ఉలుకూ... పలుకూ లేని చంద్రన్న బీమా
సచివాలయాలలో పేరుకుపోతున్న క్లెయిమ్ లు
ఆవేదన చెందుతున్న భాదిత కుటుంబాలు
ఎనిమిది నెలలుగా వెబ్ సైట్ కు తాళం
నో క్లెయిమ్ పిరియడ్ ఇంకా ఎన్నాళ్లో ?
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నిరుపేదల కోసం రూపొందించిన వైఎస్ఆర్ బీమా పథకం ఆగిపోయింది. నూతన ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడిచినా ఇంత వరకు కొత్త బీమా పథకం జాడ లేదు. వైఎస్ఆర్ బీమా పథకం పేరు మాత్రం చంద్రన్న బీమా పథకంగా మారింది. ప్రభుత్వం ఆదేశాలు జనాన్ని పలకరించాయి. . విధివిధానాలను మాత్రం రూపొందించలేదు. ప్రభుత్వ వెబ్ సైట్ లో చంద్రన్న బీమా ఉలకటం లేదు. పలకటం లేదు. ఏకంగా తలుపులు మూసుకొంది. ఎన్నికల ప్రకటనతో వైఎస్ఆర్ బీమా పథకం ఆగిపోయింది. ఈ పథకం ఆగి ఎనిమిది నెలలు కావొస్తోంది అది ఈ వెబ్ సైట్ కు అప్పుడు వేసిన తాళం ఇప్పటికీ తెరుచుకోవటం లేదు. గ్రామ సచివాలయాలకు చేరిన బీమా క్లెయిమ్ దరఖాస్తులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత జూన్ నెల వరకూ వచ్చిన బీమా క్లెయిమ్ దరఖాస్తులను అప్ లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులన్నీ వైఎస్ఆర్ బీమా క్లెయిమ్ దరఖాస్తులుగానే సచివాలయ సిబ్బంది పరిగణించారు. వీటిని అప్ లోడ్ చేస్తుండగా.. నో క్లెయిమ్ పీరియడ్ అంటూ మెసేజీ వస్తోంది. అంతే ఆ బీమా దరఖాస్తులను అప్ లోడ్ ప్రక్రియ ఆగిపోయింది. భాదిత కుటుంబాలు మాత్రం గ్రామ సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.
*పేదోళ్ల ఇళ్లల్లో గంపెడాశలు*
దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకాన్ని జగన్ సర్కార్ ప్రవేశపెట్టింది. ఈ పథకంలో 1.90 కోట్ల కుటుంబాలకు భరోసా లభించింది. కుటుంబ పెద్ద సహజంగా మరణించినా.. ప్రమాదవశాత్తు చనిపోయినా బీమా పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకాన్ని తీర్చిదిద్దారు. ఇందుకు పేద ప్రజలకు ప్రభుత్వమే బీమా చెల్లించింది. 18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే.. ఆ కుటుంబానికి రూ. లక్ష పరిహారం చెల్లిస్తారు. 18 నుంచి 70 ఏళ్ల వృద్ధులు ప్రమాదంలో మరణించినా, అంగవైలక్యం సంభవించినా రూ. 5 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. బీమా క్లెయిమ్ మొత్తం బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ అవుతుంది. బీమా క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా డబ్బులు వస్తాయి. లబ్ధిదారుడి కుటుంబానికి తక్షణ ఉపశమనం కింద రూ.10 వేలు ఆర్థిక సాయం కూడా అందిస్తారు. పేదలు, అసంఘటిత కార్మిక కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం బీమా ప్రీమియం ఖర్చును భరిస్తుంది. ఏటా రూ.583 కోట్లు బీమా ప్రీమియంను ప్రభుత్వం భరించింది. ఈ బీమా పథకంలో చేరిన ప్రతి కుటుంబ సభ్యుడికి ఒక గుర్తింపు కార్డు ఇచ్చారు. ఇందులో ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య, పాలసీ నెంబర్ ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులను ఈ స్కీమ్‌లో నమోదు చేశారు. ఈ పథకంలో లబ్ధిదారుడి భార్య, 21 ఏళ్ల కుమారుడు, పెళ్లి కాని కుమార్తె, వితంతువు కుమార్తె, ఆమె పిల్లలు, తల్లిదండ్రులను నామినేట్ చేసుకోవచ్చు.
*ఊరింతలే ఊరింతలు*
18 నుంచి 50 ఏళ్ల లోపు కుటుంబ సభ్యులు సహజంగా మరణిస్తే రూ. రెండు లక్షలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 నుంచి 70 ఏళ్ల లోపు సభ్యులు ప్రమాదవశాత్తును మరణిస్తే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10లక్షలకు పెంచుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బీమా పరిహార మొత్తాలను రెట్టింపు చేయటంతో పేద కుటుంబాల్లో ఆశలు పెరిగాయి. కానీ ఈ పథకాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. అందుకే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిలో ఒకరు సహజంగా మరణించినా.. ప్రమాదంలో చనిపోయినా వివిధ ధ్రువీకరణ పత్రాలతో గ్రామ సచివాలయానికి కుటుంబ సభ్యులు వెళ్తున్నారు. ఇక అక్కడ దరఖాస్తులను స్వీకరించడమే తప్ప వెబ్ సైట్ లో అప్లోడ్ చేయడం లేదు. సాధారణంగా బీమా క్లెయిమ్ చేసిన 15 రోజులలో భాదిత కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలి. ఏడు నెలలుగా వెబ్ సైట్ మూతపడడంతో ఏం చేయాలో బాధిత కుటుంబాలకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని చంద్రన్న బీమా వెబ్ సైట్ ను తెరచి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకొంటున్నాయి.