27, నవంబర్ 2024, బుధవారం

బిసిలకు సంక్రాతి వస్తుందోచ్

కొత్త, పాత పధకాల మేళవింపు 

అన్ని కులాలకు ప్రాధాన్యత 

ఆర్థికంగా బలోపేతమే లక్ష్యం 

చిత్తూరు జిల్లా బ్యూరో, ఆంధ్రప్రభ 


గత ఐదు సంవత్సరాలుగా నిర్వీర్యమైన బీసీ కార్పొరేషన్ ను తిరిగి బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో భారీగా కసరత్తు నడుస్తోంది. పాత, కొత్త పథకాల మేళవింపుతో వినూత్న పథకాలను బీసీల అభ్యున్నతికి తీసుకురావాలని ప్రభుత్వం కృతనిర్చయంతో  ఉంది. ఇందులో భాగంగా తొలిత బీసీ కార్పొరేషన్ అధికారులతో అమరావతిలో సమావేశమైన అధికారులు ప్రభుత్వాల లక్ష్యాలను వివరించారు. అందుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో బీసీ నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన పథకాలను రూపకల్పన చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో జిల్లా స్థాయిలో అన్ని జిల్లాల్లో బీసీ సంఘాల నాయకులు సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.  కార్పొరేషన్ అధికారులు సేకరించిన అభిప్రాయాలను  రాష్ట్ర అధికారులకు తెలియజేశారు. ఇటీవల మళ్ళీ రాష్ట్రస్థాయిలో జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర జిల్లా లక్ష్యాల గురించి ప్రస్తావించారు. అలాగే ప్రవేశపెట్టనున్న పథకాల గురించి సూచనప్రాయంగా వెల్లడించారు. కొత్త పథకాల రూపకల్పన గురించి చర్చించారు. త్వరలో పాత కొత్త పథకాలను కలిపి  జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించనున్నారు. దీంతో బీసీ కార్పొరేషన్లు బిజీబిజీ కానున్నాయి.

తొలినుండి  తెలుగుదేశం పార్టీకి అండగా నిలచిన వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నూతన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం  రూపొందించి అమలు చేసింది. అయితే జగన్ ప్రభుత్వం గత ఐదు ఏళ్లలో నవరత్నాల పేరుతో బీసీ కార్పొరేషన్ ను  నిర్వీర్యం చేసింది. బీసీ కార్పొరేషన్ పథకాల నిధులను కూడా నవరత్నాలకు మళ్ళించింది. దీంతో గత ఐదు సంవత్సరాలలో బీసీలకు ఒక పథకం కూడా అందలేదు. గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దయ్యాయి. దీంతో మళ్లీ బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా సరికొత్త పథకాలు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న పథకాలు కొన్ని రద్దయ్యే అవకాశం ఉంది. కొత్తగా లబ్ధిదారుల భాగస్వామ్యంతో వాళ్లకి ఎటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అవసరమో తెలుసుకొని వాటికి అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపకల్పన చేయడానికి బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో బిసి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను సేకరించింది. బీసీ నాయకులుఅభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నూతనంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయడానికి కూటమి ప్రభుత్వం సమాయుత్తమవుతుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బలహీన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయ భూమి కలిగిన రైతులకు బోరు, మోటర్లు ఇవ్వడం, ట్రాక్టర్లు - టాలీలు, వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, పాడి ఆవులు, కిరణా షాపులు, గొర్రెలు మేకలు వంటి పథకాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఆటోలు, పిండిమరలు, బ్యూటీ పార్లర్లు, మొబైల్ రిపేర్, మెకానిక్ షాపులు, ఆధునిక లాండ్రీ, సెంట్రింగ్ మెటీరియల్స్, టెంట్ హౌస్, స్టోన్ కటింగ్, జిరాక్స్- ఇంటర్నెట్, ఫోన్ రిపేర్, కంప్యూటర్ సేల్స్- సర్వీసు, ఇంజనీరింగ్ వర్క్ షాప్ వంటి పథకాలు రానున్నాయి.  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద చేతివృత్తుల వారికి వారికి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అధునాతన పనిముట్లను అందజేశారు. ఈ పథకం మీద కూడా విమర్శలు వచ్చాయి. కులవృత్తుల వారు ఎప్పటికీ వాటి మీద ఆధారపడాల్సిందేనా రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదల ఎప్పుడు అంటూ పలువురు బిసి నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి నూతన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. యువతకు   అభివృద్ధికి అవసరమైన పథకాలను తెలుసుకొని, వాటిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధికారులు ఈ విషయాన్ని జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులకు తెలియజేశారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో బీసీ సంఘం నాయకులు అందర్నీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి అవసరాలను తెలుసుకోవాల్సిందిగా కోరారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి, బీసీల సంక్షేమానికి నూతన పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వంఉంది. జాతీయ బిసి కార్పొరేషన్ నుంచి అత్యధిక నిధులను రాబట్టి దానికి మ్యాచింగ్ రెంటు కింద జిల్లాలో మరికొంత నిధులను ఇచ్చి బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బీసీల వృత్తులను  మెరుగుపరచడానికి పీఎం విశ్వకర్మ పథకాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కూడా భావిస్తోంది. గత ప్రభుత్వం బాకీ ఉన్న డైట్ చార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే వసతి గృహాల్లో విద్యార్థులకు వ్యక్తిగతంగా ఇస్తున్న ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్డింగ్ మెటీరియల్ కోసం నిధులను విడుదల చేసింది. హాస్టల్లో డిజిటల్ కంటెంట్ విద్యా ప్రణాళికను అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద నాణ్యమైన విదేశీ విద్యాసంస్థల్లో అత్యధిక విద్యార్థులకు అవకాశం కల్పించాలని, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని పునర్దించాలని నిర్ణయం తీసుకుంది. బీసీ స్టడీ సర్కిళ్ళ బలోపేతానికి 10 కోట్ల రూపాయలను కేటాయించింది. చిత్తూరులో అసంపూర్తిగా ఉన్న బిసి సంక్షేమ భవన్  నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఐదు చోట్ల డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కులాల వారిగా తలసరి ఆదాయం ఆధారంగా బిపిఎల్ కుటుంబాలను గుర్తించి, వారి ఆర్థిక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక నిర్ణయించాలని నిర్ణయించింది. బిసి లను ఆర్థికంగా బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పధకాల రూపకల్పన తుది దశకు చేరుకుంది. మరో నెల రోజుల్లో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అన్ని కులాలు, అన్ని మండలాలూ, గ్రామాలూ లబ్ది పొందే విధంగా పధకాలను రూపొందిస్తున్నారు. అయిదు సంవత్సరాలుగా అభివృద్ధి పధకాల కోసం ఎదురుచూస్తున్నా బిసిలకు పధకాల సంక్రాంతి రానుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *