25, నవంబర్ 2024, సోమవారం

పదవుల పందారంలో చిత్తూరు జిల్లాకు వివక్ష !

ఆవేదన చెందుతున్న కూటమి నేతలు 

పార్టీ కార్యక్రమాలకు దూరంగా కొందరు నేతలు 

తిరుపతికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆవేదన 

జిల్లాలో మందకొడిగా టిడిపి సభ్యత్వ కార్యక్రమం 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

కూటమి నేతలు చిత్తూరు జిల్లాపై వివక్ష చూపుతున్నారని కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పటికీ, జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. నామినేటెడ్ పదవులలో కూడా  జిల్లా నేతలకు తగిన ప్రాతినిధ్యం దొరకక పోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న చిత్తూరు పట్టణానికి చెందిన ఒకరికి కూడ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వలేదు. చిత్తూరు నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాకు ఐదు రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. తిరుపతికి చెందిన రవి నాయుడుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, నరసింహ యాదవ్ కు యాదవ కార్పోరేషన్ చైర్మన్, ఎన్ విజయకుమార్ కు బయో డైవర్సిటి చైర్మన్, సదాశివం కు రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. జిల్లాలోని చంద్రగిరి నియోజక వర్గానికి చెందిన సి ఆర్ రాజన్ కు రాష్ట్ర వన్య కుల కార్పోరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అలాగే వివిధ కార్పొరేషన్లకు చెందిన ఐదుగురిని డైరెక్టర్ పదవులు వరించాయి. దీంతో ఎన్నికలలో కష్టించి పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులు కొందరు పార్టీ కార్యక్రమాలను, సభ్యత్వాన్ని కూడా పట్టించుకోవడం లేదు.

చిత్తూరు జిల్లా కుప్పం కు చెందిన మునిరత్నం కు ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే అదే నియోజక వర్గానికి చెందిన ఒకరిని టిటిడి పాలక మండలి సభ్యునిగా నియమించారు. చిత్తూరుకు చెందిన కటారి హేమలతను చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా నియమించారు. టిడిపి బోర్డు చైర్మన్ బి ఆర్ నాయుడు పెనుమూరు మండలంలో జన్మించి నప్పటికీ 40 ఏళ్ళ క్రితమే హైదరాబాదులో స్థిరపడ్డారు. రాజకీయాలకు సంబంధం లేని మీడియా అధినేత. దీనితో పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది. జిల్లా వైసిపిలో బలమైన నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పుడు చిత్తూరు, కడప, కర్నూలు, తిరుపతి జిల్లాల సమన్వయ కర్తగా ఉన్నారు. మరో మాజీ మంత్రి  అధికార ప్రతినిధి రోజా, మాజీ ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి కీలక పాత్ర పోషిస్తున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని జిల్లా అధ్యక్షునిగా నియమించారు. ఆయన ఇప్పటికే చిత్తూరు, జి డి నెల్లూరు, పలమనేరు నియోజవర్గాలలో కార్యకర్తల సమావేశాలు పెట్టి కార్యకర్తలలో ప్రేరణ కలిగించారు. అయితే టిడిపి ఒక సమావేశం కూడ నిర్వహించలేదు. పార్టీ సభ్యత్వం కూడా మందకొడిగా సాగుతోంది. జి డి నెల్లూరులో సభ్యత్వం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో కొందరు కార్యకర్తలు తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు సమర్ధ నేతలకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా పదవుల మూడవ జాబితా రూపొందుతున్నదని తెలిసింది. ఇప్పటి వరకు 20కి పైగా కార్పోరేషన్ లకు చైర్మన్ లను ఎంపిక చేసారని, మరి కొన్నింటికి ఎంపిక చేసి ఈ నెలాఖరుకు ప్రకటిస్తారని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. ఈ నెల 28న  నారావారి పల్లెలో చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి కర్మ క్రియలు ఉన్నందున పదవుల జాబితా విడుదలలో కొంత ఆలస్యం అవుతోందని అంటున్నారు. కాగా మూడవ జాబితాలో అయినా, జిల్లాకు చెందిన నేతలకు పదివులు దక్కుతాయో లేదో వేచి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *