారు. చిత్తూరు మున్సిపాలిటీలో 18, పలమనేరులో 12 మందిని, గుడిపాల మండలంలో ముగ్గురు వాలంటీర్లను తొలగించారు. వాలంటీర్ల మీద కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిష్కరించడం జిల్లా యంత్రాంగానికి తలకి మించిన భారమే అయ్యింది.  ప్రభుత్వం భర్తీ చేసిన వారిలో ఎక్కువమంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు చేశారు. అంతే కాదు ఆయన మానసిక పుత్రికగా కూడా అభివర్ణిస్తుంటారు. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ వలంటీర్లు వ్యవస్థ వైసిపికి బాగా ఉపయోగపడింది. ఎన్నికల వేళ వాలంటీర్లు ద్వారా ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని టీడీపీ జనసేన, బీజేపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఫిర్యాదు రావడంతో స్పందించిన ఎన్నికల కమిషన్‌ వాలంటీర్లు సేవలు వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ప్రభావం పింఛన్‌ పంపిణీపై పడింది. మొదటి నుంచి కూడా ఈ వలంటీర్ వ్యవస్థపై అనేక అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలా మంది వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికే ఈ బాధ్యతలు అప్పగించారని మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. సీఎం జగన్‌తోపాటు చాలా మంది మంత్రులు, వైసీపీ పెద్దలు కూడా దీన్ని ధ్రువీకరించారు. వాలంటీర్లలో చాలా మంది వైసీపీ సానుభూతిపరులేనంటూ చాలా మీటింగ్స్‌లో మంత్రులే ప్రకటించారు.  ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది ఈ వ్యవస్థపై అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి.  అదే టైంలో కొందరు వలంటీర్లు నేరుగా వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో మీటింగ్‌లలో పాల్గొనడంతో వారిపై ఫిర్యాదులు మరింత ఎక్కువ పెరిగాయి. ఈసీ కూడా వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఫొటోలతో ఫిర్యాదు చేయాలని చెప్పింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులురావడంతో వారిలో చాలా మందిని సస్పెండ్ చేసింది. తమను అనుమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాలంటీర్లు చాలా ప్రాంతాల్లో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే, దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు అప్పట్లోనే ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల విమర్శలు ఆరోపణలు నిజమయ్యాయి. వాలంటీర్లు అధికార ప్రపంచానికి అండగా నిలిచి వారి గెలుపు కోసం కృషి చేశారు. వాలంటీర్ల కారణంగానే 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వాలంటీర్లు పేరుకు ప్రభుత్వ ఉద్యోగులైన అధికార పార్టీ సేవలోనే తరించారు. అధికార పార్టీ వారిని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వాడుకుంది వారి ద్వారానే ఓటర్లకు నగదును ఇతర బహుమతులను అందజేశారు. ఇంటర్వ్యూలు మెరిట్ రిజర్వేషన్లు లేకుండా ఏకపక్షంగా వాలంటీర్లను ఎంపిక చేయడంతో కూటమి ప్రభుత్వం వారిని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు విధితం అవుతుంది. రాజీనామా చేసిన వాలంటీర్లు మాత్రం అధికార పార్టీ అభ్యర్థుల చేత భారీగా నజరానాలు అందుకున్నారు. వ్యవస్థలో ఎక్కువ మంది చేసిన తప్పులకు రాజీనామా చేయని వాలంటీర్లు కూడా ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *