కొత్త పించన్ల విషయమై జిల్లాకు అందని ఆదేశాలు
నవంబరు నెలలో భర్తను కోల్పోయిన వారికే అవకాశం
భర్త పించన్ తీసుకుంటూ మరణించిన వారికే
బిసిలకు 50 సంవత్సరాలకే పించన్ పై కానరాని స్పష్టత
సంవత్సరం రోజులుగా కొత్త పించన్ల కోసం ఎదురుచూపులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
కొత్త పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కేంద్రానికి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. సామాజిక మాధ్యమాలలో మాత్రం జనవరి నుంచి కొత్త పింఛన్లను ఇస్తున్నారని, దరఖాస్తు చేసుకోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో గ్రామ సచివాలయాలకు పించన్ కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. సంబధిత వెబ్ సైట్ ఓపెన్ కాకపోవడంతో వచ్చిన దరఖాస్తులను సిబ్బంది తీసుకుంటున్నా రు. అయితే భర్త పెన్షన్ తీసుకుంటూ నవంబర్ నెలలోమరణిస్తే మృతుని భార్యకు ఆ పెన్షన్లను ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు దరఖాస్తు చేసుకున్న వితంతువుల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. భర్తను పోగొట్టుకున్న వితంతువులు గత 10 నలలుగా పింఛన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వారి విషయం ప్రస్తావించలేదు. అలాగే బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ అందజేస్తామని కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. దాని పైన కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం రోజులుగా కొత్త పింఛన్ల మంజూరుకు బ్రేక్ పడింది. సాధారణంగా ప్రతి 6 నెలలకు ఒక సారి ప్రభుత్వం కొత్త పించన్లను మంజూరు చేస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్త పించన్ లను విస్మరించింది. చివరిసారిగా గత సంవత్సరము డిసెంబర్ లో కొత్త పించన్లు మంజూరు అయ్యాయి. వాటిని జనవరిలో ఇచ్చారు. తరువాత ప్రభుత్వం కొత్తగా పించన్ లను మంజూరు చేయలేదు. ఇదివరకు ఉన్న పింఛన్లను మాత్రం పంపిణీ చేస్తున్నారు. పాత పింఛన్దారులకు వైసీపీ ప్రభుత్వంలో ఇస్తున్న మొత్తాలను పెంచి మరి అందజేస్తున్నారు. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు గత 12 నెలలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తమకు పింఛన్లు ఎప్పుడు వస్తాయని గ్రామ సచివాలయాలు, చుట్టూ మండల కార్యాలయాలు చుట్టూ లబ్దిదారులు కాళ్లు అలిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం కొత్తగా పెన్షన్లను మంజూరు చేయడం లేదని, మంజూరు చేయగానే ఇస్తామని మండల అధికారులు లబ్ధిదారులకు నచ్చ చెబుతున్నారు. జిల్లాలో సుమారుగా 20,000 మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా వితంతు పెన్షన్లను కూడా మంజూరు చేయడం లేదు. గతంలో భర్త చనిపోతే ఆ పింఛన్ ను భార్యకు మరుసటి నెల నుండి అందచేసే వారు. ప్రస్తుతం కొత్త పింఛన్ల మాటను కూటమి ప్రభుత్వం మర్చిపోయింది. గతంలో ఉన్న లబ్ధిదారులకే పింఛన్లు అందజేయడంలోనే నిమగ్నమై ఉంది. దీంతో వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సామాజిక పించన్ల కారణంగా చిత్తూరు జిల్లాలో 2,68,820 మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి ప్రతి 113 కోట్ల రూపాయలను అందచేస్తున్నారు. వీరికి ఏప్రిల్ నెల నుంచి పింఛన్ మొత్తలను కూటమి ప్రభుత్వం పెంచింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కార్మికులు, కళాకారులు, హెచ్ఐవి భాదితులు, హిజ్రాలు, చెప్పులు కుట్టే వారికి మూడు వేల రూపాయల నుంచి 4వేల రూపాయలుగా పెంచారు. అలాగే దివ్యాంగులకు 3000 ఉన్న పెన్షన్ ను 4000 రూపాయలు చేశారు. కుష్టు వ్యాధితో వైకల్యం సంభవించిన వారికి పెన్షన్ కూడా 3వేల నుంచి 6 వేలకు పెరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె అపరేషన్ చేసుకున్న వారికి, డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలసరి పింఛన్ 5000 నుంచి 10000 రూపాయలకు పెంచారు. మంచానికే పరిమితమైన వారికి పింఛన్ 5000 నుండి 15 వేలకు పెరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన సందర్భంగా ఎన్ టి ఆర్ భరోసా పేరుతో అందచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పాత పింఛన్దారులకు పింఛన్ మొత్తాలను పెంచి అందజేయడం పట్ల పింఛన్దారులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని నిర్లక్ష్యం చేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తను కోల్పోయిన వితంతువులు తమకు పింఛన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. భర్త లేకపోవడంతో తమకు జీవనాధారం లేకుండా పోయిందని, తమను ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా ప్రమాదాలలో వికలాంగులైన వారు, ఒంటరి మహిళలు ఆవేదన చెప్పనలివి కావడం లేదు. పించన్ కోసం ప్రతి నెలా ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం నవంబర్ నెలలో మృతి చెంది భర్త పింఛను తీసుకుంటుంటే మృతుని భార్యకు పింఛన్ ప్రతిపాదనలను పంపాలని కోరింది. అంతకుముందు జనవరి నుంచి భర్తను కోల్పోయిన వితంతువుల గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అలాగే ప్రస్తుతం ఎస్టీలు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చెప్పులుకుట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్లకు 50 సంవత్సరాలకే పింఛన్లను అందజేస్తున్నారు. బీసీలకు, ఇతర సామాజిక వర్గాలకు 50 సంవత్సరాలకి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, దాన్ని గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదు. ఇతరుల సంగతి ఎలా ఉన్నా భర్తను, కోల్పోయిన జీవనాధారం లేక అల్లాడుతున్న వితంతువుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవనాధారం కోల్పోయిన తాము ఎలా బతకాలని వితంతు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున, ప్రభుత్వం వితంతు పింఛన్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా వారికి అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.